చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
close

తాజా వార్తలు

Updated : 19/03/2021 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

అమరావతి: రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూత్ర, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టినందున అరెస్టు సహా, తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. పిటిషనర్‌ తరఫు వాదనలు పూర్తయిన తర్వాత.. తదుపరి విచారణ ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం 3గంటలకు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

ఆరోపణలకు.. పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదు: సిద్దార్థ్‌ లూథ్రా

సీఆర్‌డీఏ చట్టం ద్వారా తీసుకొచ్చిన జీవో చెల్లదనడం సరికాదని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా వాదించారు. ఐపీసీ 166, 167 సెక్షన్లు ఈ ఫిర్యాదుకు వర్తించవన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసుపెట్టాలని.. ఫిర్యాదులో ఉండే ఆరోపణలకు, పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జీవో విడుదలైన 35 రోజులకు అప్పటి సీఎం ఆమోదించారని చెబుతున్నారని.. అప్పటి సీఎంకు తెలిసి జీవో ఇచ్చారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు కుదరదని.. నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని లూథ్రా గుర్తు చేశారు. అప్పటి సీఎం, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదని.. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. 

అప్పటి గుంటూరు కలెక్టర్‌ విజ్ఞప్తితో జీవోను సవరించారని నారాయణ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టుకు తెలిపారు. జీవోపై చర్చలు, విడుదల ప్రక్రియలో అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదన్నారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని చెప్పారు. వ్యక్తిగతంగా వెళ్లి నష్టం కలిగిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయన్నారు. జీవో ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తే కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వం అన్ని వర్గాలకూ లబ్ధి చేకూర్చిందని దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

చంద్రబాబు వ్యాజ్యంలో పేర్కొన్న అంశాలివే..

విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు కోసం 2014 సెప్టెంబర్‌ 1న కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి సెప్టెంబర్‌ 4న శాసనసభ ముందు ఉంచారు. సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. తర్వాత రాజధాని గ్రామాల ప్రజలకు భూసమీకరణ విధానాన్ని తెలిపాం. రాజధాని నగర ప్రాజెక్ట్‌లో వారు ఎలా భాగస్వాములవుతారో వివరించాం. ప్రజల ఆకాంక్ష మేరకు భూసమీకరణ పథకాన్ని తీసుకొచ్చాం. ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించాం.

* భూసమీకరణపై 2015 జనవరి 1న జీవో 1 జారీ చేశాం. అసైన్డు భూముల హక్కుదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు 2016 ఫిబ్రవరి 17న జీవో 41 ఇచ్చాం. చట్ట నిబంధనల మేరకే ఆ జీవో జారీచేశారు. ఆరేళ్లు గడిచాక రాజకీయ ప్రత్యర్థి దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలోని సభ్యులను అక్రమ కేసుల్లో ఇరికించాలనే దురుద్దేశం దీనిద్వారా స్పష్టమవుతోంది.

* గత ప్రభుత్వ హయాంలో జీవో తీసుకొచ్చారనే కారణంతో అప్పటి సీఎం బాధ్యులనడానికి వీల్లేదు. నిబంధనలపై అభ్యంతరం ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి న్యాయస్థానంలో సవాలు చేసుకోవచ్చు. అంతే తప్ప అప్పటి ప్రభుత్వ హయాంలో నిబంధనలు రూపొందించారనే కారణంతో నన్ను నేర బాధ్యులుగా పేర్కొనడం అసంబద్ధం.

* నూతన భూసేకరణ చట్టం-2013కి విరుద్ధంగా జీవో 41 ద్వారా నిబంధనలు రూపొందించారనేది ఫిర్యాదుదారు ఆరోపణ. అలాంటప్పుడు ఆ చర్య నేరం ఎలా అవుతుంది?

* నవులూరు గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. భూములు తీసుకోవడం వల్ల సొమ్ము నష్టపోయామని గ్రామస్థులుగానీ, భూ జమానులుగానీ ఇన్నేళ్లలో ముందుకు రాలేదు. వారి తరఫున ఎమ్మెల్యే అత్యుత్సాహం చూస్తుంటే సందేహం కలుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని