close

తాజా వార్తలు

Updated : 21/04/2020 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీఎమ్‌డబ్ల్యూ ఇండియా సీఈఓ హఠాన్మరణం

దిల్లీ: బీఎమ్‌డబ్ల్యూ ఇండియా సీఈఓ రుద్రతేజ్‌ సింగ్‌(46) గుండెపోటుతో మరణించారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అనుకోనిరీతిలో, హఠాత్తుగా సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారని.. కారణాలు తెలియాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. సవాలుభరిత వాతావరణంలోనూ కంపెనీని ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని బీఎమ్‌డబ్ల్యూ ఆ ప్రకటనలో వివరించింది. బీఎమ్‌డబ్ల్యూలో రుద్రతేజ్‌ ఆగస్టు 2019లో చేరారు. వాహన, వాహనేతర పరిశ్రమల్లో ఆయనకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బీఎమ్‌డబ్ల్యూకు ముందు ఆయన రాయల్‌ఎన్‌ఫీల్డ్‌లో గ్లోబల్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతక్రితం యునిలీవర్‌కు చెందిన భారత, అంతర్జాతీయ కార్యక్రలాపాల్లో 16 ఏళ్ల పాటు కీలక పాత్ర పోషించారు.


హ్యుందాయ్‌ రూ.7 కోట్ల విరాళం

దిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌ -19) వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సాయపడేందుకు పీఎం కేర్స్‌ నిధికి రూ.7 కోట్ల విరాళం ఇచ్చినట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వానికి రూ.5 కోట్లు, రూ.4 కోట్ల విలువైన పరీక్షా కిట్లను కూడా కంపెనీ అందచేసింది.


మరికొన్ని వారాలు ఉత్పత్తి నిలిపివేత: జేఎల్‌ఆర్‌

లండన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గనందున, మరికొన్ని వారాల పాటు ఉత్పత్తి నిలిపి వేస్తున్నట్లు టాటా మోటార్స్‌ ఆధీనంలోని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ప్రకటించింది. ప్రభుత్వ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జనవరి-మార్చిలో జాగ్వార్‌ మోడళ్ల విక్రయాలు 42 శాతం, రేంజ్‌ రోవర్స్‌-ల్యాండ్‌ రోవర్స్‌ విక్రయాలు 25 శాతం తగ్గినట్లు సంస్థ వెల్లడించింది.


ఏప్రిల్‌ వేతనాల్లో 20 శాతం వరకు కోత: ఎయిరేషియా ఇండియా

ముంబయి: తమ సిబ్బందికి ఏప్రిల్‌ వేతనాల్లో 20 శాతం వరకు కోత విధిస్తున్నట్లు ఎయిరేషియా ఇండియా ప్రకటించింది. మే 3 వరకు విమానాలు నిలిచిపోతున్నందున, ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రూ.50,000 కంటే తక్కువ వేతనం పొందేవారికి మాత్రం ఎటువంటి కోత విధించడం లేదని స్పష్టం చేసింది. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బందికి 20 శాతం, ఎగ్జిక్యూటివ్‌లకు విభాగాల వారీగా 17, 13, 7 శాతం చొప్పున వేతన కోత విధిస్తున్నట్లు వెల్లడించింది.


యాత్రా డాట్‌ కామ్‌లోనూ..

ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ సేవలు అందించే యాత్రా డాట్‌ కామ్‌ తమ సిబ్బందిలో విధులు నిర్వర్తిస్తున్న వారికి 25-75 శాతం వరకు, విధులే లేని వారికి ఏప్రిల్‌ 16 - జూన్‌ 30 వరకు వేతనం లేని సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నామని, ఇది తాత్కాలికమేనని సంస్థ పేర్కొంది. సంస్థ వ్యవస్థాపకుడు కూడా 50 శాతం వేతనమే తీసుకుంటున్నట్లు తెలిపింది.


పొదుపుఖాతా నిధులపై వడ్డీ మళ్లీ తగ్గింపు: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

ముంబయి: పొదుపు ఖాతా (సేవింగ్స్‌బ్యాంక్‌) నిధులపై వడ్డీరేటును మరోసారి తగ్గిస్తున్నట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్‌లోనే డిపాజిట్‌ రేట్లను ఈ బ్యాంక్‌ తగ్గించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ 1న పొదుపు ఖాతా నిధులపై వడ్డీరేటును బ్యాంక్‌ తగ్గించిన సంగతి విదితమే. సోమవారం బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ కపూర్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్‌ 20 నుంచి కొత్తరేట్లు అమల్లోకి వచ్చాయి. రోజువారీ నిల్వలపై రూ.లక్ష వరకు 3.75 శాతం వడ్డీ, రూ.లక్షకు మించి ఉంటే 4.5 శాతం వడ్డీ చెల్లిస్తామని తెలిపింది.


ఐసీఐసీఐ బ్యాంక్‌ వాయిస్‌ బ్యాంకింగ్‌ సేవలు

దిల్లీ: మాట ద్వారా (వాయిస్‌ బేస్డ్‌) బ్యాంకింగ్‌ సేవల్లో కొన్నింటిని పొందే అవకాశాన్ని తమ ఖాతాదార్లకు కల్పించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. అమెజాన్‌ అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌ వంటి వాటితో, తమ కృత్రిమమేధ ఆధారిత చాట్‌బాట్‌ ఐపాల్‌ను జతచేయడం ద్వారా రిటైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాదారులు కొన్నిరకాల సేవలు మాటతోనే వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఖాతాలో నిల్వ తెలుసుకోవడం, క్రెడిట్‌కార్డు వివరాలు, మరికొన్ని విచారణలు ఇలా చేసుకోవచ్చని వివరించింది. ఇంటినుంచే బ్యాంక్‌ లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఇది మరొక అవకాశమని తెలిపింది.


ఎంపీసీ తదుపరి సమావేశం జూన్‌ 3-5 తేదీల్లో: ఆర్‌బీఐ

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాలు నిర్వహించబోయే తేదీలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరగాల్సిన సమావేశాన్ని కరోనా వైరస్‌ నేపథ్యంలో, మార్చి 24-27 తేదీల్లో నిర్వహించిన సంగతి విదితమే. తదుపరి సమావేశం జూన్‌ 3-5 తేదీల్లో జరగనుంది. అనంతరం 2020 ఆగస్టు 4-6 తేదీల్లో, సెప్టెంబరు 29-అక్టోబరు 1, డిసెంబరు 2-4, 2021 ఫిబ్రవరి 3-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆరుగురు సభ్యులున్న ఎంపీసీ 2016 అక్టోబరు నుంచి ఇప్పటివరకు 22 సార్లు సమావేశమైంది. సమావేశాల ఆఖరిరోజు నిర్ణయాలు బహిర్గత పరుస్తారు.

ఆర్థికసంఘం సలహామండలి సమావేశం 23-24 తేదీల్లో
15వ ఆర్థిక సంఘం సలహామండలి సమావేశం ఈనెల 23-24 తేదీల్లో జరగనుంది. జీడీపీ వృద్ధిపై కరోనా వైరస్‌ ప్రభావం, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రభుత్వం చేయాల్సిన వ్యయాలపై చర్చించే అవకాశముంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.