close
ఉన్నతస్థాయి కమిటీ వేయలేం

కార్మిక న్యాయస్థానానికి నివేదించండి
వివాదాన్ని తేల్చడానికి అదే సరైన వేదిక
ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్ర అనుమతి అవసరంలేదు
హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
విచారణ 18కి వాయిదా
ప్రైవేటీకరణ వివాదంపై నేడు విచారణ

ప్రస్తుత ఆర్టీసీ వివాదం పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్‌ 10 కింద కార్మిక న్యాయస్థానానికి నివేదించాల్సిన స్థాయిలో ఉంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం చిత్తశుద్ధితో, తీవ్రంగా పరిశీలించింది. ఆర్టీసీ వివాదాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకికానీ, ఇతర ప్రముఖుల కమిటీకి కానీ నివేదించాలని చట్టంలో లేదు. అందుకే కమిటీ ఏర్పాటు చేయలేం. పారిశ్రామిక వివాదాల చట్టం కింద తదుపరి చర్యలు తీసుకోవడానికి మరింత కాలయాపన జరగకుండా తగిన ఉత్తర్వులు ఇవ్వండి.
 

-హైకోర్టులో సీఎస్‌ అఫిడవిట్‌

 

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె వివాద పరిష్కారం నిమిత్తం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు విజ్ఞప్తిపై ప్రభుత్వం అశక్తత వ్యక్తం చేసింది. కమిటీ ఏర్పాటు చేయలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ వివాదాన్ని కార్మిక న్యాయస్థానానికి నివేదించాలని విజ్ఞప్తి చేసింది. అంతేగాకుండా ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్ర అనుమతి అవసరంలేదని కూడా స్పష్టం చేసింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారమే ఆస్తి, అప్పుల పంపకాలు ఉంటాయంది. ఆర్టీసీ ఏర్పాటుకు ప్రత్యేక చట్టం ఉన్నప్పటికీ పునర్‌వ్యవస్థీకరణ చట్టమే వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపించారు.

ఎండీని నియమించాలని ఆదేశాలివ్వలేదు
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కమిటీ ఏర్పాటు చేయడానికి హైకోర్టుకు అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కానీ ప్రభుత్వం, ఆర్టీసీ రెండూ సమ్మతించలేదన్నారు. మొదటి నుంచి ప్రభుత్వం అదే వైఖరి అనుసరిస్తోందన్నారు. ఆర్టీసీ ఎండీని నియమించాలని హైకోర్టు చెప్పినా నియమించలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తాము అలాంటి ఆదేశాలివ్వలేదని, 21 డిమాండ్‌లు పరిష్కరించదగ్గవి ఉన్నాయని మాత్రమే చెప్పామంది. ‘ఒకవేళ మీరు మా ఆదేశాలను అలా అర్థం చేసుకుని ఉంటే ఏం చేయలేమ’ని వ్యాఖ్యానించింది.

ఎస్మాను ఎలా ప్రయోగిస్తారు?
సమ్మె చట్టవిరుద్ధమని, అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద చర్యలు తీసుకోవాల్సి ఉందన్న ఏజీ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ ఎస్మా కింద ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. తెలంగాణ ఆర్టీసీని ఎస్మా కిందికి తెస్తూ ఎప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేశారని ప్రశ్నించింది. సమ్మె చట్టవిరుద్ధమని పారిశ్రామిక వివాదాల (ఐడీ) చట్టం కింద ట్రైబ్యునల్‌ ప్రకటిస్తుందని, మరి ఎస్మా కింద ఇలాంటి ప్రకటన చేయడానికి అధీకృత అధికారి ఎవరని అడిగింది. ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ విభాగం ఆ ప్రకటన చేయవచ్చని ఏజీ చెప్పారు. ఆర్టీసీని ఎస్మా కిందికి తెస్తూ 2015లో జీవో 180 జారీ అయిందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అది ఆరునెలలకేనని, ఏపీఎస్‌ఆర్టీసీకే పరిమితమని పేర్కొంది. ఏపీఎస్‌ఆర్టీసీకే అయినా వాటన్నింటినీ వర్తింపజేసుకుంటున్నామని ఏజీ చెప్పారు.

పునర్‌వ్యవస్థీకరణ చట్టానిదే ఆధిపత్యం
ఏపీఎస్‌ఆర్టీసీ విభజనలో భాగమే టీఎస్‌ఆర్టీసీ అని ఏజీ తెలిపారు. ‘రవాణా చట్టంలోని సెక్షన్‌ 47ఎ మాకు వర్తించదు. దీనికింద ఆర్టీసీని విభజించడానికి కేంద్ర అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదు’ అని ఆయన వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘ఆర్టీసీ చట్టాన్ని చూడండి. ఏదైనా రాష్ట్రాన్ని విభజించినపుడు కార్పొరేషన్‌ ఆస్తులను విడగొట్టి మరో రాష్ట్రానికి బదలాయించే ముందు ఆ కార్పొరేషన్‌ను పునర్‌వ్యవస్థీకరించాలి. దీనికి ఓ పథకం రూపొందించి దాని ప్రకారం చేయాలి. ఛత్తీస్‌గఢ్‌ విభజన సమయంలో 47ఎ కింద అనుమతి తీసుకునే ఆర్టీసీని విభజించారు’ అని తెలిపింది. టీఎస్‌ఆర్టీసీకి అలాంటి అనుమతి ఎక్కడుందని ప్రశ్నించింది. ఆర్టీసీ విభజనకు తమ అనుమతి లేనందున దాన్ని గుర్తించబోమని కేంద్రం చెబుతున్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఏజీ జోక్యం చేసుకుంటూ ‘కేంద్ర అనుమతి అవసరంలేదు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూలు పరిధిలోని సంస్థల ఆస్తి, అప్పులను ఆ చట్ట నిబంధనల ప్రకారం పంపిణీ చేస్తారు. ఆర్టీసీ విభజనపై కేంద్రం నుంచి నామమాత్రపు అనుమతి తీసుకుంటాం. ముందస్తు అనుమతి అంత ముఖ్యంకాద’ని స్పష్టం చేశారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు మరే ఇతర చట్టంలోని నిబంధనలతోనైనా విభేదిస్తే పునర్‌వ్యవస్థీకరణ చట్ట నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు. ఆర్టీసీ చట్టం, పునర్‌వ్యవస్థీకరణ చట్టాలను పోలిస్తే పునర్‌వ్యవస్థీకరణ చట్టానికే ప్రాధాన్యం ఉందన్నారు. దీంతో ధర్మాసనం ఏకీభవిస్తూ రాజ్యాంగం ప్రకారం పునర్‌వ్యవస్థీకరణ చట్టానిదే ఆధిపత్యమని అంగీకరించింది.

సమ్మె చట్టవిరుద్ధమే: ఆర్టీసీ
చట్ట విరుద్ధంగా సమ్మె కొనసాగుతోందని ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు చెప్పగా ఎలా చెప్పగలరని ధర్మాసనం ప్రశ్నించింది. యాజమాన్యం, కార్మికుల మధ్య వివాదం వస్తే పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోనే జరగాలని ఏఏజీ తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చాక కొంత విరామం ఇచ్చి సమ్మెకు వెళ్లాల్సి ఉందని, దానికి విరుద్ధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె ప్రకటనే చట్టవిరుద్ధమని చెప్పవచ్చన్నారు.

గడువు కావాలి..
యూనియన్‌ల తరఫున వాదనలు వినిపించడానికి ఈనెల 18వరకు అందుబాటులో ఉండలేనని సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి చెప్పగా ధర్మాసనం విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. అయితే ప్రైవేటీకరణలో భాగంగా 5100 పర్మిట్‌ల జారీని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపడతామంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.


మరింత జాప్యం కాదా!

కార్మికులు సమ్మెలో ఉన్నారని, ఇక్కడ పిటిషన్లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉందని ఏజీ న్యాయస్థానానికి వివరించారు. వివాదాన్ని లేబర్‌ కమిషనర్‌కు పంపితే ఆయన కార్మిక న్యాయస్థానానికి నివేదిస్తారని, ప్రభుత్వ విజ్ఞప్తి కూడా అదేనని తెలిపారు. వివాదాన్ని లేబర్‌ కమిషనర్‌కు పంపితే అక్కడ విచారణతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ అలా కమిషనర్‌కు ఇవ్వాల్సి వస్తే తగిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించవచ్చుకదా అంది. కమిషనర్‌ ముందు కూడా రెండు ప్రత్యామ్నాయాలున్నాయని కార్మిక న్యాయస్థానానికి నివేదించడం ఒకటి, నివేదించకుండా దానికి కారణాలు చెప్పడం మరోటని ధర్మాసనం పేర్కొంది. ఏజీ స్పందిస్తూ లేబర్‌ కమిషనర్‌ సత్వరమే కార్మిక న్యాయస్థానానికి నివేదిస్తారని తెలిపారు. అక్కడ ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా తేలుస్తారన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.