close

ప్రధానాంశాలు

పోలీసు చర్యలు ఆందోళనకరం

మావోయిస్టుల పేరుతో అర్ధరాత్రి అరెస్టులేంటి?
రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదు
ప్రొఫెసర్‌ కాశీం కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
ఆయనపై ఎఫ్‌ఐఆర్‌లేంటో తెలపాలని ఆదేశం

ఓ పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విద్యా వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరోధించడం కూడా ఇప్పుడు ఈ కోర్టు ముందు ఉంది.

మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలపై ఓ ప్రొఫెసర్‌నే అరెస్ట్‌ చేసినపుడు ప్రభుత్వం తన అధికారంతో నిరసన గళాలను నిశ్శబ్దంగా అణచివేస్తోందా అనే అంశాన్నీ పరిశీలనగా చూడాల్సి ఉంది.

- విరసం కార్యదర్శి కాశీం నిర్బంధ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు సానుభూతిపరులుగా పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నవారు చెబుతున్న అంశాలను పరిశీలిస్తే పోలీసు చర్యలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘అర్ధరాత్రి.. లేదంటే తెల్లవారుజామున అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడం మామూలైపోయింది. ఇలాంటి పలు పిటిషన్లపై మేము విచారణ చేపడుతున్నా’మని పేర్కొంది. విరసం కార్యదర్శి, ఉస్మానియా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కాశీంను అక్రమంగా నిర్బంధించారంటూ ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే నివాసంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదివారం విచారణ చేపట్టింది. ‘‘పోలీసులు తనిఖీల పేరుతో ఇళ్లలోకి జొరబడి మావోయిస్టుల సాహిత్యాన్ని పెట్టి బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటున్నారని అరెస్టు అయిన వారు చెబుతున్నారు. ఇలాంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.   రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదు. కాశీంకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తులో పురోగతి, మావోయిస్టుల తరఫున డబ్బు వసూలు చేస్తున్నారనడానికి, సమావేశాల్లో పాల్గొన్నారనడానికి సంబంధించి ఆధారాలతో ఈనెల 23కల్లా కౌంటరు దాఖలు చేయండి’’ అని పోలీసులను ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదావేసింది.

అప్పటివరకు కాశీంను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచాలంది. సంగారెడ్డి జిల్లాలో సరైన వసతుల్లేవని, చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘునాథ్‌ కోరారు. ధర్మాసనం స్పందిస్తూ మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా చర్లపల్లి జైలుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతానికి ఆదివారం ఆయన్ను సంగారెడ్డి జైలుకు తరలించారు.

మావోయిస్టు సాహిత్యాన్ని పోలీసులే ఉంచారు: కాశీం
హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్‌ పోలీసులు ఆదివారం ఉదయం కాశీంను బంజారాహిల్స్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. హైకోర్టు ఆయన నుంచి వాంగ్మూలాన్ని తీసుకుంది. ‘నాకు మావోయిస్టులతో ఎటువంటి సంబంధాలు లేవు. ఆ భావజాలాన్ని ప్రచారం చేయడంగానీ, వారి కోసం నిధులు సేకరించడం, డబ్బు పంపిణీ, విప్లవ సాహిత్యం అందజేయడం, కరపత్రాల పంపిణీ వంటివి చేయడంలేదు. ఈ నెల 18న ఉదయం పోలీసులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని నా ఇంటి తాళాన్ని పగులగొట్టి సోదాలు చేశారు. ముగ్గురు పోలీసు దుస్తుల్లో ఉండగా 30 మందిదాకా సివిల్‌ దుస్తుల్లో వచ్చారు. నా లైబ్రరీలో పోలీసులే మావోయిస్టు సాహిత్యాన్ని పెట్టి దొరికినట్లు ప్రకటించారు’’ అని వివరించారు. మావోయిస్టులతో మాట్లాడినట్లు, బలవంతంగా డబ్బు వసూలు చేసి వారికిస్తున్నట్లుగా శనివారం ములుగు పోలీసు స్టేషన్‌లో బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఇదే విషయాన్ని కింది కోర్టుకు చెప్పా. పేద కుటుంబం నుంచి వచ్చిన నాపై ఏడుగురు ఆధారపడి ఉన్నారు. పోలీసు చర్య వల్ల ఉద్యోగానికి ప్రమాదం ఉంది. నన్ను విడుదల చేసేలా ఆదేశాలివ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్‌ తరఫు వాదనలు వినిపించేందుకు రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌, కాశీం సతీమణి స్నేహలతలను అనుమతించారు.


2016లో వాంగ్మూలం ఇస్తే ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు?

‘మందల శ్యాంసుందర్‌రెడ్డి అనే వ్యక్తి 2016లో పోలీసుల ముందు లొంగిపోయి.. కాశీం మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడంతోపాటు వారి తరఫున డబ్బు వసూలు చేస్తున్నట్లు చెప్పినట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మరి నాటి నుంచి ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? కాశీం ఇటీవల క్యాంపస్‌లో కుల రాజకీయాలను ప్రశ్నిస్తూ పుస్తకాన్ని ముద్రించిన తరువాతనే అరెస్ట్‌ చేశారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మా ముందున్న రిమాండ్‌ డైరీని పరిశీలిస్తే కాశీంపై 5 కేసులున్నాయి. 2006 నుంచి 2019 వరకు క్రిమినల్‌ చర్యల్లో పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నా ఇప్పటిదాకా అరెస్ట్‌ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయన సమాజానికి, రాష్ట్రానికి ప్రమాదకారిగా మారారని చూపుతున్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ దాఖలు చేసే కౌంటర్‌లో వీటన్నింటిపై వివరాలుండాలి’ అని స్పష్టం చేసింది. ‘2016నాటి ఎఫ్‌ఐఆర్‌లో కాశీం భార్య సహా 44 మంది నిందితులున్నారు. ఎంతమందిని అరెస్ట్‌ చేశారు? 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నందున పట్టించుకోలేకపోయామని చెబుతున్న పోలీసులు, పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? కాశీం లైబ్రరీ నుంచి మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై రికవరీ మెమోను సమర్పించాలి. దీనివల్ల ఏయే పుస్తకాలున్నాయో తెలుస్తుంది’’ అని పేర్కొంది. 


నా భర్తపై తప్పుడు కేసులు కాశీం భార్య స్నేహలత

జూబ్లీహిల్స్‌, సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: వెనుకబడిన వర్గాల కోసం పుస్తకాలు రాసిన తన భర్తపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని కాశీం సతీమణి స్నేహలత అన్నారు. 2016లో నమోదైన కేసులను మళ్లీ తిరగదోడి అరెస్టు చేశారన్నారు. సోమవారం సిద్దిపేట కోర్టులో బెయిలు పిటిషన్‌ వేస్తామన్నారు. కోర్టు అనుమతించడంతో తన కుటుంబ సభ్యులతో కాశీం మాట్లాడారు. విచారణ అనంతరం పిటిషనర్‌ తరఫు న్యాయవాది రఘునాథ్‌, స్నేహలత మీడియాతో మాట్లాడారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.