మేలుకలుపు అదనం అవసరమైతేనే
close

తాజా వార్తలు

Published : 13/03/2020 00:54 IST

మేలుకలుపు అదనం అవసరమైతేనే

కారు కొంటాం...దాంతోపాటు మనదైన ముద్ర ఉండాలనుకుంటాం...కొత్త పార్ట్‌లు బిగిస్తాం...మార్పుచేర్పులెన్నో చేస్తాం...ఇవన్నీ సరే...ఈ అదనాలు కొన్నిసార్లు ప్రమాదాలూ మోసుకొస్తాయంటారు నిపుణులు...అవేంటో తెలుసుకుందాం..జాగ్రత్త పడదాం.
కారు కొన్న తర్వాత దానికి హంగులు అద్దడానికో, సౌకర్యాలు పెంచుకోవడానికో కొన్ని పార్ట్‌లు బిగిస్తాం. సాధారణంగా వీటి వల్ల ఎక్కువసార్లు అదనపు ప్రయోజనమే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల భద్రతను ఇచ్చేవి కాస్తా ప్రమాదాన్ని కొని తెచ్చేవిగా మారతాయి. అందుకే కొత్త ఓనర్లు సరికొత్త యాక్సెసరీలు బిగించే ముందు ఒక్కసారి ఈ విషయాలు గమనించండి.
స్టీరింగ్‌ కవర్లు..
ఎందుకు?: ప్రస్తుతం కొత్త కార్లలో మంచి గ్రిప్‌ ఉన్న స్టీరింగ్‌లే వస్తున్నాయి. అయినా స్టీరింగ్‌పై ఇంకా పట్టు ఉండాలని, అది పాడు కావొద్దని దానిపై కవర్‌ వేయిస్తుంటారు. అలా చేయడం బాగానే ఉన్నా ఆ కవర్‌ నాణ్యమైంది కాకపోతే యూ టర్న్‌ తీసుకునే సమయంలో చేతులు వాటి మీద నుంచి జారిపోతాయి. అలా జరిగితే ఎదురయ్యే ప్రమాదాలు ఒక్కోసారి తీవ్రంగా ఉండొచ్చు.
జాగ్రత్త: మైక్రో ఫైబర్‌, నాణ్యమైన లెదర్‌, బుడిపెల్లాంటి ఆకారం ఉన్న స్టీరింగ్‌ కవర్లు మంచి పట్టునిస్తాయి. అవే తీసుకోవాలి.

సస్పెన్షన్‌ కిట్స్‌
ఎందుకు?: మట్టిరోడ్లు.. కొండలు, లోయల్లాంటి ఆఫ్‌రోడ్లలో ప్రయాణించేవారు, వాహనానికి పెద్ద టైర్లు బిగించేవాళ్లు ఈ సస్పెన్షన్‌ కిట్లు అమర్చుకుంటారు. ఇవి కారును ఫ్రేమ్‌తో పాటు పైకి లేపగలుగుతాయి. భూమి నుంచి నిర్దేశిత ఎత్తుకు కారు మొత్తం వెళ్తుంది. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ పెరుగుతుంది. ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇక కారు బాడీ లిఫ్ట్‌ కిట్‌ అయితే కేవలం బాడీని మాత్రమే కొంత మేర ఎత్తుకు లేపుతుంది.
జాగ్రత్త: సస్పెన్షన్‌ కిట్‌, బాడీ లిఫ్ట్‌ కిట్‌ రెండూ ఒకేసారి ఇన్‌స్టాల్‌ చేస్తే కారు డైనమిక్స్‌ మారిపోతాయి. మైలేజీ తగ్గుతుంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఈ మార్పులు చేసుకోవాలి.

సన్‌రూఫ్‌..
ఎందుకు?: స్వచ్ఛమైన గాలి, ధారాళమైన వెలుతురు, పిల్లలకు వినోదం.. సన్‌రూఫ్‌తో కలిగే ప్రయోజనాల గురించి ఇలా చెప్పొచ్చు. కదులుతున్న కారు నుంచి పైకి లేచి రెండు చేతులూ చాచి.. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ.. ముఖంపై ముంగురులను సవరించుకునే దృశ్యం చూడాలంటే సన్‌రూఫ్‌ ఉండాల్సిందే.
జాగ్రత్త: సన్‌రూఫ్‌తో వచ్చే కారుని బాడీ నిర్మాణానికి అనుగుణంగా డిజైన్‌ చేస్తారు. కొన్నాక సన్‌రూఫ్‌ బిగించాలనుకుంటే ఆకారంలో మార్పు వస్తుంది. ఏరోడైనమిక్స్‌ మారి పనితీరుపై ప్రభావం పడుతుంది. సన్‌రూఫ్‌ కావాలనుకుంటే, అది ఉన్నదే కొనుక్కోవాలి. తర్వాత బిగించుకోవడం మంచిది కాదు.

ల్యాంప్‌ బ్లాకవుట్‌ కిట్‌
ఎందుకు?: వాహనం స్టైలిష్‌గా కనిపించాలని భావించే వారు హెడ్‌ల్యాంపులు, టెయిల్‌ ల్యాంపులకు వీటిని అమరుస్తుంటారు.
ప్రమాదం: వీటిని వాడటం వల్ల హెడ్‌, టెయిల్‌ ల్యాంపులు నల్లగా మారతాయి. వెలుతురు మందగిస్తుంది. మన కారును చీకట్లో గుర్తించడం ఇతరులకు ఇబ్బంది అవుతుంది. చోదకులకు ప్రమాదకరం.

ఫ్లోర్‌ మ్యాట్ల్లు
అసౌకర్యం: కారులో ఫ్లోర్‌ మ్యాట్లు ఉండాల్సిందే. షూ, పాదరక్షలకుండే దుమ్ము, ధూళీ కారుకి అంటుకోకుండా రక్షణగా ఇవి ఉంటాయి. కాకపోతే ఈ మ్యాట్లు సరైనవి కాకపోతే పెడల్‌ షిఫ్ట్‌ మెకానిజంపై ప్రభావం చూపిస్తాయి. అడ్డు వస్తాయి. డ్రైవరుకి బండి నడపడంలో ఇబ్బంది ఎదురవుతుంది. నాసిరకమైతే చెడు వాసన వస్తాయి.
జాగ్రత్త: కారు మోడల్‌, డిజైన్‌కి అనుగుణంగా లోపల సరిపోయే ఆకృతిలో ఉన్న ఫ్లోర్‌ మ్యాట్లు మాత్రమే ఎంచుకోవాలి. మరీ పెద్ద, చిన్న సైజులవి పనికిరావు.

కర్టెన్లు, ఫిల్మ్‌లు..
ఎందుకు?: కొన్నేళ్ల కిందట ప్రభుత్వం టింటెడ్‌ అద్దాలను నిషేధించింది. దీంతో ఇప్పుడు చాలామంది గోప్యత కోసం, ఎండ నుంచి రక్షణ కోసం బ్లైండ్‌ ఫిల్మ్‌లు, కర్టెన్లు వాడుతున్నారు.
ప్రమాదం: ఇవి వాడుతున్నప్పుడు చోదకుడి దృష్టి కోణం తగ్గుతుంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు. ఇతర వాహనాల శబ్దం సరిగా వినపడదు. ఇది ప్రమాదాలకు ఆహ్వానం పలకడమే. అత్యవసరమైతే తప్ప వీటిని వినియోగించకపోవడమే ఉత్తమం.

ఎల్‌ఈడీ లైట్‌ బార్లు, పెద్ద హారన్‌లు
ఎందుకు?: అత్యధిక వెలుతురుకు, భారీ ధ్వనికి వాడతారు. సాధారణంగా మోటార్‌స్పోర్ట్స్‌ కోసం ఎల్‌ఈడీ లైట్‌ బార్లు వాడతారు.

ప్రమాదం: మన కారు నుంచి ఎక్కువ వెలుతురు రావడం వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు, ట్రాఫిక్‌ కనిపించదు. పెద్ద హారన్‌ వల్ల పక్కవారికి చాలా ఇబ్బంది. వాహనదారులు నియంత్రణ కోల్పోయి ప్రమాదాల బారిన పడే అవకాశముంది. రేసు కార్లలో వాడే ఈ సాధనాలు సాధారణ వాహనాలకు ఉపయోగించాల్సిన అవసరం లేదు. పైగా ష్రిల్‌ హారన్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. చట్ట విరుద్ధం కూడా.
కారు కవర్లు
ఎందుకు?: దుమ్మూధూళీ, వర్షం, ఎండ నుంచి రక్షణ కోసం ఉపయోగిస్తారు. కారు రంగు వెలిసిపోకుండా కాపాడతాయి.
జాగ్రత్త: కవర్లు వాడటం ఎల్లప్పుడూ శ్రేయస్కరమే. కానీ జాగ్రత్తలు పాటించాలి. వాహనం వర్షంలో తడిసి ఉన్నప్పుడు అలాగే కవర్‌ కప్పవద్దు. ఫంగస్‌ తయారవుతుంది. తుప్పు పడుతుంది. ఖరీదైన కార్లు అయితే అదే బ్రాండ్‌కి చెందిన కవర్లు వాడొద్దు. దీంతో చోరుల దృష్టి పడుతుంది.

- బెజవాడ వెంకటేశ్వర్లు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని