ఇంటర్‌ చాలు.. జీతం రూ. 50 వేలు!
close

తాజా వార్తలు

Published : 20/01/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటర్‌ చాలు.. జీతం రూ. 50 వేలు!

వాయుసేనలో గ్రూప్‌ ఎక్స్‌, వై ఉద్యోగాలు

త్రివిధ దళాల్లో ఉద్యోగాల పట్ల యువతకు ఎప్పటికీ తరగని ఆకర్షణ ఉంటుంది. అందులోనూ ఎయిర్‌ఫోర్స్‌ మరింత ప్రత్యేకం. ఇంటర్మీడియట్‌ అర్హతతో వాయుసేనలోకి ప్రవేశించే అవకాశం ఇప్పుడు వచ్చింది. గ్రూప్‌-ఎక్స్‌, వై ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. చిన్న వయసులోనే మంచి జీతం అందుకోవచ్చు. ఉన్నతస్థాయికీ చేరుకోవచ్చు.
ఆకర్షణీయ వేతనంతో, భద్రమైన ఉద్యోగం ఎంతోమంది కల! ఇలాంటి విలువైన ఉద్యోగాలకు పెద్ద డిగ్రీలేమీ అక్కర్లేదు; ఇంటర్‌ చాలు అంటోంది భారతీయ వాయుసేన. నియామక పరీక్ష రాసి ప్రతిభను ప్రదర్శిస్త్తే గ్రూప్‌ ఎక్స్‌, వై ట్రేడుల్లో చేరిపోవచ్చు. ఫిట్టర్‌ లేదా టెక్నీషియన్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభించవచ్చు. తొలి నెల నుంచే రూ.యాభై వేలకు పైగా వేతనం అందుకుని భవిష్యత్తులో మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ స్థాయికి చేరుకోవచ్చు.
గ్రూప్‌ - ఎక్స్‌: ఈ ఉద్యోగాలకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌లతో  ఇంటర్‌ /ప్లస్‌ 2 కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా 50 శాతం మార్కులతో ఏదైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారు అర్హులే. డిప్లొమాలోని ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరి. డిప్లొమాలో ఇంగ్లిష్‌ సబ్జెక్టు లేకపోతే ఇంటర్‌ లేదా పదో తరగతి ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
గ్రూప్‌ - వై: వీటికి ఇంటర్‌ ఏదైనా గ్రూప్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులు ఉండాలి. ఈ గ్రూప్‌లో మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ పోస్టులకు మాత్రం ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరి.
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ చదువుకున్న విద్యార్థులు గ్రూప్‌ - ఎక్స్‌,  గ్రూప్‌ - వై రెండు రకాల ఉద్యోగాలకూ అర్హులే. వీరు ఎక్స్‌, వైల్లో నచ్చిన గ్రూప్‌ కోసం దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసుకోవచ్చు లేదా రెండు గ్రూపులకూ కలిపి నిర్వహించే పరీక్షనూ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేటప్పుడే ఆ విషయాన్ని తెలియజేయాలి. డిప్లొమా విద్యార్థులు గ్రూప్‌ ఎక్స్‌ పోస్టులకే అర్హులు.  
వయసు: జనవరి 17, 2000 - డిసెంబరు 30, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎత్తు: కనీసం 152.5 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి. దృష్టిదోషం ఉండరాదు. వినికిడి సామర్థ్యం స్పష్టంగా ఉండాలి. ఎంపిక:  ఫేజ్‌-1, ఫేజ్‌-2 పరీక్షల ద్వారా.

ఫేజ్‌ -1 పరీక్ష ఇలా...
ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. గ్రూప్‌-ఎక్స్‌ ట్రేడ్‌ పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. గ్రూప్‌-వై పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లిష్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రూప్‌ - ఎక్స్‌, వై రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష 85 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్‌ నుంచే వస్తాయి.
ఎంచుకున్న పరీక్షను బట్టి ఇంగ్లిష్‌లో 20, ఫిజిక్స్‌లో 25, మ్యాథ్స్‌లో 25, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌లో 30 ప్రశ్నలు వస్తాయి.

https://airmenselection.cdac.in లో సిలబస్‌, మాదిరి ప్రశ్నలను అభ్యర్థుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 20, 2020
ఆన్‌లైన్‌ పరీక్షలు: మార్చి 19 నుంచి 23 వరకు నిర్వహిస్తారు.

http://indianairforce.nic.in/


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని