24గంటలు గడిచినా దొరకని చిరుత జాడ

తాజా వార్తలు

Updated : 15/05/2020 14:26 IST

24గంటలు గడిచినా దొరకని చిరుత జాడ

కాటేదాన్‌‌: అడవిలోంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ చిరుత పులి అటవీ సిబ్బంది, పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్‌ నగర శివారులోని మైలార్‌దేవ్‌పల్లి సమీపంలో గల కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై దర్శనమిచ్చిన చిరుత చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. దాని ఆచూకీ కోసం అటవీ, పోలీసు శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 24 గంటలు గడిచినప్పటికీ చిరుత ఆచూకీ లభించకపోవడంతో స్థానికులు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. గురువారం ఉదయం గగన్‌పహాడ్‌  రైల్వేగేటు దగ్గర్లోని ప్రధాన రహదారి మధ్యలో డివైడర్‌ పక్కన.. నడిచే ఓపికలేని స్థితిలో ఉన్న చిరుత కనిపించిన విషయం తెలిసిందే. అయితే అధికారులు చిరుతను బంధించేదుకు ప్రయత్నించగా అది తప్పించుకుని ఓ ఫంక్షన్‌ హాల్‌లోకి ఆతర్వాత కాటేదాన్‌లోని 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిరుత జాడ కోసం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

తప్పించుకున్న చిరుత వ్యవసాయ క్షేత్రంలోని పొదల్లో నక్కి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతను గుర్తించేందుకు 25 సీసీ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా రెండు మేకల ఉంచి బోన్‌లు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ చిరుత జాడ దొరకలేదు. పొదల్లోనే నక్కి ఉందా? లేకపోతే తప్పించుకుని ఎటైనా వెళ్లిపోయిందా? అని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత దాడి చేస్తుందేమోనని బద్వేలు, నేతాజినగర్‌ వాసులు బిక్కు బిక్కుమంటున్నారు. 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రంతో పాటు రాజేంద్రనగర్‌ వర్సిటీ అటవీ ప్రాంతంలో కూడా గాలింపు చేపట్టినట్టు శంషాబాద్‌‌ సీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ పొలంలో నుంచి చిరుత రాజేంద్రనగర్‌ వర్సిటీ వైపు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. గురువారం రాత్రి కాటేదాన్‌, నేతాజీ నగర్‌, గగన్‌ పహాడ్‌ పరిసరాల్లో గస్తీ నిర్వహించినట్లు చెప్పారు. చిరుత విషయంలో స్థానికులు భయాందోళనకు గురికావద్దని సూచించారు.


 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని