మరోసారి విరాళాలు కోరుతున్న వికీపీడియా
close

తాజా వార్తలు

Published : 31/07/2020 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి విరాళాలు కోరుతున్న వికీపీడియా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏదైనా ప్రదేశం, ప్రముఖ వ్యక్తులు, సంస్థ గురించిన సమాచారం కావాలంటే వెంటనే గుర్తొచ్చేది వికీపీడియా. ఈ సంస్థ వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. రోజువారీ జీవితంలో తలెత్తే వివిధ రకాల సందేహాలకు సమాచారాన్ని ఉచితంగా అందించే మాధ్యమం వికీపీడియా. ఈ లాభాపేక్షలేని సంస్థకు పాఠకుల విరాళాలే పెట్టుబడి. ఆసక్తి గల వ్యక్తులు ఎవరైనా ఇందులో ఖాతా తెరిచి తమకు తెలిసిన కొత్త సమాచారాన్ని ఇతరుల కోసం పొందుపరచవచ్చు. అలా ఎంతో మంది పాఠకుల అభిమానాన్ని చూరగొన్న వికీపీడియా ఇటీవల కాలంలో కొంత ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. భవిష్యత్తులో తమ సంస్థ కార్యకలాపాలను కొనసాగించేందుకు వికీపీడియా పాఠకుల నుంచి విరాళాలను కోరుతోంది. ఇందుకు సంబంధించిన అభ్యర్థన ఇటీవలి కాలంలో వికీపీడియాలో ఏ పేజీ ఓపెన్‌ చేసినా కనిపిస్తోంది. 

‘‘మిమ్మల్ని ఈ విధంగా కోరడం ఇబ్బందికరంగా అనిపించొచ్చు. ఈ రోజు (మనం వికీపీడియా తెరిచిన రోజును ఉద్దేశించి) వికీపీడియా స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు మీరు మాకు సహాయం చేయాలి. మీరు రూ.150 మాకు విరాళంగా ఇస్తే మరికొంత కాలం సంస్థను నడిపేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీకు వికీపీడియా నుంచి విలువైన సమాచారం అందినట్లయితే, విరాళం ఇవ్వడానికి ఒక నిమిషం సమయాన్ని కేటాయించండి. మీరిచ్చే విరాళం మీకు ఈ సమాచారాన్ని అందించిన వాలంటీర్ల పనికి గుర్తింపుగా భావించవచ్చు’’ అని పేర్కొంది. ఇందుకోసం రూ.110 నుంచి రూ.5000 ఆపైన విరాళంగా ఇవ్వవచ్చని పాఠకులను అభ్యర్థిస్తోంది.

ఒకవేళ ముందుగా ఓపెన్‌ చేసిన ట్యాబ్‌ను క్లోజ్‌ చేసి మరో ట్యాబ్‌లో వికీపీడియా సమాచారం కోసం వెతికితే, అందులో ‘‘భారత దేశానికి చెందిన మీరు వికీపీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో గొప్ప విషయం. ఇది మీకు మా రెండో అభ్యర్థన. ఈ రోజు మీ సహాయం మాకు ఎంతో అవసరం. మాకు అమ్మకాలకు సంబంధించి ప్రత్యేక ఉద్యోగులు లేరు. పాఠకుల నుంచి వచ్చే విరాళాలపైన ఆధారపడి మేం సంస్థను నడుపుతున్నాం. రెండు శాతం పాఠకులను మించి మాకు విరాళాలు అందజేయడం లేదు. ఈ రోజు మీరు అందించే డబ్బు వికీపీడియా మరి కొద్ది రోజుల పాటు సేవలను అందించేందుకు ఉపయుక్తం అవుతుంది’’ అని సందేశం కనిపిస్తోంది. అలా మొత్తంగా ఒక రోజులో పేజీ రీఫ్రెష్‌ చేసిన పదిసార్లు పాఠకులను అభ్యర్థించిన తర్వాత ఆ సందేశం మళ్లీ రావడం లేదు. అయితే ఇలాంటి అభ్యర్థన వికీపీడియా సంస్థ నుంచి కొత్త కాదు. 2015లో ఒకసారి వికీమీడియా ఫౌండేషన్‌ పాఠకుల నుంచి ఈ విధంగా విరాళాలను కోరింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని