close

తాజా వార్తలు

Updated : 26/09/2020 08:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరని నిప్పు.. విచారణ ముప్పు

రాగిణికి దక్కని బెయిల్‌

బెంగళూరు (యశ్వంతపుర): మాదక ద్రవ్యాల కేసు సినీ, బుల్లితెర రంగాలకు పెను ముప్పుగా మారింది. డ్రగ్స్‌ వాడుతున్న వారెవరో.. వాడనిదెవరో తేలేసరికి ఎందరెందరు విచారణ ఎదుర్కొంటరో అర్థంకాని పరిస్థితి. తాజాగా మరిందరు నటులు విచారణ బాట పట్టక తప్పడం లేదు. ఇప్పటికే అరెస్టైన సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను శుక్రవారం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారణ చేపట్టారు. న్యాయస్థానం అనుమతితో వారిద్దరితో పాటు రవిశంకర్‌, రాహుల్‌, విరేన్‌ఖన్నాలను విచారించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సినీ కథనాయికలను కారాగారంలోనే ఈడీ అధికారులు విచారించడం ప్రారంభించారు. అక్రమ నగదు వ్యవహారం, హవాలా, బిట్‌ కాయిన్‌ ద్వారా లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు ప్రశ్నలను సంధించారు. సంపాదన- ప్రస్తుతం ఆ ఇద్దరి ఆస్తుల విలువలను అంచనా వేశారు. ఆస్తుల్ని ఏవిధంగా సంపాదించారో ప్రశ్నించారు. సినిమాలో నటించడం ద్వారా ఎంత పారిపోషకం తీసుకుంటున్నారు? దానికి ఎంత ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు? ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు? వాటి కోసం నగదు ఎలా సంపాదించారు? శ్రీలంక క్యాసినో క్లబ్‌కు వెళ్లడం ద్వారా ఎంత సంపాదించారు? నిర్వాహకులు ఏవిధంగా నగదు పంపించేవారు? మాదక ద్రవ్యాల విక్రయాల్లో వాటా ఉందా..? అంటూ ప్రశ్నల బాణాలు సంధించడంతో నటీమణులు నోళ్లువెళ్లబెట్టారు. ఆ ప్రశ్నలకు ఇద్దరూ బిత్తర పోయినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హవాలా, బీట్‌ కాయిన్‌ద్వారా భారీ మొత్తం నగదు చేతులు మారినట్లు ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో ఐదు రోజులు వారికి ఈ విచారణ ముప్పు తప్పదని సమాచారం.

యాంకర్‌ విచారణ?

మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాకు సంబంధించి సినీ నటి, యాంకర్‌ అనుశ్రీని విచారించేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆమెను మంగళూరు నగర పోలీసులు విచారిస్తున్నారు. ఆమె నివాసం యశ్వంతపురలో ఉంది. నగరంలో జరిగిన కొన్ని ‘మందు’ పార్టీలకు ఆమె హాజరైనట్లు నిందితుడు రోహిత్‌శెట్టి మంగళూరు పోలీసుల విచారణలో వెల్లడించడంతో అధికారులు ఇటు దృష్టి సారించారు. బెంగళూరు నగరంలో ఏప్రాంతంలో విందు పార్టీలు జరిగాయి? వాటికి ఎంత మంది హాజరయ్యారు? వారిలో ప్రముఖులు ఉన్నారా? అనుశ్రీతోపాటు ఎవరు హాజరయ్యారు? ఆమె మత్తు పదార్థాలను తీసుకునేవారా?.. అనే అంశాలపై విచారించేందుకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సీసీబీ వర్గాలు వెల్లడించాయి.

సినీ నటి రాగిణి ద్వివేది ఆప్తుడు లూమ్‌ పెప్పర్‌ అనుచరుడు నైజీరియా దేశానికి చెందిన ఒస్సి అనే నిందితుడ్ని సీసీబీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5లక్షల విలువ చేసే ఎండీఎంఎ మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మత్తు పదార్థాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొంత మందికి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైయినట్లు పోలీసులు తెలిపారు.

కారాగారంలోనే కథానాయికలు

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, ఇతర నిందితుల జామీను అర్జీ విచారణ సోమవారానికి వాయిదా పడింది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారికి జామీను మంజూరు చేయవద్దంటూ ఆక్షేపణల అర్జీని సీసీబీ తరఫు న్యాయవాది దాఖలు చేశారు. రాగిణి, సంజనలను కారాగారంలో ఈడీ అధికారులు శుక్రవారం వేర్వేరుగా విచారించారు. నగదు లావాదేవీలు, వారి నివాసాల్లో ఖరీదైన వస్తువుల కొనుగోలు తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు. సోమవారం వరకు వీరిని ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.