
తాజా వార్తలు
ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం
నిరసనకారులను సముదాయిస్తున్న పోలీసులు
కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో బాలికను లోబరుచుకొని అత్యాచారానికి పాల్పడిన ఘటన బోయిన్పల్లి ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆయా సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. బోయిన్పల్లి సీఐ రవికుమార్ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బాలిక(16)ను ఆమె తల్లిదండ్రులు స్థానికంగా ఓ వసతిగృహంలో చేర్పించారు. అక్కడినుంచి పారిపోవడంతో.. నల్గొండలోని చైల్డ్ వెల్ఫేర్ హోంలో చేర్పించారు. అక్కడి నుంచీ తప్పించుకునేందుకు యత్నించడంతో.. గత ఏడాది ఓల్డ్ బోయిన్‌పల్లిలోని పెద్దమ్మ ఇంట్లో వదిలి వెళ్లారు. సంగారెడ్డి జిల్లా, కోహిర్‌కు చెందిన ఇర్ఫాన్(25) ఓల్డ్ బోయిన్‌పల్లికి వచ్చి అద్దెకు ఉంటూ, ఓ మతపెద్ద వద్ద పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం బాలికతో పరిచయం ఏర్పడింది. ఆమెను లోబరుచుకుని పలుమార్లు వాంఛ తీర్చుకున్నాడు. బాలిక ఈనెల 3న ఇంట్లో ఎవరికి చెప్పకుండా గుంటూరు వెళ్లింది. మరుసటి రోజు ఇర్ఫాన్ సైతం అక్కడికి వెళ్లాలనుకున్నాడు. అప్పటికే బాలిక పెద్దమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఈనెల 4న ఇక్కడే ఉన్న ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. అతను ఇచ్చిన సమాచారంతో గుంటూరు బస్టాపు వద్ద బాలికను అదుపులోకి తీసుకున్నారు. బోయిన్‌పల్లికి తీసుకువచ్చి బంధువులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి శుక్రవారం రిమాండుకు తరలించారు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై లైంగిక దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ.. భాజపా, ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నేతలు శుక్రవారం బోయిన్పల్లి ఠాణా వద్ద ధర్నా చేశారు. ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్, బేగంపేట్ ఏసీపీ నరేశ్‌రెడ్డి ఠాణాకు చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి.