close

తాజా వార్తలు

Updated : 20/01/2021 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వింతగా చంపేస్తోంది

మన్యంలో వరుస మరణాలు

గ్రామస్థుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న పీవో కూర్మనాథ్‌

పాచిపెంట, సాలూరు, న్యూస్‌టుడే: మన్యంలో వింత వ్యాధులతో వరుస మరణాలు ఆగడం లేదు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న గిరిపుత్రులు మరణిస్తున్న విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. 2009లో పాచిపెంట మండలం చిల్లమామిడిలో వింత వ్యాధితో పదిమంది మృతి చెందగా, అదే గ్రామంలో 2020 నవంబరులోనూ వరుస మరణాలు సంభవించాయి. మెలియాకంచూరు పంచాయతీ ధూళిభద్రలోనూ వింత వ్యాధి గిరిజనుల ప్రాణాలను తీసేసింది. ప్రస్తుతం కంకణాపల్లిని చుట్టేస్తోంది.

గతేడాది నవంబరులో చిల్లమామిడిలో ఒళ్లు పొంగులు, పచ్చకామెర్లు, తీవ్ర జ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అనంతరం అధికారులు గ్రామాన్ని సందర్శించి 147 మందికి వైద్య పరీక్షలు చేయించి విశాఖ కేజీహెచ్‌, నెల్లిమర్ల మిమ్స్‌కు తరలించారు. ఆ గ్రామంలో ప్రజలు తాగుతున్న నీటిని పరీక్షించారు. ఆహారం, మడ్డికల్లు నమూనాలు కూడా సేకరించారు. ఇంత వరకు కారణం ఏమిటి? ఎందుకు మరణించారో అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇదే విషయమై డిప్యూటీ డీఎంహెచ్‌వో రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ పరీక్షల్లో ఎవరికీ ఎలాంటి సమస్య లేదని నివేదిక వచ్చినట్లు తెలిపారు. వయసు మీరిన వారు, అతిగా మద్యం తాగిన వారు మరణిస్తే వింత వ్యాధిగా పరిగణిస్తున్నారని చెప్పారు.

ఎప్పుడు.. ఎవరు చనిపోతున్నారో.. ‘మేం ఏ పాపం చేశాం. వింత రోగంతో ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో తెలియడం లేదు.. ఒకరా.. ఇద్దరా.. వృద్ధులు, యువకులు అని తేడా లేకుండా వరుసగా పది మంది మరణించారు. మాకే ఎందుకీ శిక్ష అంటూ’ కంకణాపల్లి గ్రామస్థులు అధికారుల ముందు కన్నీరు పెట్టుకున్నారు. కేవలం 50 కుటుంబాలు మాత్రమే ఉన్న గ్రామంలో వరుస మరణాలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 17న మరణించిన రామకృష్ణ(21) పచ్చకామెర్లతో మృతి చెంది ఉంటాడని వైద్యులు నిర్ధారించగా.. మడ్డికల్లు, నాటుసారా, కలుషిత నీరుతోనే మరణాలు జరుగుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మందిలో వాపులు ఉన్నట్లు చెబుతున్నారు.

నీరు కలుషితం.. మా గ్రామంలో సరైన తాగునీటి వసతి లేదు. ఏడాదిగా మంచినీటి పథకం పనిచేయడం లేదు. గ్రామ శివారులోని రెండు పాడుబడిన బావుల్లోని నీటినే తాగుతున్నాం. వాడుక నీరు, మురుగు ఈ బావుల్లో చేరి నీరు కలుషితమవుతోంది. - గెమ్మెల భాస్కరరావు, గ్రామస్థుడు

కడుపునొప్పి అని.. అప్పటి వరకు మా కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. పొలం పనికి వెళ్లి తిరిగి వచ్చి శనివారం కడుపునొప్పిగా ఉందని చెప్పాడు. ఆదివారం వైద్యానికి ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. గతేడాది సెప్టెంబరులో ముగ్గురు, అంతకు ముందు కూడా కొందరు మరణించారు. - గెమ్మెల కామయ్య, రామకృష్ణ తండ్రి

మరణాలు పునరావృతం కాకుండా: మన్యంలో మరణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. వైద్యులతో సమావేశం నిర్వహించాం. ప్రతి గ్రామంలోనూ నెలకోసారి వైద్య శిబిరం ఏర్పాటు చేసి గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించాం. కంకణాపల్లిలో వారం పాటు వైద్య శిబిరాలు కొనసాగిస్తాం. - ఆర్‌.కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో

 

 



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని