గ్రేటర్‌ ఎన్నికలపై స్టే ఇవ్వలేం: హైకోర్టు 
close

తాజా వార్తలు

Updated : 19/11/2020 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రేటర్‌ ఎన్నికలపై స్టే ఇవ్వలేం: హైకోర్టు 

దాసోజు శ్రవణ్‌ పిల్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించి విచారణ జరపాలని శ్రవణ్‌ తరఫు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని.. విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీ రిజర్వేషన్లు వేర్వేరని న్యాయవాది వాదించారు. 

అనంతరం స్పందించిన హైకోర్టు.. పిల్‌ దాఖలు చేసిన శ్రవణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటివరకు ఏం చేశారని.. ఎంబీసీలపై ప్రేముంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వబోయే చివరి క్షణంలో ఆ విషయం గుర్తొచ్చిందా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దురుద్దేశంతో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారని.. ఎన్నికలు ఆపే రాజకీయ ప్రణాళికతో పిల్‌ దాఖలు చేశారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్‌ విచారణ చేపడతాం కానీ.. ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేసింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని