
తాజా వార్తలు
వెంకట్రామిరెడ్డి తీరు ఆక్షేపణీయం: బొప్పరాజు
అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగు సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ప్రవర్తించే తీరు ఆక్షేపణీయంగా, అభ్యంతరకరంగా ఉందని ఏపీ అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సచివాలయ సంఘం నాయకుడు తమకు సంబంధం లేని క్షేత్రస్థాయి ఉద్యోగుల తరఫున ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పేరుతో అతిగా స్పందించారని, వివిధ శాఖపరమైన సంఘాల నేతలను కించపరుస్తూ విమర్శలు చేశారని మండిపడ్డారు. విజయవాడలో ఏపీ అమరావతి ఐకాస సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా వెంకట్రామిరెడ్డి అనుచిత, పరుష పదజాలంతో మీడియాలో స్పందించడంతో ఉద్యోగ సంఘాల పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని.. ఆయన వ్యవహారశైలిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పీపీఈ కిట్లు, ఇతర రక్షణ సౌకర్యాలు కల్పించాలని నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపి ఉద్యోగులకు కరోనా టీకా ఇచ్చేందుకు రెండు, మూడు విడతల ఎన్నికల షెడ్యూల్ను కూడా రీషెడ్యూల్ చేయించాలన్నారు. 11వ పీఆర్సీని మార్చి 31లోపు అమల్లోకి తేవాలని నేతలు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఉగాది నాటికి వారికి తీపికబురు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చదవండి..
ఏకగ్రీవాల ప్రకటనపై వివరణ కోరా: నిమ్మగడ్డ
‘మిమ్మల్ని కోర్టుకు పిలవడం ఇబ్బందిగా ఉంది’