మూడేళ్ల ప్రేమ.. మూడు నెలలకే యమపాశం
close

తాజా వార్తలు

Updated : 21/08/2020 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడేళ్ల ప్రేమ.. మూడు నెలలకే యమపాశం

రెడ్డిపాలెం(గుడ్లవల్లేరు) : ఆమె పాలిటెక్నిక్‌ విద్యార్థిని.. అతను ఆటో డ్రైవర్‌.. ఇద్దరూ మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు.. మూడు నెలల కిందట ఒక్కటయ్యారు.. ఈ క్రమంలో వేధింపులు భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడి కన్నవారికి శోకాన్ని మిగిల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డిపాలెంకు చెందిన రైతు కూలి పోసిన నరసింహారావు, అంకమ్మలకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె విజయలక్ష్మి(19) గుడ్లవల్లేరులో గతేడాది పాలిటెక్నిక్‌ పూర్తి చేసింది. ఆ సమయంలో బంటుమిల్లి మండలం బర్రిపాడుకు చెందిన జోగి సూర్యప్రకాశ్‌ పెడన నుంచి గుడ్లవల్లేరుకు ఆటో నడిపేవాడు. ఆమె అతడి ఆటో ఎక్కి గుడ్లవల్లేరు కళాశాలకు వచ్చేది. ఈ క్రమంలో వారు ప్రేమించుకున్నారు.

ఇది ఇంట్లో తెలిసి విజయలక్ష్మిని తల్లితండ్రులు వారించారు. అనంతరం అంగీకరించి సూర్యప్రకాశ్‌తో మూడు నెలల కిందట వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఏమీ వద్దని అత్తింటి వారు పేర్కొన్నారు. తరువాత కట్నం కావాలని, ట్రాక్టర్‌ కొనివ్వాలంటూ వేధింపులకు గురి చేయడంతో విజయలక్ష్మి రెండు పర్యాయాలు పుట్టింటికి వచ్చింది. తండ్రి కుమార్తెకు సర్దిచెప్పి అత్తింట దిగబెట్టి వచ్చారు. కాస్త సమయం తీసుకుని కట్నకానుకలు అందిస్తానని వారికి నచ్చజెప్పారు. రెండు రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో విజయలక్ష్మి పుట్టింటికి వచ్చేసింది. గురువారం తల్లి, తండ్రి, చెల్లి పొలం పనులకు వెళ్లారు. తల్లిదండ్రులు వచ్చేసరికి విజయలక్ష్మి చీరతో ఉరివేసుకుంది. దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పామర్రు సీఐ కిశోర్‌బాబు, ఎస్‌ఐ సూర్యశ్రీనివాస్‌, తహశీల్దార్‌ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్వో రమేశ్‌ శవపంచనామా నిర్వహించారు. భర్త, అత్తింటి వారు కట్నం కోసం వేధించడంతో తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు 20 నిమిషాలపాటు భర్తతో మాట్లాడిన మాటలు సెల్‌లో రికార్డు అయినట్లు బంధువులు ఆ మాటల్ని అందరికీ వినిపించారు. అందులో ‘తాను మూడేళ్లు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి మోసపోయానని, తాను చనిపోతున్నానని, దీనికి నువ్వు, మీ అమ్మ, నాన్న, చెల్లే కారణమని’ ఆమె మాట్లాడింది. ఈ ఆడియో రికార్డింగ్‌ను పోలీసులు పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని బంధువులు, గ్రామస్థులు పేర్కొంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని