close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇదో మంచి కథావకాశం

కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు, వాళ్ల బృందాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ఖాళీగా కూర్చోవడం తప్ప మరో వ్యాపకం లేకుండా గడిపారు. ఒక రకంగా అందరికీ ఇది కష్టకాలమే. అయితే దర్శకులు మాత్రం ఈ విరామాన్ని కూడా ఓ సదావకాశంగా మలుచుకున్నారు. కాదు కాదు.. కథావకాశంగా మలుచుకున్నారు. ఈ విరామంలో రెండు మూడు కథలు సిద్ధం చేసుకున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. ఆ దర్శకులంతా ఇకపై విరామం లేకుండా సినిమాల్ని పట్టాలెక్కిస్తామని చెబుతున్నారు.

మధ్య ఓ అగ్ర హీరో, దర్శకుడు కలిసి సినిమా చేయాలనుకున్నారు. కథ కూడా నచ్చింది. తీరా ఆ కథానాయకుడు సినిమా కోసం రంగంలోకి దిగాలనుకునేలోపు పూర్తిస్థాయి స్క్రిప్టు సిద్ధం కాలేదు. దాంతో మరో దర్శకుడు కథ సిద్ధం చేసే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.
మరో దర్శకుడు ప్రత్యేకంగా ఓ హీరో కోసం కథని సిద్ధం చేసుకున్నాడు. ఆ కథానాయకుడికీ నచ్చింది. కానీ ఆయన చేస్తున్న మరో సినిమా ఎంతకీ పూర్తి కాలేదు. దాంతో సదరు దర్శకుడు ఆ హీరో కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది.
- చిత్రసీమలో నిత్యం జరిగే తంతే ఇది. దర్శకుల వల్ల హీరోలకు, హీరోలవల్ల దర్శకులకు విరామం వస్తూనే ఉంటుంది. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు తక్కువంటున్నాయి పరిశ్రమ వర్గాలు. అందుకు కారణం... బోలెడన్ని కథలు సిద్ధం కావడమే! కరోనాతో వచ్చిన ఈ విరామంలో అగ్ర దర్శకులు, రచయితలు పలు కథలు సిద్ధం చేశారు. ఇకపైన హీరోలు ఒక కథ నచ్చలేదంటే, మరో దర్శకుడితో సినిమాని పట్టాలెక్కించొచ్చు. దర్శకులు కూడా ఓ హీరో బిజీగా ఉన్నాడంటే, అతని కోసం తయారు చేసిన కథని పక్కనపెట్టేసి.. అందుబాటులో ఉన్న మరో హీరోకి తగ్గ కథతో   సినిమాని మొదలు పెట్టొచ్చు.

తొలి రోజు నుంచే...
దర్శకుల్లో ఒకొక్కరిది ఒక్కో శైలి. ఒక్కసారి కథ పక్కాగా సిద్ధమైంది  అనుకున్నాక ఇక మళ్లీ అందులో వేలు పెట్టని దర్శకులు ఒక రకం. సెట్స్‌పైకి వెళ్లాక ఆఖరి నిమిషంలోనూ అందులో మార్పులు చేసే దర్శకులు కొందరు. రెండో రకం దర్శకులు లాక్‌డౌన్‌తో వచ్చిన విరామంలో తమ స్క్రిప్టులకి ఫైన్‌ ట్యూనింగ్‌ పేరిట మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. అది పూర్తయిందనుకున్నాక మరో కథపై దృష్టిపెట్టారు. ఇక మొదట రకం దర్శకులైతే లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత రోజు నుంచే కొత్త కథల్ని సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టారు.
దర్శకుడు పూరి జగన్నాథ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ముంబయిలోనే గడుపుతున్నారు. ఆయన ఈ విరామంలో ఓ పాన్‌ ఇండియా స్థాయి కథని సిద్ధం చేసుకున్నారు. అది పూర్తయ్యాక పరిస్థితుల్ని బట్టి మరో కథనీ మొదలు పెడతానని ‘ఈనాడు సినిమా’తో చెప్పారు. ఆయన ఒక సినిమా చేస్తూనే, మరో సినిమాకి కథని సిద్ధం చేస్తుంటారు. అలాంటిది ఈసారి దాదాపు రెండు నెలలు ఏకధాటిగా విరామం రావడంతో ఈ సమయాన్ని పూర్తిగా కథల కోసం సద్వినియోగం చేసుకున్నారు. మరో దర్శకుడు శేఖర్‌ కమ్ముల చేస్తున్న ‘లవ్‌స్టోరీ’ ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. తదుపరి చిత్రం కోసం ఆయన మరో కథని సిద్ధం చేశారు. అందులో ఓ అగ్ర హీరో నటించబోతున్నాడని, ఆ సినిమాని   ఎక్కువగా సమయం తీసుకోకుండా పట్టాలెక్కిస్తానని చెబుతున్నారు. చిత్రీకరణలకి అనుమతులు రాగానే ‘ఆచార్య’ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు కొరటాల శివ. ఆయన కూడా ఈ విరామంలో వేరే కథలపై దృష్టి పెట్టారు. ‘‘సమయం దొరికితే రాసుకున్న కథలు మరింత మెరుగవుతుంటాయి. కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వాటితో కొత్త కథలు పుడుతుంటాయి. ఈ విరామంలో రాయడంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నా’’ అని చెప్పారు కొరటాల శివ. ఈయన కూడా తదుపరి సినిమాని ఆలస్యం చేయకుండా పట్టాలెక్కిస్తానని, ఇక నుంచి మరింత వేగంగా సినిమాలు చేయబోతున్నానని చెబుతున్నారు. మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌.. ఎన్టీఆర్‌తో చేయనున్న చిత్రం కోసం  ఇప్పటికే స్క్రిప్టుని సిద్ధం చేశారు. ఎన్టీఆర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ పూర్తవడానికి సమయం పడుతుంది కాబట్టి, ఇప్పుడాయన మరో కథపై దృష్టి పెడుతున్నారని తెలిసింది. దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప’ సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ఒక పక్క ఆ సినిమా సన్నాహాలు చేసుకుంటూనే, మరోపక్క కొత్త కథలపై దృష్టి పెట్టారు. తన నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌లో సుకుమార్‌ కథలతోనే సినిమాలు రూపొందుతుంటాయి. బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో సినిమాని ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో పాటు తన దగ్గరున్న ఇతర కథలపైనా కసరత్తులు చేస్తున్నారు. పరశురామ్‌ కూడా మహేష్‌తోపాటు, నాగచైతన్య చిత్రం కోసం స్క్రిప్టులు సిద్ధం చేశారు. బాబీ, సుజీత్‌ తదితరులు చిరంజీవితో సినిమా కోసం కథని స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నారు. అనిల్‌ రావిపూడి, మోహనకృష్ణ ఇంద్రగంటి రెండు మూడు కథలపై దృష్టి సారించారట. క్రిష్‌, హరీష్‌శంకర్‌... ఇలా అందరూ కూడా స్క్రిప్టులతో బిజీ బిజీ.

 

కథలు మారబోతున్నాయి

రోనాతో వచ్చిన ఈ విరామం మన కథల తీరుతెన్నుల్ని మార్చేస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఈ విరామంలో ఓటీటీల ద్వారా ప్రపంచ సినిమా దగ్గరైంది. దాంతో ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. అందుకు తగ్గట్టుగా దర్శకులు వైవిధ్యంగా కథలు తయారు చేస్తార’’ని అగ్ర దర్శకుడు రాజమౌళి ‘ఈనాడు సినిమా’తో చెప్పారు.  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టిన ఆయన, తదుపరి సినిమాలకి సంబంధించిన కథలపైనా సమాలోచనలు జరుపుతుంటానని చెప్పారు. రచయితలు కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. యువ  రచయిత ప్రసన్నకుమార్‌ బెజవాడ ఈ విరామంలో నాలుగు కథల్ని సిద్ధం చేసినట్టు ‘ఈనాడు సినిమా’తో చెప్పారు. ‘‘ఎలాంటి ఒత్తిళ్లు లేని సమయం దొరికింది. వాలీబాల్‌ దిగ్గజం అరికపూడి రమణారావు బయోపిక్‌తో పాటు ఒక పోలీస్‌ కథ, టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే మరో కథని సిద్ధం చేశా’’ అన్నారు ప్రసన్నకుమార్‌.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.