close

తాజా వార్తలు

Updated : 21/11/2020 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందుకే ఇప్పుడు ఎన్‌సీఏలో ఉన్నా: రోహిత్

ఇంటర్నెట్‌డెస్క్‌: తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తానని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు తనలో ఎలాంటి లోపాలు లేవనే విషయాన్ని స్పష్టం చేయాలనే ఉద్దేశంతోనే బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నట్లు చెప్పాడు. రోహిత్‌ ఇటీవల ఐపీఎల్‌లో ముంబయిని ఐదోసారి విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అనంతరం అతడు టీమ్‌ఇండియాతో ఆస్ట్రేలియాకు వెళ్లకుండా భారత్‌కు తిరిగి వచ్చాడు. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న అతడు ఎన్‌సీఏలో మెరుగవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పీటీఐతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా సిరీస్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. 

‘అసలేం జరుగుతుందనే విషయంపై నాకు స్పష్టత లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. అయితే, నేనొక విషయం చెప్పదల్చుకున్నా. నేను నిరంతరం బీసీసీఐ, ముంబయి ఇండియన్స్‌తో చర్చలు జరుపుతున్నా. లీగ్‌ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెడతానని మా జట్టుకు చెప్పాను. ఆ విషయంలో స్పష్టత వచ్చాక పరుగులు చేయడంపై దృష్టి సారించాను. ఇక ఇప్పుడు తొడ కండరాల గాయం నుంచి కోలుకున్నా. ఇప్పుడిప్పుడే మరింత ఫిట్‌నెస్‌ సాధిస్తున్నా. అలాగే టెస్టు సిరీస్‌ ఆడకముందే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాననే నమ్మకం కలగాలి. ఎందుకంటే ఏ విషయంలోనూ నన్ను వేలెత్తి చూపొద్దని అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఎన్‌సీఏలో ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేం అనుకున్నా పట్టించుకోను’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. ఇప్పుడు 25 రోజుల పాటు పూర్తిస్థాయిలో కోలుకొని టెస్టు సిరీస్‌కు సిద్ధమవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే, తన విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదని రోహిత్‌ పేర్కొన్నాడు.

అలాగే ఐపీఎల్‌లో ముంబయి టీమ్‌ రాత్రికి రాత్రే విజయవంతమైన జట్టు కాలేదని, దానికంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు. జట్టు యాజమాన్యం తమని నమ్మిందని, దాంతో ఒక బలమైన బృందాన్ని నిర్మించామని చెప్పాడు. ఇక ఈ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ట్రెంట్‌బౌల్ట్‌ను రోహిత్‌ కొనియాడాడు. అతడు గతేడాది దిల్లీ తరఫున ఆడాడని, 2020 వేలంలో ఆ జట్టు వదిలేయడంతో తాము కొనుగోలు చేశామన్నాడు. అతడి ఎంపిక పట్ల తాను గర్వంగా ఉన్నట్లు చెప్పాడు.

అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయనప్పుడు అతడే వచ్చి తనతో మాట్లాడాడని ముంబయి కెప్టెన్‌ గుర్తుచేసుకున్నాడు. ఆ విషయాన్ని వదిలేసి ముంబయికి మ్యాచ్‌లు గెలిపిస్తానని తనతో అన్నట్లు చెప్పాడు. దాంతో సూర్య సరైన మార్గంలో పయనిస్తున్నాడని అనిపించిందని తెలిపాడు. ఎప్పటికైనా అతడు భారత జట్టులో ఆడతాడనే నమ్మకం ఉందన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన