close
Array ( ) 1

తాజా వార్తలు

ఇది మా ఇంటి రాజ్యాంగం

మరి మీకుందా?

దేశం సుసంపన్నంగా, సంతోషంగా, సౌకర్యంగా ఉండటానికి కొన్ని నియమాలు, సూత్రాలు ఉండాలి... ఆ విషయాలు చెప్పేది రాజ్యాంగం... మరి మీ కుటుంబమూ అలా ఉండాలంటే...? మాకూ కొన్ని నియమాలున్నాయి... మరికొన్ని సూత్రాలున్నాయి... మొత్తంగా మాకో రాజ్యాంగమే ఉంది... అంటున్నారు వీరంతా...  మీరూ వీటిని అమలు చేయొచ్చు... ఓసారిలా చూడండి...


పిల్లల కోసమే...

రాజ్యాంగంలోని నిబంధనలు, విషయాలు చాలా మంది పెద్దవాళ్లకే అర్థం కావు. ఇక పిల్లల సంగతైతే చెప్పక్కర్లేదు. అందులో ఉండే పదాలే వారికి కఠినంగా కనిపిస్తాయి. చిన్నారుల కోసమే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుభద్రసేన్‌ గుప్త ‘ది కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా ఫర్‌ చిల్రడన్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో చిట్టి బుర్రలకు చక్కగా అర్థమయ్యేలా హక్కులు, చట్టసభల విశేషాలు... ఇలా అన్ని చక్కగా వివరించారామె. ఇదే కాదు పిల్లల కోసం ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు.


‘సిరి’గమ పదనిస!
ఓ రూపాయిని ఆదా చేస్తే.. ఆ రూపాయిని ఆర్జించినట్లే! అందుకే మా ఇంట్లో దుబారాను సాధ్యమైనంత వరకు తగ్గిస్తాం. అనుకోకుండా వచ్చే కుటుంబ అవసరాల కోసం ఎప్పుడూ కుటుంబ నిధిలో తగినంత డబ్బు ఉండేలా చూసుకుంటాం. ప్రతి నెలా వచ్చే ఆదాయానికి ఇది రెండు మూడు రెట్లు ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాం.

-దీప్తి, చెన్నై


ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే వ్యాయామం!
నేను, మా ఆయన.. ఇద్దరం ఉద్యోగులం. మాకు ఈ మధ్యే వివాహమైంది. ఇద్దరమూ ఒకే చోట పనిచేస్తాం. మావి రాత్రిపూట ఉద్యోగాలే. ఉదయం ఏ నాలుగింటికో.. అయిదింటికో నిద్రపోతాం. మళ్లీ ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలకో.. ఒంటిగంటకో నిద్రలేస్తాం. మేం అప్పుడే వ్యాయామం చేస్తాం. మారిన జీవన శైలిలో గజి‘బిజీ’ బతుకులు, నిత్యం ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో సవాళ్లు.. అందుకే మాకు సమయం దొరికినప్పుడే.. ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే రోజూ ఓ అరగంట వ్యాయామం చేస్తాం. ఇదే మమ్మల్ని ఆ రోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంచుతుంది.

  -నీరజ, హైదరాబాద్‌


అలా అందరం కలుస్తాం

మేమిద్దరం ఉద్యోగాలు చేస్తాం. ఇంటికి రాగానే మా ఫోన్లు పక్కన పడేస్తాం. మరీ అత్యవసరమైతే తప్ప వాటిని ముట్టుకోం. సమయమంతా కుటుంబంతో గడపడానికే చూస్తాం. మాకు ఇద్దరు పిల్లలు. వారిని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారి అభిరుచి మేరకు.. సంగీతం, యోగాలో శిక్షణ ఇప్పిస్తున్నాం. రోజులో కొంత సమయం టీవీ, సోషల్‌ మీడియా కోసం కేటాయించుకుంటాం. వారాంతాల్లో సినిమాకో, షికారుకో, ఎగ్జిబిషన్‌కో, జూకో.. ఇలా ఏదో ఒక కార్యక్రమం కచ్చితంగా పెట్టుకుంటాం. ప్రతి ఆరునెలలకోసారి ఓ లాంగ్‌టూర్‌కు వెళ్లివస్తాం.                    

-సౌమ్య, తిరుపతి


ఆదివారం మా ఇంట్లో నాకు సెలవు
నేనో గృహిణి. మా వారు, పిల్లలు నాకు ఆదివారం సెలవిస్తారు. ఆరోజు నన్ను ఏపనీ ముట్టుకోనివ్వరు. పెందలాడే నిద్రలేవాల్సిన పని లేదు. వాళ్ల కోసం బెడ్‌కాఫీలు, టిఫిన్లు తయారు చేయాల్సిన అవసరం లేదు. వంటావార్పు నుంచి ఇంటి కూర్పు వరకు అన్నీ మా వారు, పిల్లలే చూసుకుంటారు.

  -మానస, విజయవాడ


నెలకో మొక్క నాటుతాం
నాకు మొక్కలంటే ఇష్టం. ఇంతకు ముందు మా కుటుంబ సభ్యుల బర్త్‌డేకు ఓ మొక్క నాటేవాళ్లం. నాకెందుకో ఇది సరిపోదు అనిపించింది. అందుకే మా ఇంటిల్లిపాది కనీసం నెలకో మొక్క నాటుతున్నాం. మాకున్న స్థలం మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. దీన్ని ఆపకూడదని నిర్ణయించుకుని.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడం ప్రారంభించాం. వీటిని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటాం.

-కీర్తన, శ్రీకాకుళం


నెలకో పుస్తకమైనా..
పొద్దస్తమానమూ టీవీకో, సెల్‌ఫోన్‌కో అతుక్కుపోవడం మా ఇంట్లో నిషేధం.  డిజిటల్‌ టైం అని కేటాయించుకుని రోజులో కొంతసమయం మాత్రమే వాటికి వెచ్చిస్తాం. మా ఇంట్లో పిల్లలను కేవలం అకడమిక్‌ పుస్తకాలకే పరిమితం చేయం. వారితో ఇతర స్ఫూర్తిదాయక పుస్తకాలూ చదివిస్తాం. పిల్లలతో పాటు మేమూ పుస్తకాలు చదువుతాం.    

  -సంగీత, రాజమండ్రి


కూరగాయల ధరలు భగ్గుమన్నా..
నిన్న మొన్నటి వరకు కూరగాయలు, ఆకుకూరల ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్‌కు వెళ్తే కనీసం అయిదారు వందల రూపాయలు ఖర్చుపెడితే కానీ వారానికి సరిపడా కూరగాయలు రాని పరిస్థితి. అలాంటి సమయంలోనూ మా కుటుంబం పెద్దగా ఇబ్బంది పడలేదు. మాకున్న కొద్దిపాటి స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు పెంచాం. దీనివల్ల మాకు ఎంతో డబ్బు ఆదా అవ్వడంతో పాటు రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారాన్ని తినగలిగాం. రోజులో కొంత సమయం గార్డెనింగ్‌ కోసం కేటాయించడం వల్ల మనసుకూ ఆహ్లాదకరంగా ఉంటుంది.  

-ఫర్జానా, ఖమ్మం


ఆడపిల్లలను గౌరవించమని చెబుతా  
మాకు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. ఇద్దరినీ సమానంగా చూస్తాం. నేను మా అబ్బాయితో ఎప్పుడూ ఒకే విషయం చెబుతుంటా. రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలు, మహిళలూ ఎవరో ఒకరికి అమ్మ, చెల్లి అవుతారు. నన్ను, మీ చెల్లిని ఎవరైనా ఏమైనా అంటే నువ్వు ఎలా బాధపడతావో... వాళ్లూ అంతే ఇబ్బంది పడతారు. కాబట్టి మహిళలతో గౌరవ మర్యాదలతో నడుచుకోమని ప్రతిసారీ చెబుతుంటా.

-మాలతి, గుంటూరు


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.