
తాజా వార్తలు
నాగ్ స్టైల్... నాదే!
ఇంజినీరింగ్ పూర్తిచేసి ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించినా మనోజ్ఞ మనసు అక్కడ ఉండేది కాదు. తన లక్ష్యం ఫ్యాషన్ డిజైనర్ కావాలని. చివరకు ఉద్యోగం వదిలేసి ఆ రంగంలోకి వెళ్లి...స్టైలిస్ట్‌గా మారింది.
నిజామాబాద్‌కు చెందిన అవునూరి మనోజ్ఞ బీటెక్ పూర్తి చేసి, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగానికి ఎంపికైంది. సరికొత్త ఫ్యాషన్లని గమనించడమే కాదు, ట్రెండీ దుస్తులు వేసుకోవడమూ ఆమెకు ఇష్టం. ఎప్పటికప్పుడు ఆ రంగంలోకి వెళ్లాలనుకునేది. ఓరోజు దుస్తుల డిజైన్ చేయించుకునేందుకు వెళ్లిన తను ఆ డిజైనర్‌ని చూశాక ఫ్యాషన్ రంగంపై మరింత ఆసక్తిని పెంచుకుంది. ఆపైన ప్రైవేటుగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. తర్వాత నిఫ్ట్-ముంబయిలో ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ చేసింది. హైదరాబాద్ వచ్చాక ‘సైరా’ సినిమాకు అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్‌గా అవకాశం లభించిందామెకు. ఆ సినిమాలో పాత్రల ఆహార్యం కోసం స్టైలిస్ట్ సుస్మితతో కలిసి దాదాపు ఆరు నెలలు పనిచేసింది మనోజ్ఞ. సైరా తర్వాత హీరో నాగార్జునకు స్టైలిస్ట్‌గా పనిచేసే అవకాశం కొట్టేసింది. నాగ్ చేసే రియాలిటీ షో, వాణిజ్య ప్రకటనలకు ఈమె ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ తర్వాత సమంత, రమ్యకృష్ణలకు సైతం కొన్ని కార్యక్రమాల్లోనూ డిజైనర్‌గా వ్యవహరించింది మనోజ్ఞ. ఆమె పనితనాన్ని మెచ్చి ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నాగచైతన్య, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో అఖిల్ స్టైలిస్ట్‌గా అవకాశం ఇచ్చారు. అంతేకాదు, ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో నాగచైతన్య, సమంతలకు డిజైనర్‌గా వ్యవహరించింది.
- పి.శ్రీశైలం, నిజామాబాద్