close

తాజా వార్తలు

Updated : 21/01/2021 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కారెక్కాడు... నగల దొంగ చిక్కాడు

భారీ దొంగతనం కేసు ఛేదన

53 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం


స్వాధీనం చేసుకున్న బంగారు నగలు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : నగరంలో ఇటీవల ఓ పెళ్లిలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. వంద శాతం సొత్తును రికవరి చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా బుధవారం విలేకరులకు వెల్లడించారు.

* గత నెల 24న విశాఖ సాయిప్రియ రిసార్ట్స్‌లో వివాహం జరుగుతున్న సమయంలో పెళ్లికుమార్తెకు చెందిన 53 తులాల బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. దీనిపై మునగపాక మండలానికి చెందిన వై.భారతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేరొందిన రిసార్ట్స్‌లో దొంగతనం జరగటంతో పోలీసులు సవాలుగా తీసుకున్నారు. మూడు రోజులు రిసార్ట్స్‌లోనే ఉండి అందర్నీ ప్రశ్నించినా ఎలాంటి క్లూ దొరకలేదు.

* అయితే దొంగతనం జరిగిన తెల్లవారుజామున రిసార్ట్స్‌ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో గీతం వైద్యశాలకు సమీపంలో ఒక వ్యక్తి చేతిలో బ్యాగ్‌తో నడుచుకుని వెళ్తూ కనిపించాడు. చీకటిగా ఉండటంతో దృశ్యం నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ సమీపంలో మరో సీసీ కెమెరా పుటేజ్‌ను తీసుకోగా.. నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి ఓ చెట్టుకింద నిలబడ్డాడు. ఆ సమయంలో ఓ కారు అతని వద్దకు రాగా.. అందులో ఎక్కి వెళ్లిపోయిన దృశ్యం కనిపించింది. చీకటి కావడంతో కారు నెంబరు గుర్తించలేకపోయారు. రాత్రి సమయంలో ఆ మార్గంలో ప్రయాణించిన అద్దె వాహనాల గురించి వాకబు చేశారు. దీంతో ఓలా కారును ఒక వ్యక్తి బుక్‌ చేసుకొని వెళ్లినట్లు గుర్తించారు.

* కారును బుక్‌ చేసిన ఫోన్‌నెంబరు గురించి ఆరా తీశారు. ఆ రోజు తర్వాత ఆ ఫోన్‌ పని చేయలేదు. విశాఖకు చెందిన పాత నేరస్తులు ఇటీవల రాష్ట్రంలోని ఏ జైళ్ల నుంచి విడుదలయ్యారో వివరాలు సేకరించారు.

* పి.గంగాధరరావు(29) అనే నిందితుడు కడప జైలు నుంచి గత నెలలో విడుదలైనట్లు గుర్తించారు. అతనితో పాటు జైలు జీవితం గడిపిన స్నేహితుడి నుంచి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఫోన్‌నెంబర్లు, సాంకేతిక సాయంతో గంగాధరరావు నిందితుడిగా గుర్తించారు. అతను దొంగతనం చేసిన తర్వాత విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లి, అక్కడ నుంచి ఒడిశా వెళ్లాడు. తిరిగి విశాఖకు రావటంతో అప్పటికే నిఘావేసి ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, దొంగతనం జరిగిన తీరును వివరించాడు.

నిందితుడు గంగాధరరావు

* దొంగతనం జరిగిన రాత్రి సాయిప్రియ రిసార్ట్స్‌ గోడ ఎక్కిలోపలికి ప్రవేశించిన తర్వాత అంతా నిద్రలో ఉండగా, బంగారు నగలు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. సోంపేటలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో కేవలం 6 తులాలు మాత్రమే తాకట్టుపెట్టగా, మిగిలినవి అతని ఇంట్లోనే భద్రంగా ఉన్నాయి. దీంతో మొత్తం రూ.30 లక్షల విలువైన 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, గంగాధరరావును అరెస్టు చేశారు. గత నెల 8న జైలు నుంచి వచ్చిన నిందితుడు విశాఖకు చేరుకుని, పలు దొంగతనాలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు ఈ దొంగతనం చేసి పట్టుబడ్డాడు. నిందితుడు విజయవాడ నుంచి వచ్చి విశాఖలో ఉంటున్నట్లు గుర్తించారు. కేసు ఛేదనలో శ్రమించిన పోలీసులను సీపీ అభినందించారు.

ఇవీ చదవండి..
సీసీ కెమెరాలు అమర్చుకోవాల్సిందే

అఖిలప్రియ ఆదేశాలతోనే అన్నీ!




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని