ఇలాగైతే గిల్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది
close

తాజా వార్తలు

Published : 25/02/2021 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలాగైతే గిల్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(11) ఔటైన విధానం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పర్యాటక జట్టే కాకుండా ఆతిథ్య జట్టూ తడబడింది. ఈ క్రమంలోనే గిల్‌ తక్కువ స్కోరుకు వెనుదిరిగి నిరాశపర్చాడు.

తొలుత వికెట్‌ కాపాడుకునేందుకు ప్రయత్నించిన టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌ గంటకుపైగా పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు. ఆపై కాస్త కుదురుకున్నట్లు కనిపించిన గిల్‌ రెండు ఫోర్లు కొట్టి లయ అందుకున్నాడు. అయితే, ఆర్చర్‌ వేసిన 15వ ఓవర్‌ చివరి బంతికి షాట్‌ ఆడిన అతడు షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కాగా, గిల్‌ ఎంపిక చేసుకున్న షాట్‌ తప్పని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

‘గిల్‌ రెండు అద్భుతమైన ఫోర్లు కొట్టి ఔటయ్యాడు. అయితే, అతడు తప్పుడు షాట్‌ ఎంపిక చేసుకొని ఔటయ్యాడు. దీంతో తన ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఎంత బాగా కష్టపడ్డా ఇలా జరుగుతూ ఉంటుంది. జోఫ్రా ఆర్చర్‌లాంటి పేసర్‌ బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌ ఆడగలుగుతామని అనుకోవడం సరికాదు. ఇంగ్లాండ్‌ పేసర్‌కు బంతిని స్కిడ్‌ చేసే సామర్థ్యం ఉంది. అదే ఇప్పుడు ప్రయోగించాడు’ అని టీమ్‌ఇండియా మాజీ సారథి వివరించాడు. ఇదిలా ఉండగా, భారత్‌ ప్రస్తుతం 99/3తో కొనసాగుతోంది. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి రోహిత్‌(57*), రహానె(1*) క్రీజులో ఉన్నారు. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ ఏ మేరకు రాణిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ కోహ్లీసేన భారీ స్కోర్‌ సాధిస్తే ఇంగ్లాండ్‌ను ఓడించే చక్కటి అవకాశం ముందుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని