మాకు ఏ గాయం పెద్దది?..దేని కోసం ఏడ్వాలి?
close

తాజా వార్తలు

Published : 11/03/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాకు ఏ గాయం పెద్దది?..దేని కోసం ఏడ్వాలి?

అత్యాచార బాధితురాలి కుటుంబం ఆవేదన

యూపీలో ఉన్నావ్ తరహా ఘటన

కాన్పూర్: తమ ఇంటి ఆడబిడ్డను సామూహికంగా చెరిచారని బాధపడాలా?..తమ అన్యాయాన్ని పోలీసులు ముందు పెట్టి, తండ్రిని పోగొట్టుకున్నామని కన్నీరుపెట్టాలా?..ఇలాంటి ఎన్ని దారుణాలు జరిగినా పరిస్థితులు మారవని ఆ కన్నీటిని దిగమింగుకోవాలా?..ఇప్పుడు ఆ కుటుంబం ఏం చేయాలి? వారి గోడును ఎవరికి చెప్పుకోవాలి? మరో ఉన్నావ్ తరహా ఘటనకు సాక్ష్యంగా నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ అత్యాచార బాధితురాలి కుటుంబం మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. సంచలనం సృష్టిస్తోన్న ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ గ్రామంలోని 13 ఏళ్ల బాలికపై రెండు రోజుల క్రితం ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వైద్య చికిత్స నిమిత్తం తన కూతుర్ని ఆసుపత్రిలో చేర్చి, రోడ్డుపైకి వచ్చిన ఆ తండ్రి బుధవారం ట్రక్కు ఢీ కొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీని వెనక నిందితుడు కుటుంబం కుట్ర ఉందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు పెట్టిన దగ్గరి నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రధాన నిందితుడైన గోలుయాదవ్ తండ్రి కనౌజ్ జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ‘మేం ఫిర్యాదు చేసిన వెంటనే మాకు బెదిరింపులు వచ్చాయి. ‘మా నాన్న పోలీసు..జాగ్రత్త’ అంటూ నిందితుడి సోదరుడు మమ్మల్ని భయపెట్టాలని చూశాడు’ అని బాధితురాలి కుటుంబం వాపోయింది. ‘నా కుమారుడిని హత్య చేశారు.. పోలీసులు వారికి సహకరిస్తున్నారు’ అంటూ మృతుడి తండ్రి విలపిస్తున్నారు. 

కాగా, ఈ కేసుపై పోలీసులు స్పందించారు. ‘బాధితురాలికి వైద్య పరీక్షలు జరుగుతోన్న సమయంలో..టీ కోసం ఆమె తండ్రి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ట్రక్కు ఢీకొనడం గురించి మాకు సమాచారం అందింది. వెంటనే అతడిని కాన్పూర్ ఆసుపత్రికి తరలించాం. కానీ, అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నాం’ అని కాన్పూర్ పోలీస్‌ చీఫ్ డాక్టర్ ప్రీతిందర్ సింగ్ వెల్లడించారు. ‘బాధితురాలి తండ్రి కేసు పెట్టగానే మేం వెంటనే రంగంలోకి దిగాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ కేసు దర్యాప్తునకు ఐదు బృందాలను నియమించాం’ అని మరో అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా, రోడ్డు ప్రమాద ఘటనతో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతుండటంతో..రెండు కేసులపై దర్యాప్తును వేగవంతం చేయాలని యూపీ పోలీసు ఉన్నతాధికారులు కాన్పూర్‌ పోలీసులను ఆదేశించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని