close

తాజా వార్తలు

Updated : 27/09/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ప్రేమ’పై పడగ విప్పిన ‘పరువు’

అప్పుడు ప్రణయ్‌.. ఇప్పుడు హేమంత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరోసారి పరువు పడగవిప్పింది. ఉన్మాదమై బుసకొట్టింది. నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. మానవత్వం మాయమవుతోంది. కులాంతర వివాహాలు హత్యలకు దారితీస్తున్నాయి. ప్రేమించిన పాపానికి కన్నకూతుర్నే వితంతవుగా మార్చాయి. జీవితాంతం తోడుగా ఉండాలనుకున్న ఓ జంట ఆశల్ని సమాధి చేశాయి. కులం వెర్రితో మానవత్వాన్ని మరచి ఓ కుటుంబానికి తీరని శోకం మిగిల్చాయి. గచ్చిబౌలి ఘటనతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి.

తల్లికి పుత్ర శోకం మిగిల్చిన కొడుకు ప్రేమ.. కుడిభుజంలా ఉంటాడనుకున్న కొడుకునే భుజాన మోయాల్సి వస్తే.. ఆ తండ్రి పడేవేదన అంతా ఇంతా కాదు. ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలనుకున్న ఆ అమ్మాయికి ఇక అతడి జ్ఞాపకాలే దిక్కా? పరువు ఖరీదు ప్రాణమా? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే అసలైన జీవితం ఉంటుందన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. ఇప్పుడు సమాజంలో ఘటనలు అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే హింస, రక్తపాతం ఉంటున్నాయనేది ఎవరూ కాదనలేని సత్యం. అందుకు నిదర్శనాలు ఎన్నో.. ఇంకెన్నో!

మిర్యాలగూడెంలోని ప్రణయ్‌ హత్య ఘటన మరువకముందే మరో పరువు హత్య కలకలం రేపుతోంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అల్లుడిని హతమార్చారీ ఘటనలో. చందానగర్‌లో నివసించే మద్యం దుకాణాల యజమాని, భవన నిర్మాణ సామగ్రి గుత్తేదారు అయిన దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి, అర్చన దంపతుల కుమార్తె అవంతి రెడ్డి. వీరి ఇంటికి 150మీటర్ల దూరంలో చింతా మురళీకృష్ణ, లక్ష్మీరాణి దంపతులు పెద్ద కుమారుడు హేమంత్‌తో కలిసి ఉంటున్నారు. అవంతి, హేమంత్‌కు చిన్నప్పటి నుంచే పరిచయం. ఎనిమిదేళ్ల క్రితం అది ప్రేమగా మారింది. 2013లో డిగ్రీ పూర్తి చేసిన హేమంత్‌.. పెయింటింగ్స్‌, ఇంటీరియర్‌ డిజైన్లు చేస్తున్నారు. అవంతి 2018లో డిగ్రీ పూర్తిచేసింది. అలా వారి ప్రేమ జీవితం సాఫీగా సాగుతోంది. వీరి ప్రేమ విషయం 2019 ఏడాది చివర్లో అవంతి తల్లిదండ్రులకు తెలిసింది. కులాలు వేర్వేరు కావడంతో పెళ్లికి అంగీకరించలేదు. హేమంత్‌తో కలిసేందుకు వీలు లేకుండా అవంతిని గృహ నిర్బంధం చేశారు.

కుటుంబ సభ్యుల చర్యలతో విసిగిపోయిన అవంతి ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. జూన్‌ 10న బీహెచ్‌ఈఎల్‌ సమీపంలోని సంతోషిమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. మరుసటి రోజు కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అధికారికంగా నమోదు చేయించుకున్నారు. ఈ విషయం జూన్‌ 12న ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. ఇంటికి వచ్చేయాలని ఒత్తిడి తెచ్చారు. హేమంత్‌ కుటుంబ సభ్యులను బెదిరించారు. ఆస్తి కోసమే ప్రేమించాడంటూ అపనింద తొలగించుకొనేందుకు తన పేరిట ఉన్న ఆస్తులను వదులుకొనేందుకు అవంతి సిద్ధపడింది. మూడుచోట్ల తనపేరుతో ఉన్న ఆస్తులను తండ్రి లక్ష్మారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు పోలీసుల సమక్షంలో అంగీకరించింది.

ఆ తర్వాత అవంతి- హేమంత్‌ గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్‌ కాలనీలో అద్దె ఇంటికి వెళ్లారు. నిజానికి అక్కడితో కథ సుఖాంతం కావాలి. అలాగే కొన్ని రోజులకైనా సర్దుబాటు అవుతుందని భావించాలి. కానీ కలలో కూడా ఊహించని ఉపద్రవం వారి జీవితాలను చిందరవందర చేస్తుందని ఆ జంట ఊహించలేకపోయింది. పరువు పోయిందంటూ అవంతి తల్లిదండ్రులు కుమిలిపోయారు. హేమంత్‌ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అలా ఈ నెల 20న అవంతి మేనమామ యుగేంధర్‌ రెడ్డితో చర్చించారు. హేమంత్‌ హత్యకు పన్నాగం పన్నారు. ఈ నేపథ్యంలో యుగేంధర్‌రెడ్డి వట్టినాగులపల్లికి వెళ్లి అక్కడ బిచ్చూయాదవ్‌, ఎరుకల కృష్ణ, లడ్డూ అలియాస్‌ పాషాను కలిశాడు. హేమంత్‌ హత్య కోసం రూ.10లక్షలకు సుపారీ ఇచ్చాడు. హేమంత్‌ ఉంటున్న ఇంటి పరిసరాల్లో బిచ్చూయాదవ్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించింది. 

ఈ నెల 24న హత్యకు పక్కా స్కెచ్‌ వేశారు. ఆరోజు రానే వచ్చింది. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో మూడు కార్లలో 15మంది వచ్చారు. అవంతి, హేమంత్‌ను బలవంతంగా కార్లోకి ఎక్కించారు. అనుమానం వచ్చిన హేమంత్‌.. తండ్రి మురళీకృష్ణతో పాటు మిత్రులకు మెసేజ్‌ చేశాడు. గోపన్‌పల్లి చౌరస్తా వద్ద  కార్లు చందానగర్‌ వైపు కాకుండా వట్టి నాగులపల్లి వైపు వెళ్తుండటంతో అవంతి-హేమంత్‌లకు అనుమానం వచ్చింది. అదునుచూసి బయటకు దూకేశారు. అయినప్పటికీ యుగేంధర్‌రెడ్డి హేమంత్‌ను బలవంతంగాతన కారులో ఎక్కించుకున్నాడు. వాహనాన్ని వేగంగా వట్టినాగులపల్లి వైపు మళ్లించాడు. 

జహీరాబాద్‌కు సమీపంలో మద్యం, సుత్రీధారం కొన్నారు. హేమంత్‌ కాళ్లు కట్టేసి కారులోనే కిరాతకంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని రాత్రి 7.30గంటలకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం కిష్టయ్యగూడెంలోని పొదల్లో పడేశారు. నిన్నటి వరకు కళ్లముందున్న భర్త విగత జీవిగా పడిఉండటం అవంతిని శోకసంద్రంలోకి నెట్టింది. 

ప్రేమకు కులం ఆపాదించడం సరికాదు. పిల్లలు తప్పటడుగులు వేస్తే మందలిస్తాం తప్ప చంపుకోం. ఈ ఘాతుకానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించకపోతే తనలాంటి ఎందరో తల్లులు కడుపుకోతకు గురవుతారని హేమంత్‌ తల్లి వాపోతోంది.

‘‘ఏం సాధించావ్‌.. ఇంకా ఏం సాధిస్తావ్‌ నాన్నా.. నాలుగు గోడల మధ్య ఉన్న కుటుంబాన్ని నడి బజారులోకి ఈడ్చేశావ్‌.. ఇది గెలుపా? లేదా పతనమా?ఒక్కసారి ఆలోచించు. కూతురి సంతోషం కోరుకొనే నీవు కనిపించని కులం చట్రంలో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావ్‌. మనస్ఫూర్తిగా నా సంతోషం గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు మరోలా ఉండేది.. మరోలా ఉండేది నాన్నా!’’

- ఇది అవంతి మనో వేదన

పరువు హత్యల వెనుక అసలు కారణం పరువేనా.. ఇంకేమైనా ఉన్నాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.