సీబీఐ ఏంచేస్తుందో దేశమంతా ఎదురుచూస్తోంది
close

తాజా వార్తలు

Updated : 29/09/2020 17:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీబీఐ ఏంచేస్తుందో దేశమంతా ఎదురుచూస్తోంది

సుశాంత్‌ కేసులో విచారణపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్య

ముంబయి: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో సీబీఐ  ఏం చేస్తుందోనని దేశమంతా ఎదురుచూస్తోందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. మంగళవారం ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.  మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ వస్తోన్న ఊహాగానాలను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కాలం పాటు కొనసాగుతుందని, మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎన్నికలు కోరుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ‘మధ్యంతర ఎన్నికలు ఎవరూ కోరుకోరు.. కానీ కాంబినేషన్‌ పనిచేయకపోతే ఆప్షన్‌ ఉండదు కదా’ అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై రౌత్‌ పైవిధంగా స్పందించారు. చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యల్ని సానుకూల దృక్పథంతో తీసుకుంటామని చెప్పారు. 

గుప్తేశ్వర్‌ పాండే జేడీయూలో చేరికపై..

బిహార్‌ మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూలో చేరడంపై మీడియా ప్రశ్నించగా.. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఎవరికైనా రాజకీయ పార్టీలో చేరే హక్కు ఉంటుందన్నారు. ఆయనతో తమకేమీ వ్యక్తిగతమైన శత్రుత్వం లేదని చెప్పారు. గుప్తేశ్వర్‌ బిహార్‌ డీజీపీగా ఉన్న సమయంలో ముంబయి పోలీసులపై చేసిన వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. ముంబయి పోలీసుల్ని కించపరచవద్దని సూచించినట్టు చెప్పారు. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణంపై ముంబయి పోలీసుల విచారణను తప్పుబట్టిన గుప్తేశ్వర్‌.. సీబీఐ దర్యాప్తు కోరిన విషయం తెలిసిందే. అయితే,  ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఈ కేసులో సీబీఐ ఏం చేస్తుందోనని యావత్‌ దేశం ఎదురుచూస్తోందని రౌత్‌ వ్యాఖ్యానించారు. మాజీ డీజీపీ పాండే కూడా కొంత సమయం పాటు వేచి ఉండాలన్నారు. 

ఇప్పుడు వాళ్లను ప్రశ్నించండి
ముంబయి పోలీసుల దర్యాప్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తిన మీడియా ఇప్పుడు సీబీఐని ప్రశ్నలు అడగాలని రౌత్‌ సూచించారు. నెల రోజులుగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. గతంలో తమను ప్రశ్నించిన మీడియా.. ఇప్పుడు సీబీఐ, పాండే, నితీశ్‌ కుమార్‌ను ప్రశ్నించాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ అంశంపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారన్నారు. తాను మరోసారి మాజీ సీఎం ఫడణవీస్‌ను కలుస్తానని, సామ్నా ఇంటర్వ్యూని పూర్తి చేస్తానని తెలిపారు.  మరోవైపు, సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసులో ఇప్పటివరకు ఎలాంటి ముగింపునకు రాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్టు నిన్న సీబీఐ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని