
తాజా వార్తలు
ధోనీ రికార్డుపై ‘కోహ్లీ’సేన కన్ను..
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఎంతటి బలమైన జట్టో అందరికీ తెలిసిందే. సొంతగడ్డపై ఆ జట్టును ఓడించడం ఆషామాషీ కాదు. ఫార్మాట్ ఏదైనా స్వదేశంలో కంగారూలు చెలరేగిపోతారు. ఇవన్నీ పక్కనపెడితే, ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా ఇక్కడ ఓ అరుదైన, అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. అదేంటంటే.. రెండు, అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు కలిగిన టీ20 సిరీస్‌లో ఆసీస్‌ను వైట్‌వాష్ చేయడం. 2016లో ధోనీసేన 3-0 తేడాతో ఘన విజయం సాధించి ఆ జట్టును క్లీన్‌స్వీప్ చేయగా.. అంతకన్నా ముందే ఎంజిలో మాథ్యూస్ నేతృత్వంలోని శ్రీలంక 2013లో 2-0 తేడాతో చిత్తు చేసింది. దీంతో ఆస్ట్రేలియా సొంత గడ్డపైనే రెండుసార్లు వైట్‌వాష్‌కు గురైంది.
మరోవైపు ప్రస్తుతం విరాట్ కోహ్లీ నడిపిస్తున్న టీమ్ఇండియా సైతం అదే రికార్డుపై కన్నేసింది. ఇప్పటికే కాన్బెరా, సిడ్నీలో రెండు విజయాలు సాధించి పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఈరోజు జరిగే మూడో టీ20లోనూ గెలుపొందాలని చూస్తోంది. దాంతో టెస్టు సిరీస్‌కు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాను మరోసారి క్లీన్‌స్వీప్ చేయాలనే ఆలోచనతో ఉంది. అదే నిజమైతే మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సరసన విరాట్ కోహ్లీ నిలుస్తాడు. మరో విశేషం ఏమిటంటే గతంలో ఈ సిడ్నీ మైదానంలో ఆడిన ఏ టీ20లోనూ భారత్‌కు ఓటమి ఎరుగలేదు. దీంతో సెంటిమెంట్ పరంగానూ భారత్‌కు మంచి అవకాశమని చెప్పొచ్చు.
ఇవీ చదవండి..