
తాజా వార్తలు
‘మా ఫ్రిజ్‌లో అవేమీ ఉండవు’ : చిరంజీవి
హైదరాబాద్: ‘మీరనుకునేది అసలు కాదు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి నవ్వులు పూయించారు. ‘ఆహా’ ఓటీటీ వేదికగా సమంత వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న ‘సామ్‌జామ్’ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా ఓ వీడియోను పంచుకున్నారు. అందులో ‘మీ ఫ్రిజ్ లో ఎప్పుడూ ఉండే ఓ ఐటమ్ ఏమిటి?’ అని సమంత మెగాస్టార్‌ను ప్రశ్నించగా.. ‘మీరనుకునేది కాదు’ అంటూ సరదాగా ఆటపట్టించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది. ఈ మెగా ఎపిసోడ్ డిసెంబర్ 25న ‘క్రిస్మస్’ కానుకగా ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. విజయ్ దేవరకొండతో మొదలైన ఈ షోలో ఇప్పటివరకూ రానా, తమన్నా, రకుల్, క్రిష్ పాల్గొని సందడి చేయడమే కాకుండా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
చిరు ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అందాల నటి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా 153వ చిత్రంగా ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు.