
ఏళ్లుగా కొందరికే టెండర్లు
ముడిసరకు నాణ్యతపై అనుమానాలు
సరఫరా టెండరు నిలిపివేసిన శిశు సంక్షేమ శాఖ
ఈనాడు, హైదరాబాద్: అంగన్వాడీల్లో పసిపిల్లలకు అందించే నాణ్యమైన పౌష్టికాహారం ‘బాలామృతం’ తయారీకి అవసరమైన ముడిసరకుల సరఫరాలో కొందరు గుత్తేదారులు చక్రం తిప్పుతున్నారు. పదిహేనేళ్లుగా వారి మధ్యే వ్యవహారం నడుస్తోంది. ప్రతిసారీ వారికే టెండర్లు దక్కడాన్ని ఇటీవల ప్రభుత్వం గుర్తించింది. విచారణకు ఆదేశించింది. ఏళ్లుగా ఆ గుత్తేదారులు ఒక్కో వస్తువు సరఫరా చేస్తున్నప్పటికీ.. నాణ్యత పరీక్షలు లేకుండానే అనుమతులివ్వడంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ముగ్గురు, నలుగురు గుత్తేదార్లే ఒక్కో సరకుకు ఎల్-1గా ఎలా వస్తున్నారన్న దానిపై విచారణ మొదలుపెట్టింది. ఈ-టెండర్లలో సిండికేట్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చింది. ఇప్పటివరకు సరఫరా చేసిన సరకుల నాణ్యతపై పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 18 లక్షల మంది చిన్నారులకు తెలంగాణ ఫుడ్స్ సరఫరా చేస్తున్న ఆహారం అందుతోంది. అంగన్వాడీలకు రాలేని పిల్లలకు ఇంటికే ప్యాకెట్ల రూపంలో పంపిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 35వేల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాల తయారీకి దాదాపు రూ.120 కోట్ల విలువైన ముడిసరకు సమీకరిస్తున్నారు. తెలంగాణ ఫుడ్స్ సరఫరా చేసే బాలామృతం, స్నాక్స్, రెడీమేడ్ ఉప్మా, కిచిడి, హల్వా తదితర ఆహారపదార్థాల తయారీకి గోధుమలు, పప్పులు, నూనె, పాలపొడి, చక్కెర, కారం, ఉప్పు తదితర దినుసులు అవసరం. పిల్లలకు బలవర్థకమైన ఈ ఆహారానికి అవసరమైన ఫార్ములాను జాతీయ పరిశోధన సంస్థలు రూపొందించాయి. అంగన్వాడీల్లో పేర్లు నమోదు చేయించుకున్న 7 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు రోజుకి 100 గ్రాముల చొప్పున బాలామృతం, ఇతర స్నాక్స్‌ను అందిస్తున్నారు. ఉదయం ఉప్మా, మధ్యాహ్నం భోజనం, ఇంటికి వెళ్లేపుడు స్నాక్స్ ఇస్తున్నారు.
ఫిర్యాదులు రావడంతో ఆరా..
ఇటీవల సరకుల సరఫరాకు తెలంగాణ ఫుడ్స్ టెండరు పిలిచింది. ఏటా ముగ్గురు, నలుగురికే టెండర్లు దక్కడంపై ఫిర్యాదుల రావడంతో మహిళా శిశు సంక్షేమశాఖ సమీక్షించింది. ఈ టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నట్లు నిర్ధరించింది. నవంబరు 1న తాజా టెండరు ఆమోదించాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన సరఫరా, టెండరు విధానంపై విచారణ పూర్తై, ఆహార పదార్థాల ముడిసరకు నాణ్యత పరీక్షపై వివరాలు వచ్చేవరకు నిర్ణయం తీసుకోవద్దని భావిస్తోంది.ప్రస్తుతం అందుబాటులోని ముడిసరకుతో డిసెంబరు 15 వరకు ఆహార పదార్థాల ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందుల్లేవని సంక్షేమశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నాయి.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- వారంలో ఖతం
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు