
తాజా వార్తలు
కొత్త మాస్క్ గురూ.. ఇక గుర్తు పట్టేయొచ్చు!
కొట్టాయం: కరోనాతో నెలకొన్న కష్ట కాలంలో ఎక్కడ చూసినా జనం మాస్క్‌లతోనే కనబడుతున్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ఈ మహమ్మారితో కలిసి బతకాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రతిఒక్కరి జీవితంలో మాస్క్ ధరించడం తప్పనిసరైంది. నిత్యావసరంగా మారిన మాస్క్‌లకు గిరాకీ ఏర్పడటంతో రోజురోజుకీ కొత్త కొత్త వెరైటీలతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే, మాస్క్‌లు పెట్టుకున్నవారి ముక్కు, నోరు, గడ్డం మూసి ఉండటంతో వారిని గుర్తుపట్టడం కష్టతరంగా మారింది. ఈ ‘గుర్తింపు’ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న కేరళకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ వినూత్నంగా ఓ మాస్క్‌ను రూపొందించి తనదైన ప్రత్యేకతతో వార్తల్లో నిలిచారు. కేరళలోని కొట్టాయంలో ఏటుమానూరుకు చెందిన 38 ఏళ్ల బినేశ్ జి పాల్ రూపొందించిన ఈ మాస్క్‌ను ఎవరైనా పెట్టుకుంటే అవతలివాళ్లు వెంటనే గుర్తు పట్టగలరు.
20 నిమిషాల్లోనే మాస్క్ రెడీ..
దాదాపు 10 ఏళ్లుగా ఫొటో గ్రఫీ రంగంలో పనిచేస్తున్న బినేశ్ ఈ మాస్క్ తయారీ గురించి వివరిస్తూ.. ‘‘ఎవరికైతే మాస్క్ తయారు చేస్తున్నామో హై రిజల్యూషన్ కెమెరాతో వారి ఫొటో తీసుకోవాలి. ఆ తర్వాత ఓ ప్రత్యేక కాగితంపై దాన్ని ప్రింట్ తీయాలి. అనంతరం ఆ ఫొటోను పెద్ద పరిమాణంలో తీసుకొని మాస్క్‌పై ఓ ప్రత్యేక టెంపరేచర్ వద్ద సూపర్ఇంపోజ్ విధానం ద్వారా అతికించాలి. ఆ సమయంలోనే గడ్డం కొలతను సరిచూసుకుంటాం’’ అని వివరించారు. అయితే, ఫొటోను మాస్క్‌పై అతికించే విధానానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. ఒక్కో మాస్క్‌ను రూ.60లకు విక్రయిస్తున్నట్టు బినేశ్ వెల్లడించారు.
రెండ్రోజుల్లో 1000 మాస్క్‌లు తయారు చేశా
‘‘నేను రెండు రోజుల్లో 1000 మాస్కులు తయారు చేశా. మరో 5వేల మాస్కులకు ఆర్డర్లు వచ్చాయి. ఇలాంటిది ఎవరూ ఇదివరకు తయారుచేయకపోవడంతో దీనిపై నాకు అనేకమంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకవేళ మాకు ఎక్కువ ఆర్డర్లు వచ్చినా మాస్క్‌ల భద్రత విషయంలో ఏమాత్రం మేం రాజీపడబోం’’ అని వివరించారు.
అలాంటి సమస్యలకు ఈ మాస్క్ ఓ సమాధానం
‘‘ఇప్పటికే మార్కెట్లో మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ, డోరా, ఛోటా భీం, టెడ్డీ బేర్, పలువురు సినీ ప్రముఖులు, అనేక జంతువుల ఆకారాలతో మాస్క్‌లు వచ్చాయి. కానీ మాస్క్ వేసుకున్న వ్యక్తిని గుర్తుపట్టగలిగేలా మాస్క్‌లు రాలేదు. ఆ ఆలోచనే నన్ను ఈ వినూత్న మాస్క్ తయారు చేసే వైపు నడిపించింది. ఏటీఎంల వద్ద, విమానాశ్రయాల్లో, పరీక్షా హాలులు, ఇతర సందర్భాల్లోనూ మాస్క్‌లు చాలా సమస్యగా మారాయి. అలాంటి సమస్యలను ఈ మాస్క్‌తో అధిగమించవచ్చు. మన ప్రధాని మోదీ సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని చెప్పినట్లు మాస్క్‌లు ధరించినంత కాలం వీటికి సంబంధించిన కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి’’ అని బినేశ్ తెలిపారు.