కశ్మీరులో కంపు ట్రెండ్‌..!
close

తాజా వార్తలు

Published : 28/09/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 కశ్మీరులో కంపు ట్రెండ్‌..!

 మరుగుదొడ్డి అడుగున ఉగ్రస్థావరాలు..!

 సైన్యం దెబ్బకు నయా ఆలోచనలు

ఇంటర్నెట్‌డెస్క్‌

కశ్మీర్‌లో సైన్యం దెబ్బకు ఉగ్రవాదులు ఠారెత్తిపోతున్నారు. అక్కడ ఆర్టికల్‌ 370 రద్దు చేశాక సైనిక దళాల ఆపరేషన్లు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో ఉగ్రవాదులు భారత దళాల నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నారు. గతంలో  గోడల్లో రహస్య బంకర్లను ఏర్పాటు చేసేకొనేవారు.. కానీ, సైన్యం వాటిని పసిగట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వారు నక్కడానికి మరుగుదొడ్ల అడుగున సెప్టిక్‌ ట్యాంక్‌లను వాడుకొంటున్నారని జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ వెల్లడించారు.  
‘సాధారణంగా మా నుంచి తప్పించుకోవడానికి ఉగ్రవాదులు కలుగుల్లో దాక్కోవడం తెలిసిందే. ఇలాంటి ఘటనలకు దక్షిణ కశ్మీర్‌లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక కేసులో అయితే ఇండియన్‌ మోడల్‌ టాయిలెట్‌ సెప్టిక్‌ ట్యాంక్‌లో ఉగ్రవాదులు దాక్కొన్నారు’’ అని సింగ్‌ వెల్లడించారు. 

మార్చిలో అనంతనాగ్‌ ప్రాంతంలోని వాత్రిగామ్‌ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారని సైన్యానికి కచ్చితమైన సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టగా ఎవరూ దొరకలేదు. వాడుకలో ఉన్న మరుగుదొడ్డిలో మాత్రం అప్పుడే తెల్లసిమెంట్‌తో టెయిల్స్‌ అంటించి ఉన్నాయి. దీంతో దళాలకు అనుమానం వచ్చింది.  అక్కడ వాటిని బద్దలు కొడుతుండగా.. లోపల నుంచి  కాల్పులు మొదలయ్యాయి. సైన్యం ఎదురు దాడి చేయడంతో లోపల ఉన్న  నలుగురు లష్కరే ఉగ్రవాదులు మరణించారు. 

2019లో పుల్వామా-షోపియన్‌ మధ్య లస్సీపోరాలో ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారని తెలిసి దళాలు ఆరుసార్లు తనిఖీలు చేశాయి. అయినా ఎవరి జాడా తెలియలేదు. నమ్మకమైన సమాచారం కావడంతో తుదిప్రయత్నంలో ఆ ఇంట్లోని మరుగుదొడ్డి సెప్టిక్‌ ట్యాంక్‌ను బద్దలుకొట్టారు. అక్కడ ఇద్దరు ఉగ్రవాదులు దొరికారు. 

సెలయేర్లు.. కాల్వల్లో..

జుబైర్‌ వాని నేతృత్వంలోని ఉగ్రవాద బృందం రాంబీ అరా సెలయేరు కింద స్టీల్‌ బాక్సుల సాయంతో బంకర్‌ నిర్మించాయి.  వారు సైన్యం నుంచి తప్పించుకొన్న సమయంలో చెప్పుల గుర్తులు ఆధారంగా దళాలు ఆ రాంబీ అనే ప్రాంతంలో ఆ బంకర్‌ను గుర్తించాయి. ఈ సెలయేరు జీలం నదికి అనుబంధంగా ఉంటుంది. తరచూ ఇక్కడ మెరుపు వరదలు వస్తుంటాయి. అటువంటి కాల్వ అడుగున ఉగ్రస్థావరం ఉండటం చూసి సైన్యం అప్రమత్తమైంది. ఇక  లబిపోరా, షోపియన్‌ వద్ద నదుల ఇనుపబాక్స్‌ల సాయంతో బంకర్లు నిర్మించి వీటిల్లోని ఉగ్రవాదులకు గాలిఅందేలా పైపులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సైన్యం ఉగ్రవాదుల వేటకు ఇటీవల కాలంలో డ్రోన్లను రంగంలోకి దించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని