close
మా పొట్ట కొట్టొద్దు..

 తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ కార్మికుల వేడుకోలు
 కార్మికులకు సంఘీభావంగా అద్దె బస్సుల నిలిపివేత
 ప్రయాణికులకు పెరిగిన ఇబ్బందులు
ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం

‘మా పొట్ట కొట్టొద్దు. విధులకు హాజరు కావద్దు’ అంటూ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు. జీతాలు లేవు.. పండగలు లేవు.. మీరు విధులకు హాజరు కావటంతో మా పరిస్థితి దయనీయంగా మారుతోందంటూ వారితో ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం గత 18 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస, అఖిలపక్షం రూపొందించిన కార్యాచరణలో భాగంగా మంగళవారం ఆర్టీసీ బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లను కార్మికులు కలిసి విన్నవించాలని నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్రంలోని వివిధ డ్రిపోల్లో కార్మికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్సుల్లో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందితోపాటు ప్రయాణికులు ఆసక్తిగా కార్మికుల విన్నపాలను ఆలకించారు. నాలుగైదు రోజులతో పోలిస్తే ఆర్టీసీ నడుపుతున్న బస్సుల సంఖ్య తగ్గింది. ఆప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా అద్దె బస్సుల యజమానులు సర్వీసులను నిలిపి వేశారు. రోజుకు సుమారు 2వేల వరకు అద్దె బస్సులను ఆర్టీసీ నడిపింది. ఆ బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రజలకు అవస్థలు మరింత పెరిగాయి. ఆందోళనలో భాగంగా కార్మికులు పలు ప్రాంతాల్లో భిక్షాటన నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు చేసిన సూచనల నివేదిక ప్రభుత్వానికి అందింది. అందులోని అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలను ప్రభుత్వం సమీక్షించింది.

 బస్సులకు అడ్డుకట్ట

పలు ప్రాంతాల్లో డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించి బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. డిపో గేట్ల ఎదుట బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు తొలగించి బస్సులు బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో దీక్షా శిబిరం ముందు నుంచే బస్సులు వెళ్తుండటంతో ఆగ్రహించిన కార్మికులు బస్సులను ఆపి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లపై విరుచుకు పడ్డారు. బస్సులు నడపొద్దని హెచ్చరించారు. ఒకదశలో వారిపై దాడికి యత్నించగా.. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఓ కార్మికుడు బస్సుపైకి ఎక్కి కిందకు దూకుతానని బెదిరించగా.. పోలీసులు వెళ్లి అతన్ని కిందకు దించారు. ఆర్టీసీ కార్మికుల కోపాన్ని చూసి భయపడిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను అక్కడే వదిలేసి వెళ్లిపోవడంతో.. పోలీసులే వాటిని డిపోకు చేర్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు భద్రాచలం వద్ద గోదావరిలో దిగి నిరసన తెలిపారు. మణుగూరులో ఆర్టీసీ కార్మికులు గేదెలను కాసి నిరసన తెలిపారు. కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడా తాత్కాలిక డ్రైవర్లపై దాడులు జరిగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కార్మికులు చేపట్టిన ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె ఒక్క కార్మికుల ప్రయోజనం కోసం కాదని.. దానిలో ప్రజా ప్రయోజనం సైతం ఉందన్నారు.

 నినాదాలతో మార్మోగిన జేబీఎస్‌

సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదాలతో జేబీఎస్‌ ప్రాంగణం మార్మోగింది. మొదట తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కలిసి సమ్మెకు సహకరించాలని కోరారు. అనంతరం జేబీఎస్‌ ప్రాంగణంలో వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. ఈసందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని 2012లో కరీంనగర్‌లో జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నెల 30న జరిగే సకలజనుల సమరభేరీతో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. కోర్టు ఆదేశాలను సైతం సీఎం కేసీఆర్‌ గౌరవించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఐకాస నేతలు రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ, అఖిలపక్ష నేతలు వీహెచ్‌, మధుయాస్కీ, రాములు నాయక్‌, సంపత్‌, ఎల్‌.రమణ, రావుల, జితేందర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓయూలో ధూంధాంకు అనుమతి నిరాకరణ

విద్యార్థి సంఘాల ఐకాస, ఆర్టీసీ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఉస్మానియా వర్సిటీలో బుధవారం(ఈ నెల 23న) నిర్వహించతలపెట్టిన ధూంధాం కార్యక్రమానికి అనుమతి లభించలేదు. అనుమతి కోరుతూ విద్యార్థి నేతలు వినతిపత్రం ఇవ్వగా రిజిస్ట్రార్‌ ప్రొ.గోపాల్‌రెడ్డి నిరాకరించారు. వర్సిటీ అధికారులు ఒప్పుకోకున్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 24న ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, టీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు, 25న వివిధ విద్యార్థి సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు సంయుక్తంగా నిర్వహించనున్న బహిరంగ సభకూ అనుమతి లభించలేదు.

తగ్గిన బస్సులు

కార్మికుల సమ్మెతో పట్టు పట్టి బస్సులు నడుపుతున్న ప్రభుత్వం మంగళవారం ఆ స్థాయిలో బస్సులు నడపలేకపోయింది. 5,285 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో ఆర్టీసీ బస్సులు 3,851 మాత్రమే ఉన్నాయి. అద్దె బస్సులు 1,434 నడిచినట్లు తెలిపింది. గడిచిన కొద్ది రోజులుగా నడుస్తున్న బస్సులతో పోలిస్తే దాదాపు సగం తగ్గాయి.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.