close

తాజా వార్తలు

Updated : 09/01/2021 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఇండోనేషియాలో విమానం అదృశ్యం

ఇండోనేషియాలో ప్రయాణికుల విమానం అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. జకార్తా నుంచి పోంటియానక్‌కు 62 మందితో బయల్దేరిన ఎయిర్‌ బోయింగ్‌ 737-500 శ్రీవిజయ విమానం ఆచూకీ గల్లంతైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. జకార్తా విమానాశ్రయంలో టేకాఫ్‌ అయిన నాలుగు నిమిషాల్లోనే ఏటీసీతో సంబంధాలు తెగిపోవడం గమనార్హం. ఈ బోయింగ్‌ విమానం జాడ కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్టు ఇండోనేషియా రవాణా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అదిత ఇరావతి తెలిపారు. నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ కమిటీ పరస్పర సమన్వయం చేసుకుంటూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 2. ఎన్నికల నిర్వహణతో సీఎంకు ఏంటి సంబంధం?

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తున్నామని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎవరని ఆయన నిలదీశారు. అసలు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు, సీఎంకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తాజాగా ఎస్‌ఈసీ జారీ చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై ఆ పార్టీకి చెందిన పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జనవరి 16 నుంచి టీకా పంపిణీ

కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా తొలుత దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 27కోట్ల మంది 50ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి అందించనున్నట్లు పేర్కొంది. ‘వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించాం’ అని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 50,445 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 కొత్త కేసులు నమోదు కాగా.. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,84,689కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7,128 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 423 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,74,954కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,607 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,22,74,647 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బర్డ్‌ఫ్లూ అలర్ట్‌: దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను బర్డ్‌ఫ్లూ కలవరపెడుతోంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశరాజధానిలోకి లైవ్‌ బర్డ్స్‌ దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా దిల్లీలో ఇప్పటి వరకు ఒక్క బర్డ్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. ‘దిల్లీలో ఇప్పటి వరకూ పక్షుల నుంచి 104 నమూనాలను సేకరించాం. వాటిని పరీక్షల నిమిత్తం జలంధర్‌లోని లేబొరేటరీకి పంపించాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రజారోగ్యాన్ని చెడగొట్టే పరిశ్రమలొద్దు: పవన్‌

ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడే ప్రశ్నిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సిద్ధాంతాలతోనే రాజకీయాలు చేస్తామని, వాటి కోసమే పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైకాపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మాటలు తూలనని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తనను సంస్కారవంతంగా పెంచారని ఆయన అన్నారు. వందలు, వేల కోట్లు సంపాదిస్తే నాయకులు సుఖంగా ఉంటారా? అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు పవన్‌ మద్దతు తెలిపారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 7. ఆకాశాన అతివల రికార్డు 

గగనతలంలో భారత మహిళా పైలట్లు చరిత్ర సృష్టించనున్నారు.  ఉత్తర ధ్రువం మీదుగా తొలి సుదూర విమానాన్ని మొత్తం మహిళలే నడపనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎక్కడా ఆగకుండా అట్లాంటిక్‌ను దాటుకుంటూ ఈ విమానాన్ని బెంగళూరుకు తీసుకురానున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో, బెంగళూరు మధ్య గాలి వేగాన్ని బట్టి ప్రయాణ సమయం 17 గంటల పైనే ఉంటుంది. ప్రపంచంలోనే ఎయిరిండియా లేదా ఏ ఇతర దేశీయ విమానయాన సంస్థ గానీ నడుపుతున్న అత్యంత సుదూరు వాణిజ్య విమానం ఇదే కానుందని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు నగరాలు భూమికి ఇరు కొనల్లో ఉంటాయి. వీటి మధ్య దూరం 13,993 కిలోమీటర్లు కాగా.. టైంజోన్‌ తేడా 13.5 గంటలు ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెండు సెషన్లు ఆడాక భారత్‌ పనిపడతాం

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆదివారం టీమ్‌ఇండియా పని పడతామని ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌కమిన్స్‌ అన్నాడు. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన అతడు మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడాడు. నాలుగో రోజు తమ జట్టు మరో రెండు సెషన్లు బ్యాటింగ్‌ చేస్తుందని, దాంతో భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతామని చెప్పాడు. తర్వాత తమ బౌలింగ్‌ వ్యూహాలతో టీమ్‌ఇండియా పనిపడతామని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* నయావాల్‌.. డీకోడెడ్‌!

9. ఒక్కడే వచ్చాడు.. 100 మిలియన్‌ వ్యూస్‌ దాటేశాడు!

‘గ్యాంగ్‌లతో వచ్చేవాడు గ్యాంగ్‌స్టర్‌.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్‌స్టర్‌’.. ‘కేజీయఫ్‌-1’లో ఈ ఒక్క డైలాగ్‌ చాలు రాకీ పాత్రను ఏ స్థాయిలో హైలైట్‌ చేశారో అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే కరెక్ట్‌ అని మరోసారి రాకీభాయ్‌ నిరూపించాడు. యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో రికార్డులు బద్దలు కొడుతోంది. గురువారం రాత్రి టీజర్‌ను విడుదల చేయగా, అతి తక్కువ సమయంలో 100 మిలియన్‌ వ్యూస్‌ను దాటి దూసుకుపోతోంది. 5 మిలియన్లకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డేటా షేరింగ్‌పై వాట్సాప్‌ వివరణ

ఇటీవల తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాట్సాప్‌ దీనిపై స్పందించింది. తాజా ప్రైవసీ పాలసీలో ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించిన విషయంలో ఎలాంటి మార్పులూ చేయలేదని వివరణ ఇచ్చింది. టర్మ్స్‌ ఆఫ్‌ సర్వీసెస్‌, ప్రైవసీ పాలసీని ఇటీవల వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూజర్లకు పంపిస్తోంది. వాట్సాప్‌ యూజర్ల డేటా ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలతో ఎలా పంచుకునేదీ వివరించింది. నవీకరించిన ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకారం తెలిపేందుకు ఫిబ్రవరి 8ని గడువుగా నిర్దేశించింది. గడువులోగా అంగీకరించకపోతే తమ యాప్‌ను వినియోగించలేరని వాట్సాప్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని