close
నినాదాల నడుమ ప్రమాణాలు

దద్దరిల్లిన లోక్‌సభ
అధికార, విపక్షాల మధ్య పరస్పరం వ్యంగ్య వ్యాఖ్యలు

దిల్లీ: ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా మంగళవారం లోక్‌సభ నినాదాలతో దద్దరిల్లింది. వ్యంగ్య వ్యాఖ్యలు, ప్రతినినాదాలతో అధికార, విపక్ష పార్టీల సభ్యులు హోరెత్తించడంతో సభలో వాతావరణం వేడెక్కింది. నినాదాలు చేయవద్దని ప్రొటెం స్పీకర్‌ పలుమార్లు సూచించినా, సభ్యులు మాత్రం వినిపించుకోలేదు. చాలామంది భాజపా ఎంపీలు తమ ప్రమాణాల అనంతరం ‘భారత్‌ మాతాకి జై, జైశ్రీరాం’ అని నినదించారు. అదే పార్టీకి చెందిన అరుణ్‌కుమార్‌ సాగర్‌ ‘భారత్‌ మాతాకి జై’ అని పదేపదే నినదించడంతో... ‘మరోసారి’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.
* ప్రమాణ స్వీకారం అనంతరం తెలంగాణ ఎంపీలు జై తెలంగాణ.. జైభారత్‌.. భారత్‌మాతాకి జై అని నినదించారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత జై తెలంగాణ.. జై బంజారా.. అని చెప్పగా ‘జై భారత్‌మాత’ అంటూ నినాదం చేయాలని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హేమమాలిని తన ప్రమాణం పూర్తయిన తర్వాత ‘రాధే రాధే’ అంటూ ఓ కృష్ణస్తుతి శ్లోక భాగాన్ని వల్లెవేశారు.
* పశ్చిమ బెంగాల్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో నినాదాలు మరింత హోరెత్తాయి. ఆ రాష్ట్ర భాజపా ఎంపీలు ‘జైశ్రీరాం’ అని అంటుండగా... తృణమూల్‌ సభ్యులు ‘మా మాటి మానుష్‌’, ‘జై మమత’ అంటూ బిగ్గరగా ప్రతినినాదాలు చేశారు.
* హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారానికి వస్తుండగా భాజపా సభ్యులు బండి సంజయ్‌ తదితరులు పెద్దఎత్తున ‘భారత్‌మాతాకి జై.. జైశ్రీరామ్‌.. వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇంకా పెద్దగా అరవండంటూ ఆయన రెండు చేతులు పైకెత్తారు. ప్రమాణం ప్రారంభించే సమయానికి నినాదాలు తగ్గకపోవడంతో ‘బోలో’ (చెప్పండి) అంటూ ఆయన స్పీకర్‌ స్థానం వైపు చూశారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేయి ఎత్తడంతో భాజపా సభ్యులు నినాదాలు ఆపేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్‌ ఒవైసీ ‘జై భీమ్‌.. జై మీమ్‌.. తఖ్‌బీర్‌ అల్లాహూ అక్బర్‌... జైహింద్‌’ అని నినాదాలు చేశారు. దీనికి ‘మీకు అంబేడ్కర్‌ ఇప్పుడు గుర్తుకొచ్చారా?’ అంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.
* ఎస్పీ సభ్యుడు షఫీకుర్‌ రహ్మాన్‌ బక్రు ప్రమాణం చేసిన అనంతరం...‘వందేమాతరం ఇస్లాంకు విరుద్ధం. నేను దాన్ని నినదించను’ అన్నారు. దీంతో భాజపా సభ్యులు జైశ్రీరాం, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు.


నేటి అఖిలపక్షానికి తృణమూల్‌ దూరం

దిల్లీ, కోల్‌కతా: జమిలి ఎన్నికలు సహా పలు ప్రధానాంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకూడదని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించారు. ఈ భేటీలో పాల్గొనాలా.. వద్దా అనే విషయంలో కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉభయసభల్లో ఏదో ఒక దాంట్లో ఒక్క స్థానం ఉన్నా, అలాంటి పార్టీల అధ్యక్షులందరినీ మోదీ భేటీకి ఆహ్వానించారు. 2022లో స్వాతంత్య్రదిన వజ్రోత్సవం, ఈ సంవత్సరం మహాత్మాగాంధీ 150వ జయంతి లాంటి విషయాలపైనా చర్చిస్తామని చెప్పారు. లోక్‌సభలో భాజపాకు 303 మంది ఎంపీలుండగా కాంగ్రెస్‌ పార్టీకి 52, డీఎంకేకు 23, వైకాపా.. టీఎంసీలకు 22 మంది చొప్పున ఉన్నారు. అయితే.. జమిలి ఎన్నికల విషయంలో హడావుడి నిర్ణయం తీసుకునే బదులు దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని మమతాబెనర్జీ డిమాండ్‌ చేశారు. సమావేశానికి తాము రాని విషయమై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ఆమె లేఖ రాశారు. మరోవైపు జమిలి ఎన్నికలు, ఇతర అంశాలలో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు దిల్లీలో సమావేశమయ్యారు. సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. కానీ అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వాలా.. వద్దా అనే విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే సందిగ్ధంలో ఉన్నాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.