close

తాజా వార్తలు

Updated : 27/02/2021 21:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పార్టీలకు ప్రతి ఎన్నిక కీలకమైనదే: కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొని తెలంగాణను సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ప్రత్యర్థులూ అభినందించాల్సిందేనన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి వాణీదేవిని గెలిపించుకోవాలని శ్రేణులకు సూచించారు. తెలంగాణ భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గంగుల కమలాకర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, తెరాస కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. దిల్లీ నుంచి గల్లీదాక భాజపా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చరిత్ర ఉంది.. కానీ భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. భాజపాకు తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని ఆక్షేపించారు. కేంద్రం ప్రజలపై మోపిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఇప్పటికే 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ప్రైవేటులో 14 లక్షల ఉద్యోగాలు సాధించగలిగామని కేటీఆర్‌ వెల్లడించారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు నాయకులు లేరనే పరిస్థితి నుంచి రెండుసార్లు జీహెచ్ఎంసీలో అతిపెద్ద విజయాలు సాధించే స్థాయికి పార్టీ చేరుకుందని తెలిపారు. ఏ పార్టీకైనా ప్రతి ఎన్నిక అత్యంత కీలకమైనదనే విషయాన్ని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు నడిచి విజయం సాధించే దిశగా కార్యక్రమాలు చేపడదామని శ్రేణులకు సూచించారు.

‘‘మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు ప్రభుత్వం అందిస్తుంటే.. భాజపా తమ ఘనతగా చెప్పుకుంటోంది. భాజపా అసత్యాల ప్రలోభాలకు గురికాకుండా విద్యావంతులకు తెరాస చేసిన పనులను బలంగా చెప్పాలి. కాంగ్రెస్‌కు చరిత్ర ఉంది.. కానీ భవిష్యత్తు లేదు. ఈ రెండు పార్టీలు మన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేవు. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సినవి తప్పా కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయీ ఇవ్వలేదనే విషయాన్ని విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి.భాజపా చేస్తున్న అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. తెలంగాణలో ఓట్లు అడిగేందుకు భాజపా వద్ద ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు. గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలి. మన ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన బాధ్యతగా పట్టభద్రులకు మరోసారి గుర్తుచేయాలి. ముఖ్యంగా యువత, నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అందించిన అవకాశాలను వివరించాలి. తెరాస ప్రభుత్వం అవలంబించిన విధానాలు,   హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న తీరు తద్వారా చోటుచేసుకున్న సానుకూల మార్పులను తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంటుంది’’ అని కేటీఆర్‌ వెల్లడించారు.


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని