close

తాజా వార్తలు

Published : 20/10/2020 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఎం క్రైస్తవుడు అనేందుకు ఆధారాలేవి?

అవి లేకుండా విచారణలో ముందుకెళ్లలేం
పిటిషనర్‌కు స్పష్టం చేసిన హైకోర్టు
వివరాలు సమర్పించేందుకు ఈ నెల 22కు వాయిదా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్టియన్‌ అనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఆధారాలు సమర్పించకుండా సీఎం హిందువు కాదు క్రైస్తవుడని కోర్టుకు ఎలా చెబుతారని వ్యాఖ్యానించింది. వివరాలు లేకుండా వ్యాజ్య విచారణలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అదనపు వివరాలు సమర్పించేందుకు వీలుగా విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. వ్యాజ్యంలో గవర్నర్‌ను ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యర్థన కోరనప్పుడు ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ.. ఆయన్ను జాబితా నుంచి తొలగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి డిక్లరేషన్‌ ఇవ్వలేదని, అధికారులు సైతం చట్ట నిబంధనలను పాటించలేదంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన ఎ.సుధాకర్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఏ అధికారంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలని ‘కోవారెంటో’ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ‘తిరుమలలో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. దేవాదాయశాఖ చట్ట నిబంధన 136, 137 ప్రకారం హిందూయేతరులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌ ఇవ్వాలి. క్రైస్తవుడయిన సీఎం.. డిక్లరేషన్‌ ఇవ్వకుండా వెళ్లారు. ఇది దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 97, 153లకు విరుద్ధం. తితిదే అధికారులు చట్ట నిబంధలను అమలు చేయడంలో విఫలమయ్యారు. సీఎం డిక్లరేషన్‌ ఇవ్వక్కర్లేదని ప్రకటనలు చేశారు. దీనిపై టీవీల్లో చర్చలు జరిగాయి’ అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. టీవీల్లో చర్చల గురించి చెప్పొద్దన్నారు. ఆయన క్రైస్తవుడు అని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలేమున్నాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పష్టతిచ్చేలా కోరాలని న్యాయవాది బదులిచ్చారు. తామెందుకు ముఖ్యమంత్రిని అడగాలి.. వ్యాజ్యం దాఖలు చేసిన మీరే ఆధారాలు చూపాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు పలు క్రైస్తవ సభల్లో పాల్గొన్నారని, సీఎం ఈ వివాదంపై మౌనంగా ఉండటంతో ఆయన్ను క్రిస్టియన్‌గా భావించాల్సి వస్తోందని న్యాయవాది పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ శ్రీరామ్‌ అని పేరు పెట్టుకుంటే హిందువని, దేవానంద్‌ పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని ఎలా అనుకుంటామన్నారు. సీఎం క్రైస్తవుడనే ఆధారాలు సమర్పించేందుకు గడువిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, తితిదే తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వ్యాజ్య విచారణార్హతపై అభ్యంతరం తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.