close
ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేరుస్తాం

 రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం 
  రైతుల సంక్షేమం, యువత ఉపాధికి ప్రాధాన్యం 
  కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించటమే మా లక్ష్యం 
  ఫలితాల తర్వాతే ముఖ్యమంత్రి  అభ్యర్థిపై నిర్ణయం 
  విలేకరుల సమావేశంలో రాహుల్‌, చంద్రబాబు,  కోదండరాం, సురవరం స్పష్టీకరణ 

యువతకు ఉద్యోగాలు కల్పించడం, రైతుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం మా తొలి ప్రాధాన్యం. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి ఉద్యోగాలిస్తాం. విద్య, ఆరోగ్య రంగాలకు అధికంగా నిధులు కేటాయిస్తాం.  విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా అందిస్తాం. ప్రభుత్వ విద్యాలయాలు, వైద్యశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. 
-రాహుల్‌ గాంధీ

కాళేశ్వరం మినహా మిగతా ప్రాజెక్టులు తెదేపా హయాంలో మొదలుపెట్టినవే. వాటిని కాంగ్రెస్‌ కొనసాగించింది. ఈ ప్రాజెక్టులను నేను అడ్డుకుంటున్నానని చెప్పడం తప్పుడు ప్రచారమే. గోదావరి నుంచి 2,500 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోంది. రెండు రాష్ట్రాలు ఆ నీటిని వాడుకునేలా మాట్లాడుకుందామని కేసీఆర్‌ను ఎన్నోసార్లు కోరా. 
- చంద్రబాబునాయుడు

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు రాష్ట్ర ప్రజలు శుక్రవారం జరిగే ఎన్నికల్లో ప్రజాకూటమికి మద్దతు ఇవ్వాలని కూటమి అగ్రనేతలు కోరారు. పౌరుల హక్కుల్ని కాలరాసిన తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యువత, రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వంలో ప్రశ్నించడమే నేరమైందని ఆక్షేపించారు. ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైనా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదన్నారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, ప్రజా గాయకుడు గద్దర్‌, ఇండియన్‌ ముస్లింలీగ్‌ నేత ఘనీ సాహెబ్‌, మన ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌లు హైదరాబాద్‌లో ప్రత్యేక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కుంతియా, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి కార్యక్రమంగా ప్రజాకూటమి నిర్వహించిన విలేకరుల సమావేశం మినీ సభను తలపించింది. 200 మందికిపైగా ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా    జర్నలిస్టులతో ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచార గడువును దృష్టిలో ఉంచుకొని బుధవారం సాయంత్రం   4.59 గంటలకు సమావేశాన్ని ముగించారు.

తెరాస పాలన అవినీతిమయం 
తెలంగాణ ప్రజల స్వప్నం ఐదేళ్ల కిందట సాకారమైంది. కానీ గత నాలుగున్నర ఏళ్లలో ఆ కలలు కల్లలయ్యాయని రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది యువకులు త్యాగాలు చేశారని తెలిపారు. నవ తెలంగాణ ఆవిర్భవిస్తుందన్న ఆశ నెరవేరక పోగా రాష్ట్రం అవినీతిమయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు చేదు అనుభవం ఎదురైందని, అందుకే ప్రజాకూటమి ఆవిర్భవించిందని తెలిపారు. యువత, రైతుల సంక్షేమంతో బంగారు తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రయోజనాల కోసమే సంఘటితం 
దేశంలో వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, అయితే గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. మార్పు దిశగా తెలంగాణ సాగుతుందనే విశ్వాసం ఉందన్నారు. ప్రజాకూటమి జాతీయ రాజకీయాల్లోనూ కీలక మలుపు అని పేర్కొన్నారు. ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రగిలించటానికి తెరాస, భాజపా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.  వరుస సెలవుల నేపథ్యంలో ఓటు వేయడం మరవొద్దని రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాకూటమికి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

లోకమంతా నగారా మోగిస్తోంది దిగిపొమ్మని 
ప్రజల భాగస్వామ్యంతో ఒక మంచి తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని అందరం భావించామని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఒక కుటుంబం తన స్వప్రయోజనం కోసం ప్రభుత్వాన్ని నడిపిస్తే ఫలితాలు రావన్న భావనతో ప్రత్యక్ష రాజకీయ పోరుకు సిద్ధపడ్డామన్నారు. తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించకుంటే రాష్ట్రం బాగుపడదన్నారు. దాశరథి నిజాం పాలన గురించి చెప్పిన వచనాలు గుర్తుచేస్తూ...‘లోకమంతా నగారా మోగిస్తున్నది దిగిపొమ్మని, దిగిపొమ్మని’ ఈ ప్రభుత్వానికి చెబుతున్నామన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఉద్యమ ఆకాంక్షల సాధనకు కచ్చితంగా నిలబడి ఉన్నామన్నారు. మార్పు కోసం, కలలు గన్న తెలంగాణ నిర్మాణం కోసం ఓటును వినియోగించుకోవాలని కోరారు.

నియంతృత్వ పాలనకు సమాధి 
రాష్ట్రంలో అహంకార పూరిత నియంతృత్వ పాలనకు సమాధి కట్టేందుకు ఓటు హక్కుని వినియోగించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కుల్ని పునరుద్ధరించాలన్నారు. ప్రజాకూటమిని గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి తొలగించడం ద్వారా ప్రజలకు ఒక ఉపశమనం ఇవ్వాలన్నారు.

ప్రజాకూటమి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమం, యువతకు ఉపాధి కల్పించడమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు.

తెలంగాణ ప్రయోజనాల కోసమే సంఘటితమయ్యామని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా నిలుస్తుందని, ఇది సాధ్యమవుతుందని తెలిపారు.

తెరాస ప్రభుత్వం అందరి ఆశల్ని వమ్ము చేసిందని, ప్రభుత్వం తన మార్గాన్ని సరిచేసుకోనప్పుడు కొట్లాడితే ఫలితం దక్కకపోగా జైలుపాలయ్యామని కోదండరాం చెప్పారు.

ప్రశ్నించడమే నేరమైంది 
తెరాస ప్రభుత్వంలో ప్రశ్నించడమే నేరమైందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ నియంతృత్వానికి కోదండరాం, రేవంత్‌రెడ్డి అరెస్టులే నిదర్శనమన్నారు. 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్‌ ఒక్కరి వల్ల రాలేదని తెలిపారు. దళితులు మొదలు 100 సామాజిక వర్గాలను కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు రాహుల్‌గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వటం, అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తు కోసం ప్రజాకూటమికి మద్దతిచ్చామని తెలిపారు. ప్రజల అజెండాతో నడుస్తున్న ప్రజాకూటమిని గెలిపించాలని ప్రజాగాయకుడు గద్దర్‌ కోరారు.

విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు సమాధానాలిచ్చారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ సమస్యలపై తమ వైఖరిని నేతలిద్దరూ స్పష్టం చేశారు.ఫలితాల తర్వాతే సీఎంను నిర్ణయిస్తాం: రాహుల్‌

పజాకూటమి అధికారంలోకి వస్తే మీ సీఎం ఎవరు? 
సీఎం అభ్యర్థిని ప్రకటించడం అనేది పూర్తిగా పరిణతి చెందని నిర్ణయం అవుతుంది. మా మొదటి లక్ష్యం తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించటం. మేమంతా కలిసి ఆ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయిస్తాం.

రైతుల ఆత్మహత్యలు, యువత ఉద్యోగాల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? 
రైతు సమస్యలు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, కేంద్రంలో ప్రధాని మోదీ ఇద్దరూ  రైతుల్ని భారంగా చూస్తున్నారు. కానీ మేం ఆస్తులుగా చూస్తున్నాం. వాళ్లను గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. మేం తెలంగాణ రైతుల పంట రుణాలను మాఫీ చేయబోతున్నాం. అప్పుల రద్దుతోనే రైతుల సమస్యలు పరిష్కారం కావు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేస్తాం. రైతుల పొలాలను హైదరాబాద్‌, మిగతా నగరాలతో, ప్రపంచంతో అనుసంధానం చేస్తాం.

మీ దృష్టిలో ఆదర్శ తెలంగాణ అంటే? 
రైతుల అభివృద్ధి గురించి అలోచించినపుడు రాయితీలు అనే పదం వ్యవసాయదారుల్ని అగౌరవపరిచినట్లుగా భావించాను. మోదీ పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేసినప్పుడు రాయితీ అనే పదాన్ని ఎందుకు వాడలేదు.  యువతకు ఉద్యోగాల కల్పన, రైతుల భవిష్యత్తుకు భరోసా నివ్వటం మా తొలి కర్తవ్యం. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి ఉద్యోగాలిస్తాం. స్థానిక నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం. ఆరోగ్యం, విద్యా రంగాల్లో భారీగా నిధులు వెచ్చిస్తాం.

ప్రజాకూటమికి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు.. 
కూటమే గెలవబోతోంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలి దానం చేసిన యువకుల ఆకాంక్షల మేరకు మా ప్రభుత్వం నడుచుకుంటుంది. ప్రజాకూటమి జనం గొంతుక. ఈ ప్రభుత్వం ప్రజల చేతుల్లో నడుస్తుంది. కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు, భాష, వ్యాఖ్యానాలు, ప్రజలను అవహేళన చేయడం చూస్తే ఆయన అసహనంతో ఉన్నారని స్పష్టమవుతోంది. సీఎం వ్యాఖ్యలు తెరాసలో అభద్రతా భావానికి నిదర్శనం. ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని అనడం కూడా ఒక సంకేతమే.

కాంగ్రెస్‌, తెదేపాల కలయికపై మీ క్యాడర్‌ను ఎలా ఒప్పిస్తారు? 
కింది స్థాయి శ్రేణులు ఇప్పటికే కలిసిపోయి పనిచేస్తున్నాయి. ఈ రోజు కూడా వారితో సమావేశం అయ్యాను. వారి మాటలు చూస్తే వారికి నచ్చచెప్పాల్సిన అవసరంలేదనిపించింది. చంద్రబాబు నన్ను కలిసినపుడు స్పష్టంగా చెప్పారు. దేశంలో వ్యవస్థలపై దాడి జరుగుతోందని, కాపాడుకోవడానికి జట్టుగా వెళ్దామన్నారు. ఈ దాడిని ఎదుర్కొనేందుకు ఒకే ఆలోచన కలిగిన నాయకులంతా ఒక్క తాటిపైకి వస్తున్నారు. తెదేపా, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉమ్మడిగా కలిసి పనిచేయడంలో ఎలాంటి సమస్యలు లేవు.

అవి తప్పుడు ఆరోపణలు: బాబు 
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని తెరాస ఆరోపిస్తోంది? 
కాళేశ్వరం మినహా మిగతా ప్రాజెక్టులు మేం ప్రారంభించినవే. వాటిని కాంగ్రెస్‌ కొనసాగించింది. ఈ ప్రాజెక్టులను నేను అడ్డుకుంటున్నానని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. కలిసి కూర్చుని చర్చించుకుందామని కేసీఆర్‌ను ఎన్నోసార్లు కోరాను. గోదావరి నుంచి 2500 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోంది. ఆ నీటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకునేలా మాట్లాడుకుందామని చెబుతున్నా. సాగునీటి సమస్యలను పరిష్కరించుకుంటాం. రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలి. అందుకు నేను, రాహుల్‌గాంధీ సహకరిస్తాం.

ప్రజాకూటమిలో ఏపీ సీఎం పెత్తనం చేస్తారనే ప్రచారం ఉంది? 
తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ప్రజాకూటమిని ఏర్పాటు చేశాం. నేను సీఎం అయ్యాక ఇక్కడ జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు. ఇక్కడంతా తెలంగాణ ప్రజలే ఉంటారు. కోదండరాం నేతృత్వంలోని కమిటీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తుంది.

ఏపీలో కాంగ్రెస్‌, తెదేపా కలిసి పోటీ చేస్తాయా? 
దానిపై ఇంకా ఆలోచించలేదు. తర్వాత దానిపై నిర్ణయానికి వస్తాం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.