‘పొత్తూరి’ మృతికి ప్రముఖుల సంతాపం
close

తాజా వార్తలు

Published : 05/03/2020 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పొత్తూరి’ మృతికి ప్రముఖుల సంతాపం

అమరావతి: ప్రముఖ పాత్రికేయుడు, ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వర రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పొత్తూరి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటని, ఐదు దశాబ్దాలకు పైగా పొత్తూరి పాత్రికేయ రంగానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 

ఒక గొప్ప ఆత్మీయుడిని కోల్పోయాను: చంద్రబాబు

సీనియర్ జర్నలిస్ట్‌గా పొత్తూరి సేవలు ప్రశంసనీయమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పాత్రికేయుడిగా పొత్తూరి కృషి చిరస్మరణీయమని, ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఆయన సేవలు మరువలేనివన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి ఆద్యుడు పొత్తూరి అని కొనియాడిన చంద్రబాబు.. పాత్రికేయులందరికీ ఆయన మార్గదర్శకుడన్నారు. సామాజిక బాధ్యతతో జర్నలిజానికే వన్నెతెచ్చారని చెప్పారు. తన రచనలతో, వ్యాసాలతో జాతిని జాగృతం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రైతు సమస్యల అధ్యయన కమిటీలో కోడెల శివప్రసాద రావు, కరణం బలరామ్‌లతో కలిసి పొత్తూరి పని చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తనదైన ప్రత్యేక శైలి చూపారన్నారు. వ్యక్తిగతంగా తాను గొప్ప ఆత్మీయుడిని కోల్పోయానని బాబు ఆవేదన చెందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్,  తెలుగు పత్రికారంగ ప్రముఖుడు, తొలితరం జర్నలిస్టుల్లో ఒకరైన డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం జర్నలిజానికి తీరని లోటని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఐదు దశాబ్దాలుగా ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో సంపాదకులుగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ అధ్యక్షునిగా పలు హోదాల్లో ఆయన చేసిన సేవలను కొనియాడారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.   

పొత్తూరి వెంకటేశ్వరరావు పత్రికా రంగంలో ఐదు దశాబ్దాలకుపైగా సేవలు అందించి పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు లోకేశ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని