
తాజా వార్తలు
జగన్ కాన్వాయ్ వెళ్తుండగా రైతుల ఆందోళన
అమరావతి: రాజధాని అమరావతి భూములను విక్రయిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాజధాని రైతులు తేల్చి చెప్పారు. సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్న సమయంలో మందడం వద్ద రైతులు జై అమరావతి, విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ రేషన్ బియ్యం పంపిణీ కోసం రూ.4వేల కోట్లతో కొనుగోలు చేసిన వాహనాలు కొన్ని రోజుల్లోనే మూలనపడుతున్నాయని రైతులు ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఆ డబ్బుతో రాజధానిని అభివృద్ధి చేయవచ్చని రైతులు పేర్కొన్నారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో తాడేపల్లి నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. మందడంలో రైతులు ఆందోళన చేస్తున్న శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో దీక్షా శిబిరం నుంచి ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.