close

తాజా వార్తలు

Published : 31/08/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

551 వికెట్ల వీరుడికి 51 ఏళ్లు..

వన్డేల్లో టీమ్‌ఇండియా తరఫున 300 వికెట్లు తీసిన ఒకే ఒక్కడు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా తరఫున వన్డేల్లో 300 వికెట్లు తీసిన ఒకే ఒక్క పేసర్‌ అతడు. కెరీర్‌ మొత్తంలో 551 వికెట్లతో అదరగొట్టాడు. పురుషుల ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున జహీర్‌ఖాన్‌తో సమానంగా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు. అతడికన్నా ముందు సరసమైన ఫాస్ట్‌ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడే మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే జవగళ్‌ శ్రీనాథ్‌. ఒకప్పుడు తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల ఆట కట్టించిన అతడు ఇప్పుడు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా పనిచేస్తున్నాడు. ఆ దిగ్గజ పేసర్‌ పుట్టిన రోజు నేడు. అతడు 51వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బీసీసీఐ, ఐసీసీ శుభాకాంక్షలు చెప్పాయి. 

ప్రపంచ క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు ఇప్పుడంటే బుమ్రా, షమి, ఇషాంత్‌, భువనేశ్వర్‌లాంటి మేటి పేసర్లు ఉన్నారు. కానీ, ఒకప్పుడు అడపాదడపా బౌలర్లే ఉండేవారు. వాళ్లు కూడా తమకు వీలైనన్ని రోజులు ఆడి తప్పుకునేవారు. దాంతో టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలింగ్‌లో పెద్ద పేరేమీ లేకపోయేది. అలాంటి రోజుల్లోనే అడుగుపెట్టాడు కర్ణాటక పేసర్‌. తనదైన బౌలింగ్‌తో అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కష్టతరమైన పిచ్‌లపైనా వికెట్లు తీసి జట్టుకు విజయాలను అందించాడు. అలా వన్డేల్లో భారత్‌ తరఫున 300 వికెట్లకుపైగా తీసిన ఒకే ఒక్క బౌలర్‌గా నిలిచాడు. చివరికి 2003 వన్డే ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ కప్పు గెలిచి కెరీర్‌ను ఘనంగా ముగింపు పలకాలని అనుకున్నాడు. కానీ, అది జరగలేదు. దాంతో ఆ వెలతితోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

కాగా, అదే ప్రపంచకప్‌లో ఈ మైసూర్‌ పేసర్‌ శ్రీలంక జట్టుతో ఆడిన ఒక మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఆదిలోనే మార్వన్‌ ఆటపట్టు, జయసూర్య, అరవింద డిసిల్వ, మబారక్‌ల వికెట్లు పడగొట్టి 40 పరుగులకే సగం జట్టును పెవిలియన్‌ పంపాడు. తర్వాత నెహ్రా, జహీర్‌ఖాన్‌ మిగతా వారి పనిపట్టారు. దీంతో భారత్‌ 109 పరుగులకే ఆ జట్టును ఆలౌట్‌చేసి 183 పరుగుల భారీ విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 292/6 పరుగుల స్కోర్‌  చేసింది. సచిన్‌(97) త్రుటిలో శతకం కోల్పోయాడు. శ్రీనాథ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఐసీసీ ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ దిగ్గజ పేసర్‌ ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు 53 టెస్టులు, 223 వన్డేలు, 99 టీ20లకు ఆ సేవలందించాడు. 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.