దేశం కోసం ప్రాణమిస్తే ఇంత నీచమా చైనా!
close

తాజా వార్తలు

Updated : 15/07/2020 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశం కోసం ప్రాణమిస్తే ఇంత నీచమా చైనా!

అమరులకు గుర్తింపునివ్వని డ్రాగన్‌

ఖననం బదులు దహనం చేయాలని కుటుంబీకులకు బెదిరింపులు

బీజింగ్‌: అంతర్జాతీయ సమాజంలో తానో ఎదురులేని శక్తినని చాటుకొనేందుకు చైనా ఎంత కర్కశత్వంగా ప్రవర్తిస్తుందో చెప్పేందుకు మరో ఉదాహరణ. తమ దేశం కోసం అమరులైన సైనికులకు అంతిమ గౌరవమూ ఇవ్వలేని డ్రాగన్‌ నీచత్వాన్ని అమెరికా నిఘా వర్గాలు తాజాగా బయటపెట్టాయి!

గల్వాన్‌ లోయలో భారత జవాన్ల చేతిలో మరణించిన సైనికులను సంప్రదాయ పద్ధతిలో ఖననం చేయకుండా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అడ్డుకుందని తెలిసింది. అనాథ శవాలకు నిర్వహించినట్టు వేరే ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా దహనం చేయాలని వారి కుటుంబ సభ్యులను బెదిరించింది. అంతేకాకుండా వారికి సంబంధించిన గుర్తులేవీ మిగలకుండా చేయాలని ఆదేశించిందని అమెరికా నిఘా వర్గాలు అంటున్నాయి.

తూర్పు లద్ధాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గత నెల 15న భారత్‌, చైనా సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఎవరెవరు మరణించారో వారికి సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వం వెల్లడించింది. సైనిక లాంఛనాలతో వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా మంత్రులు, పౌరులు వారికి ఘనంగా నివాళులు అర్పించారు. కానీ చైనా మాత్రం తమ వైపునుంచి ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ చెప్పలేదు. నిఘా వర్గాల ప్రకారం 35 మందికి పైగా డ్రాగన్‌ సైనికులు హతమయ్యారని సమాచారం.

అమరులకు భారత్‌ ఘనంగా నివాళులు అర్పిస్తే చైనా మాత్రం ఎవరెవరు చనిపోయారో ఇప్పటికీ చెప్పలేదు. ఇక మృతులను తమ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేసేందుకూ అంగీకరించడం లేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా శవాలను దహనం చేయాలని సూచించింది. అంత్యక్రియలకు వ్యక్తిగతంగా ఎవరూ హాజరయ్యేందుకు వీల్లేదని కుటుంబ సభ్యులను బెదిరించింది. ఇందుకు కరోనా వైరస్‌ను బూచిగా చూపించిందట.

కుటుంబ సభ్యులు చైనీస్‌ సోషల్‌మీడియా వేదిక వీబోలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారి గొంతు నొక్కేందుకు డ్రాగన్‌ ప్రయత్నించడం గమనార్హం. అయితే సైనికులకు అమరత్వం ప్రసాదించడం ఇష్టంలేకే చైనా ఇలా చేసిందని నిఘా వర్గాలు అంటున్నాయి. లేదంటే వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, ప్రజలు వచ్చి నివాళులు అర్పిస్తారని ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా నిషేధించిందట.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని