close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. వడ్డీరేట్లు మారలేదు..!

ఆర్‌బీఐ కీలకమైన పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను నేడు ప్రకటించింది. ఈ ద్వైమాసికానికి వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్‌ రెపోరేటు 4.90శాతం వద్ద, బ్యాంక్‌ రేటు 5.40శాతం వద్ద కొనసాగుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అదే: చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు గతంలో శ్రీకారం చుట్టామని తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు వృథా కారాదని, భావితరాల భవిష్యత్‌ ఉజ్వలంగా ఉండాలనేదే తేదేపా తపన అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. వివేక హత్య కేసు విచారణకు బీటెక్‌ రవి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. కడపలోని పోలీసు శిక్షణ కేంద్రంలో అనుమానితులను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ విచారణకు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణరెడ్డి విచారణకు హాజరయ్యారు. వారితోపాటు సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మా పరమేశ్వర్‌రెడ్డిని సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కేసీఆర్‌ హామీలకు నా గుండె వేగం పెరిగింది

ప్రస్తుతానికి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని తెలంగాణ ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న సీఎఫ్‌వో-2019 సదస్సుకు హజరై ఆయన మాట్లాడారు.  అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. ఆర్టీసీ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ హామీలు ఇచ్చినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకొంది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం’అని హరీశ్‌రావు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. పార్లమెంట్‌కు చిదంబరం..

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన చిదంబరం.. మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తన గళాన్ని ప్రభుత్వం తొక్కేయలేదని అన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఉల్లిధరలపై కాంగ్రెస్‌ ఈ నిరసన చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కర్ణాటకలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌

కర్ణాటకలో 15 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో వారిపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా రెండు నియోజకవర్గాలకు సంబంధించి కోర్టులో కేసులున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కోర్టుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలికి నిప్పు

అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కేసు పెట్టినందుకు ప్రతీకారంగా బాధితురాలికి నిప్పు పెట్టారు దుండగులు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆమె ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ నిమిత్తం బాధిత మహిళ గురువారం కోర్టుకు హాజరవుతున్న క్రమంలో ఐదుగురు వ్యక్తులు ఊరి చివర ఆమెకు నిప్పు పెట్టి పరారయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న మినీబస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ప్రైవేటు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అమెరికాలో ఐఏఎఫ్‌ చీఫ్‌కు తప్పిన ప్రమాదం

అమెరికా పర్యటనలో ఉన్న భారత వైమానిక దళ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ రాకేశ్ కుమార్‌ సింగ్‌ భదౌరియాకు పెను ప్రమాదం తప్పింది. హవాయిలోని పెరెల్‌ హార్బర్‌ నేవీ షిప్‌యార్డ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో భదౌరియా బృందం కూడా అక్కడే ఉంది. అయితే ప్రమాదం నుంచి వారంతా సురక్షితంగా బయటపడినట్లు ఐఏఎఫ్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. జయలలిత ఇష్టసఖిగా ప్రియమణి..?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’. ‘అమ్మ’ పాత్రలో కంగనా రనౌత్‌ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, వీడియోకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటి ప్రియమణి నటించనున్నారని కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. జయలలిత జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి, ఆమె ఇష్టసఖి అయిన శశికళ పాత్రలో ఆమె నటించనున్నారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.