విద్యాసంస్థల్లోనూ ఓ విధానం
‘‘ఇది దేశాన్ని కలచివేసిన ఘటన. చట్టాలు చేయడంతోనే సమస్య పరిష్కారం కాదు. సమస్యను మూలాల నుంచి తొలగించాలంటే సమాజం మద్దతు అవసరం. విద్యాసంస్థల్లోనూ ఒక విధానం ఏర్పాటుచేయాలి. దోషులు తప్పించుకోకూడదు’’
-రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్
|
భయపడేలా శిక్ష ఉండాలి
‘‘ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దేశంలో రోజురోజుకీ మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కఠినచర్యలు తీసుకోవాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో తక్షణమే శిక్షలు పడాలి. భవిష్యత్తులో ఎవరైనా ఈ తరహా ఘాతుకాలకు పాల్పడాలంటే భయపడేలా శిక్ష ఉండాలి’’
-శంతనుసేన్, తృణమూల్
|
అప్పీలుకు అవకాశం ఇవ్వకూడదు
‘‘నేరస్థులు భయపడట్లేదు. కోర్టుల్లో ఏళ్లతరబడి విచారణ సాగుతోంది. ఇలాంటి ఘటనలపై 15-20 రోజుల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ప్రజలకు సందేశం ఇవ్వాలి. శిక్ష వేసిన తర్వాత పైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వకూడదు’’
-సుబ్బిరామిరెడ్డి, కాంగ్రెస్
|
ఉరి.. లేదా యావజ్జీవం
‘‘హైదరాబాద్ ఘటన యావద్దేశం తలదించుకోవాల్సినది. నిందితులకు ఉరిశిక్ష వేయాలి. లేదా యావజ్జీవ శిక్షకు తగ్గకూడదు. తక్షణశిక్ష విధించే చట్టాలు కావాలి. ఈ తరహా నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’
-బండ ప్రకాశ్, తెరాస
|
పరిధిని పక్కన పెట్టాలి
‘‘దిశ ఘటన నిర్భయ ఘటనను గుర్తుచేయడంతోపాటు ప్రభుత్వాలు, పౌరుల బాధ్యతనూ గుర్తుచేసింది. ఈ తరహా ఘటనల్లో పోలీసులు పరిధి పక్కన పెట్టి ఫిర్యాదు తీసుకోవాలి. కేసులో జాప్యం లేకుండా బాధితులకు సత్వర న్యాయం అందించి, నిందితులకు తక్షణ శిక్ష పడేలా నిర్ణయాలుండాలి. ప్రజలు సత్వరన్యాయం పేరుతో ఉరిశిక్ష డిమాండు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టులు సత్వరన్యాయం చేస్తాయన్న భావన కలిగించడం ద్వారా నేరాలను అరికట్టవచ్చు’’
-కనకమేడల రవీంద్రకుమార్, తెదేపా
|
వీటిపై ఎన్నిసార్లు మాట్లాడానో
‘‘ఇలాంటి హేయమైన అత్యాచార ఘటనలపై ఎన్నిసార్లు మాట్లాడానో గుర్తులేదు. నిర్భయ, కథువా, హైదరాబాద్ లాంటి ఘటనలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కచ్చితమైన సమాధానం ఇవ్వాలి. ఇలాంటి దురాగతాలకు పాల్పడినవారిని క్షమాభిక్ష లేకుండా ఉరితీయాలి. ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీయాలి. నిర్భయకు ఇంకా న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయి.. ఏం జరిగిందనేది ప్రజలు గమనిస్తున్నారు. కొన్నిదేశాల్లో దోషులను ప్రజలే శిక్షిస్తారు. నిందితులను ప్రజల మధ్యకు తీసుకొచ్చి శిక్షించాలని నా సూచన’’
-జయాబచ్చన్, ఎస్పీ
|
డిసెంబరు 31లోగా శిక్షించాలి
‘‘హైదరాబాద్ ఘటనపై దిగ్భ్రాంతికి గురయ్యా. దేశంలో చిన్నారులకు, మహిళలకు రక్షణ లేదు. దిశను హత్యచేసిన నలుగురు నిందితులను డిసెంబరు 31లోగా శిక్షించాలి. వాళ్లను ఉరితీయాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి, సత్వరన్యాయం జరిగేలా చూడాలి. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా బయట తిరగగలిగినపుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ చెప్పారు. మహిళలకు దేశం సురక్షితంగా లేదు. రోజువారీ విచారణ చేసి నిందితులకు త్వరగా శిక్ష వేయాలి. పోర్నోగ్రఫీ, డ్రగ్స్‌ను నిషేధించాలి’’
-విజిలా సత్యానంద్, అన్నాడీఎంకే
|
వారి వివరాలు బయటపెట్టాలి
‘‘తెలంగాణ ఘటనతో దేశమంతా దిగ్భ్రమకు గురైంది. కేరళలోని పొల్లాచిలోనూ ఇలాంటి ఘటన జరిగింది. మహిళలపై నేరాలు చేసినవారి వివరాలు బహిరంగపరచాలి. ప్రజలు వారిపట్ల అప్రమత్తంగా ఉండేలా చూడాలి’’
-పి.విల్సన్, డీఎంకే
|
ప్రజల ఆలోచనా మారాలి
‘‘పోలీసు, న్యాయవ్యవస్థలో సంస్కరణలే కాదు.. ప్రజల ఆలోచనా ధోరణిలోనూ మార్పురావాలి. మహిళల భద్రతపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి’’
-అమీయాజ్ఞిక్, కాంగ్రెస్
|
ఎవరినీ ఉపేక్షించకూడదు
‘‘ఇలాంటి కేసుల్లో ఎవరినీ ఉపేక్షించకూడదు. గతంలోనూ అనేక ఘటనలు జరిగాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అని రాష్ట్రప్రభుత్వం అంటోంది. సత్వర న్యాయం జరిగేలా చూడాలి’’
-మహ్మద్ అలీఖాన్, కాంగ్రెస్
|
చదువు.. సంస్కారం ఏమవుతున్నాయి?
‘‘పరాయి స్త్రీని తల్లిగా చూడాలని నేర్చుకున్నాం. చదువు, సంస్కారం ఎక్కడికి పోతున్నాయి? రాష్ట్రాలు నిర్భయ నిధులను వినియోగించడం లేదు. నిందితులకు తక్షణ శిక్ష పడాలి’’
-ఆర్కే సిన్హా, భాజపా
|
కోర్టుకు వెళ్లినా సత్వరన్యాయం దక్కట్లేదు
‘‘హైదరాబాద్ తరహా ఘటనలు చాలాచోట్ల జరుగుతున్నాయి. నిర్భయ ఘటన సమయంలో ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. చట్టాలు ఎక్కడ అమలవుతున్నాయి? అందుకే నిర్భయ తల్లి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలు కోర్టుకు వెళ్లినా సత్వర న్యాయం దక్కడం లేదు. ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెంచాలి. గ్రామాలు, పట్టణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలి. చీకటి ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాట్లుచేయాలి’’
-సంజయ్ సింగ్, ఆప్
|
సమాజం ముందుకు రావాలి
‘‘చట్టాలు పరిష్కారం చూపాలి. అంతకన్నా సమాజం ముందుకు రావాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉండాలి’’
-అమర్ పట్నాయక్, బిజద, వీర్‌సింగ్, బీఎస్పీ
|
పత్రికలు అవగాహన కల్పించాలి
‘‘పత్రికలు సంపాదకీయాలు, వార్తాకథనాలతో అవగాహన కల్పించాలి. దిశ ఘటనపై ప్రాంతీయ పత్రికలు చాలా సమాచారం ఇచ్చాయి. చేసిన చట్టాలు అమలుకావాలి’’
-టీకే రంగరాజన్, సీపీఎం
|
తల్లిదండ్రులు భయపడుతున్నారు
‘‘మనదేశంలో మహిళలను దేవతలుగా కొలుస్తారు. కానీ సమాజంలో పరిస్థితి అలా లేదు. తల్లిదండ్రులు భయపడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలి’’
-వైగో, ఏడీఎంకే
|
అన్ని కోర్టులూ ఫాస్ట్‌ట్రాక్ కావాలి
‘‘ఇలాంటి ఘటనలు జరగగానే అందరూ షాక్ తిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు అంటున్నారు. అన్ని కోర్టులూ ఫాస్ట్‌ట్రాక్ కావాలి’’
-నరేశ్ గుజ్రాల్, శిరోమణి అకాలీదళ్
|
అందరు వచ్చిందీ మహిళ గర్భం నుంచే
‘దేశంలో మహిళలకు రక్షణ లేదు. ఎనిమిదేళ్ల బాలిక, ఎనభై ఏళ్ల మహిళపైనా అత్యాచారం అని చదువుతున్నాం. ప్రతి ఒక్కరూ మహిళ గర్భంనుంచి వచ్చిన వారేనన్న సంగతి మరచిపోతున్నారు. ఇలాంటి నిందితుల్ని ఉరితీయాలి’’
-బినోయ్ విశ్వం, సీపీఐ
|
స్టేషన్లలో సాంకేతికత అభివృద్ధి చెందాలి
‘‘బ్రిటిష్‌కాలం నాటి చట్టాలు మారాలి. పోలీసుస్టేషన్లలో సాంకేతికత అభివృద్ధి చెందాలి. వ్యవస్థలో మార్పులు వస్తే ఇలాంటివి జరగవు’’
- అశ్వినీ వైష్ణవ్, భాజపా
|
ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలి
‘‘ఫిర్యాదు చేయాల్సిన పరిధి తమది కాదనడం పోలీసులకు సరికాదు. అత్యాచార కేసుల విషయంలో ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలి. కానీ తెలంగాణలో అలా చేయలేదు. నమోదు చేయనివారిని సస్పెండ్చేయాలి’’
- సుఖేందు శేఖర్‌రాయ్, తృణమూల్
|
ప్రజా సంకల్పంతోనే నియంత్రణ
‘‘ఈ తరహా ఘటనలు జరిగినపుడు అందరం ఒక్కటి కావాలి. ప్రజాసంకల్పంతోనే వీటిని నియంత్రించగలం. భవిష్యత్తులో పునరావృతం కాకుండా అందరం కలిసి ముందుకెళ్దాం. మహిళల రక్షణ బాధ్యత అందరిపైనా ఉంది’’
- భూపేంద్రయాదవ్, భాజపా
|
నిర్లక్ష్యం వల్లే పునరావృతం
హైదరాబాద్ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. రాష్ట్రంలో సంస్కరణలు, సదుపాయాలు తీసుకొస్తామని చెబుతున్నారే తప్ప అమలులో నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.
-బండి సంజయ్, భాజపా, కరీంనగర్
|
ఐపీసీని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది
ఇది బాధాకరమైన అంశం. నిర్భయ చట్టం చేసినా మార్పురాలేదు. ఐపీసీని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది.
-నామా నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభాపక్ష నేత
|
‘భారత్దేశ్కీ మహిళాయోంకో బచావో’ కావాలి
బేటీ బచావో.. బేటీ పఢావో కాదు.. ‘బేటీ బచావో.. భారత్దేశ్కీ మహిళాయోంకో బచావో’ కావాలి.
-మాలోత్ కవిత, తెరాస, మహబూబాబాద్
|
మహిళలను దాచుకునే పరిస్థితి వస్తుంది
ఇలాంటి ఘటనలు జరుగుతూ పోతే మళ్లీ గతంలోలా మహిళలను దాచుకునే పరిస్థితి వస్తుంది. కఠిన చట్టాలు తీసుకురావాలి.’
-వంగా గీత, వైకాపా, కాకినాడ
|
ఈ సమావేశాల్లోపే శిక్షపడేలా చూడాలి
హైదరాబాద్ క్రూరఘటనపై తెలుగు రాష్ట్రాలే కాదు.. యావద్దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ సమావేశాలు ముగిసేలోపు కారకులకు శిక్షలుపడేలా ప్రధానమంత్రి చర్య తీసుకోవాలి.
-రఘురామకృష్ణరాజు, వైకాపా, నరసాపురం
|