close

తాజా వార్తలు

Updated : 14/04/2021 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపాకు 70 సీట్లు కూడా దక్కవు: దీదీ

కరోనా తీవ్రతకు భాజపానే కారణమని విమర్శ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కనీసం 70సీట్లలోనూ గెలువలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జలపయ్‌గుడి జిల్లాల్లో పర్యటించిన దీదీ, తృణమూల్‌ కాంగ్రెస్ మరోసారి ‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కానివ్వబోమని స్పష్టం చేశారు. దేశంలో భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పేదలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

‘ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇప్పటివరకు బెంగాల్‌లో జరిగిన 135 అసెంబ్లీ స్థానాల్లో 100 చోట్ల భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 294 నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తైన తర్వాత.. అందులో కనీసం 70స్థానాల్లో కూడా భాజపా గెలువలేదు’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీపై భాజపా నాయకులు ఒక్కోచోట ఒక్కో ప్రకటన చేస్తున్నారని.. అస్సాంలో ఒకవిధంగా, బెంగాల్‌లో మరోవిధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డార్జిలింగ్‌లో అమిత్‌ షా చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని దీదీ విమర్శించారు. ఇక ఎన్నికల సంఘం తనపై తీసుకున్న చర్యలపైనా మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అన్ని వర్గాల వారిని కలిసి ఓటు వేయమని అడగడం తప్పు ఎలా అవుతుంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ ప్రధానమంత్రి మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. మరి వారిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు.

కరోనా తీవ్రత పెరగడానికి వారే కారణం..?

పశ్చిమ బెంగాల్‌ కరోనా వైరస్‌ తీవ్రత పెరగడానికి భారతీయ జనతా పార్టీయే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి ఇతర రాష్ట్రాల వారిని భారీ ఎత్తున బెంగాల్‌కు తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సమయంలో భాజపా నేతలు ఆటంక పరుస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా బెంగాల్‌లో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం సరిగా స్పందించడం లేదన్నారు.

ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో పోలింగ్‌ జరుగనుంది. ఐదో దశలో భాగంగా 44 స్థానాల్లో ఏప్రిల్‌ 17న పోలింగ్‌ జరుగనుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని