
తాజా వార్తలు
పాక్ సరిహద్దు వైపు వెళ్లొద్దు
తమ పౌరులకు అమెరికా సూచన
వాషింగ్టన్: అధ్యక్షుడు బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దక్షిణాసియాలోని పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లకు వెళ్లాలనుకునే తమ పౌరులకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. పాక్‌కు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలపై పునరాలోచన చేయాలని సూచించింది. కరోనా పరిస్థితులతో పాటు పాక్‌లో ఉగ్రవాదం, విభజనవాదుల హింస ఎక్కువగా ఉండడమే అందుకు కారణంగా పేర్కొంది. ఆ దేశంలోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులకు మాత్రం అసలు వెళ్లొద్దని, అక్కడ ఉగ్రవాదంతో పాటు అపహరణ ముఠాల ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. అలాగే నియంత్రణ రేఖ సమీప ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించింది. అక్కడ ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయని పేర్కొంది. నియంత్రణ రేఖకు ఇరువైపులా భారత్, పాక్‌ల సైనిక బలగాలు భారీ సంఖ్యలో మోహరించి ఉంటాయని, వాటి మధ్య తరచూ ఎదురు కాల్పులు చోటుచేసుకుంటూ ఉంటాయని తెలిపింది. బంగ్లాదేశ్‌లో నేరాలు, ఉగ్రవాదం, అపహరణల ముప్పు దృష్ట్యా అక్కడికి వెళ్లినప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది. అఫ్గాన్‌లో అపహరణ ముఠాలు, ఆత్మాహుతి దాడులు, ఉగ్రవాదంతో అశాంతి నెలకొని ఉందని, అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొంది.
నెగటివ్ నివేదిక చూపిస్తేనే అమెరికాకు
కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికాకు వచ్చే విదేశీ ప్రయాణికులకు కొత్త నిబంధన తీసుకొచ్చారు. ప్రయాణానికి ముందు మూడు రోజుల్లోపు వారు కరోనా నెగటివ్ నివేదికను విమానయాన సంస్థలకు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు. జనవరి 26 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. మరోవైపు ఐరోపా దేశాలతో పాటు బ్రిటన్, బ్రెజిల్, ఐర్లాండ్ దేశాల ప్రయాణికులు అమెరికాలోకి రాకుండా మళ్లీ ఆంక్షల్ని విధిస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణ బృందం సలహా మేరకే బైడెన్ ఈ చర్యలు చేపట్టినట్లు జెన్ సాకీ తెలిపారు. దక్షిణాఫ్రికాలో కొత్త వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆ దేశ ప్రయాణికులపైనా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రిగా.. జానెట్ యెల్లెన్ ఎంపికను ఆమోదించిన సెనెట్
అమెరికా నూతన ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్ ఎంపికను సెనెట్ ఆమోదించింది. 84-15 ఓట్ల మెజార్జీతో సమ్మతించింది. దీంతో అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. అదేవిధంగా నూతన విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్ ఎంపికను సెనెట్ ఆమోదించింది. 78-22 మెజార్టీతో సమ్మతి తెలిపింది. దీంతో మైక్ పాంపియో తర్వాత 71వ విదేశాంగ మంత్రిగా బ్లింకెన్ విదేశాంగ మంత్రిగా వ్యవహరించనున్నారు.
ఫ్లోరిడాలో ట్రంప్ కార్యాలయం
ఎన్నికల్లో ఓడి సొంత రాష్ట్రం ఫ్లోరిడాకు వెళ్లిపోయిన ట్రంప్ అక్కడ తాజాగా ‘మాజీ అధ్యక్షుడి’ కార్యాలయాన్ని ప్రారంభించారు. పాంబీచ్ రోడ్లో దాన్ని ఏర్పాటు చేశారు. ట్రంప్ నిర్వహించబోయే ప్రజా కార్యక్రమాలకు ఈ కార్యాలయాన్ని వేదికగా చేసుకోనున్నారు. మరోవైపు ట్రంప్‌పై డెమోక్రాట్లు సంధించిన అభిశంసన అస్త్రం సోమవారం సెనెట్‌కు వెళ్లింది. క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి సంబంధించి ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలపై ఫిబ్రవరి 8 నుంచి పూర్తి స్థాయి విచారణ జరుగనుంది.
ఇవీ చదవండి..
మరో నలుగురు భారతీయ-అమెరికన్లకు కీలక పదవులు
అమల్లోకి బైడెన్ ఆర్థిక ప్రణాళిక