close
ప్రైవేటు భాగస్వామ్యంతోనే ‘ఆరోగ్య భారత్‌’

జీవనశైలి వ్యాధులపై దృష్టిపెట్టాలి
ప్రవాస వైద్యుల సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, హైదరాబాద్‌:  ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వం మాత్రమే పనిచేస్తే సరిపోదని.. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం ఉంటేనే ‘ఆరోగ్య భారత్‌’ సాకారమవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. నగరంలోని ఒక హోటల్‌లో ఆదివారం ఉదయం అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (అమెరికాలో భారత సంతతి వైద్యుల సంఘం-ఆపి) 13వ అంతర్జాతీయ వైద్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇదే సదస్సులో భాగంగా సాయంత్రం జరిగిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌, తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో అంటువ్యాధులకన్నా జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు.  వీటి నివారణపై దృష్టిపెట్టాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆరోగ్యకేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో వైద్య రంగం ఎంత విస్తరిస్తున్నా.. సిబ్బంది, మౌలిక వసతుల కొరత వేధిస్తోందన్నారు. ప్రైవేటు-పబ్లిక్‌ భాగస్వామ్యం దీనికి పరిష్కారం చూపగలదని, వియత్నాం తదితర దేశాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. మనవద్ద కూడా వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా ఇప్పటివరకు 10 లక్షల మంది లబ్ధిపొందారని వెల్లడించారు. మంచి ఆహారం, యోగా లాంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అంతకుముందు అపోలో గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే మరణాలకు 80 శాతం అసాంక్రమిక, జీవనశైలి వ్యాధులే కారణమవుతాయన్నారు.  ఆపి సావనీర్‌ను, కాంప్రహెన్సివ్‌ కార్డియో లైఫ్‌ సపోర్ట్‌ (సీసీఎల్‌ఎస్‌) పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.

మాతృదేశానికి సేవలందించండి: హర్షవర్ధన్‌
మాతృదేశంలో వైద్య సేవలందించేందుకు ప్రవాస భారతీయ వైద్యులు ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కోరారు.  అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒక రోగి భారత సంతతి వైద్యుల వద్దే చికిత్స పొందుతుండడం మన ప్రత్యేకతను చాటుతుందన్నారు. వచ్చే కొన్నేళ్లలోనే క్షయ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని తెలిపారు.


 

వైద్యాభివృద్ధికి పాటుపడండి: ఈటల

ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. వేర్వేరు ఆరోగ్య పథకాల ద్వారా రాష్ట్రంలో దాదాపు కోటి కుటుంబాలకు ప్రభుత్వమే ఉచిత వైద్యసేవలందిస్తోందని వివరించారు. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ ఐసీయూలు, రక్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పామని, నాలుగు ప్రభుత్వ వైద్యకళాశాలలను ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణలో వైద్యసేవల అభివృద్ధికి ప్రవాస వైద్యులు ముందుకు రావాలన్నారు. ఆపి మాజీ అధ్యక్షుడు అజయ్‌ లోథా మాట్లాడుతూ.. మాతృదేశంలో వైద్యసేవలందించే నిమిత్తం ప్రభుత్వంతో సంప్రదింపులకు ఏకగవాక్ష విధానాన్ని అమలు చేస్తే ప్రవాస వైద్యులు సేవలకు పెద్దసంఖ్యలో ముందుకొస్తారని పేర్కొన్నారు. ఆపి అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు, కేన్సర్‌ చికిత్స నిపుణులు నోరి దత్తాత్రేయుడు తదితరులు పాల్గొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.