ఒప్పందానికి దగ్గరగా వచ్చారని విన్నాను:ట్రంప్‌
close

తాజా వార్తలు

Updated : 16/09/2020 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒప్పందానికి దగ్గరగా వచ్చారని విన్నాను:ట్రంప్‌

ఒరాకిల్ సొంతం కానున్న టిక్‌టాక్‌ కార్యకలాపాలు!

వాషింగ్టన్‌: చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌ యాప్ అమెరికా కార్యకలాపాలను ప్రముఖ అమెరికన్‌ సంస్థ ఒరాకిల్ సొంతం కానున్నట్లు సమాచారం. ఒరాకిల్ ఒప్పందానికి దగ్గరగా ఉన్నట్లు విన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడమే అందుకు కారణం. కాకపోతే మెజారిటీ యాజమాన్య హక్కులను తన వద్దే ఉంచుకునేందుకు బైట్‌డ్యాన్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టిక్‌టాక్‌ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ, వారి సమాచార భద్రతపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో యాప్ యూఎస్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించేలా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా..బైట్‌డ్యాన్స్‌ అందుకు అంగీకరించలేదు. 

కాగా, తాజా పరిణామంపై ట్రంప్‌ మాట్లాడుతూ..‘వారు ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నారని విన్నాను’ అని అన్నారు. అలాగే దాన్ని ఆమోదించాలా వద్దా అనే దానిపై తమ యంత్రాంగం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఒప్పందం కొలిక్కి వస్తే, బైట్‌డ్యాన్స్‌లో ఒరాకిల్‌ సాంకేతిక భాగస్వామిగా ఉంటూ టిక్‌టాక్‌ సమాచారాన్ని నిర్వహిస్తుంది. అలాగే మైనారిటీ వాటాదారుగానూ ఉండనుంది. మరోవైపు ఈ ఒప్పందం ఖాయమయ్యేలా కనిపిస్తుండగా, టిక్‌టాక్‌ అంతర్జాతీయ వ్యాపారంలో మెజారిటీ వాటాను తన వద్దే ఉంచుకోవాలని బైట్‌డ్యాన్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. యూఎస్‌లో టిక్‌టాక్‌ కేంద్రకార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే టిక్‌టాక్‌ ద్వారా 20వేల అమెరికన్‌ ఉద్యోగాలు సృష్టించడానికి బైట్‌డ్యాన్స్‌ ముందుకు వచ్చిందని ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్నుచిన్‌ సోమవారం వెల్లడించారు. చివరగా..ట్రంప్‌ ఒరాకిల్ ఛైర్మన్‌ లారీ ఎలిసన్‌కు అభిమాని కావడం గమనార్హం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని