close

తాజా వార్తలు

శక్తిమేర పోరాడా.. మళ్లీ గెలిపించండి: కవిత

నిజామాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి తెరాస అభ్యర్థిగా  కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి గులాబీ రంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ కారును నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నడపగా.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెనుక కూర్చున్నారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారికి కవిత రెండు సెట్ల నామినేషన్లను సమర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఒకసారి తనకు అవకాశం ఇస్తే శక్తివంచన లేకుండా కృషిచేశానన్నారు. తెరాస ఎంపీలంతా గల్లీలో సేవకులుగా.. దిల్లీలో సైనికులుగా పనిచేశామని చెప్పారు. మరోసారి పార్లమెంట్‌కు వెళ్లడానికి నిజామాబాద్‌ ప్రజలకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. 16 స్థానాల్లో తెరాసను గెలిపిస్తేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే వీలుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. కవితతో పాటు తెరాసకు చెందిన పలువురు అభ్యర్థులు తమకు కేటాయించిన పలు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు.

* మెదక్‌ పార్లమెంట్‌ తెరాస అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

* మహబూబాబాద్‌ పార్లమెంట్‌ తెరాస అభ్యర్థిగా మాలోత్‌ కవిత నామినేషన్‌ వేశారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చిన ఆమె నామ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, బానోత్‌ శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్‌ పాల్గొన్నారు.

* భువనగిరి అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జగదీశ్‌ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* చేవెళ్ల లోక్‌సభ తెరాస అభ్యర్థిగా రంజిత్‌ రెడ్డి నామినేషన్‌  వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌ గౌడ్‌, కాలె యాదయ్య, ఆనంద్‌, మహేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* నాగర్‌కర్నూలు లోక్‌సభ తెరాస అభ్యర్థిగా పి.రాములు నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, మర్రి జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి తెరాస అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. పార్టీ కార్యకర్తలు,  నాయకులతో కలిసి వచ్చిన ఆయన రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.