close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీ ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమారే

ఆయన్ను తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ రద్దు
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
రమేశ్‌ను పునర్నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు

ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ప్రక్రియ మధ్యలో ఉండగా.. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నే పదవిలో నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ఆ ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తూ.. రమేశ్‌కుమార్‌ను తక్షణమే ఎస్‌ఈసీగా పునర్నియమించాలంటూ సంచలన తీర్పు ఇచ్చింది. చట్టనిబంధనలకు అనుగుణంగా ఆర్డినెన్స్‌ లేదని తేల్చిచెప్పింది. ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన పరిస్థితులే లేవని వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపునకు అనుసరించే విధానాన్నే ఎస్‌ఈసీ విషయంలోనూ పాటించాలని.. స్పష్టం చేసింది.  ఏపీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తొలగింపు సరికాదంటూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పదవీకాలం పూర్తి కాకుండా ఎస్‌ఈసీని తొలగించలేరని, అందుకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని తేల్చిచెప్పింది. పదవీకాలం పూర్తయ్యే వరకు ఎస్‌ఈసీగా కొనసాగేందుకు ఆయనకు హక్కు ఉందని తెలిపింది. రమేశ్‌కుమార్‌ను తక్షణమే ఎస్‌ఈసీగా పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్‌ఈసీ విషయంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ అధికరణ 213లో పేర్కొన్న నిబంధనలను సంతృప్తిపరిచేదిగా లేదని ఆక్షేపించింది.

చట్టనిబంధనలకు అనుగుణంగా ఆర్డినెన్స్‌ లేదని స్పష్టం చేసింది. ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితులూ లేవని తేల్చిచెప్పింది. పంచాయతీరాజ్‌చట్టం ప్రకారం ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది. ఆర్డినెన్స్‌ విషయమై గవర్నర్‌కు సిఫారసు చేసే అధికారం మంత్రివర్గానికి ఉంటుంది కానీ ప్రస్తుత విషయంలో అది సరికాదని అభిప్రాయపడింది. ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ను తొలగించేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేసింది. ఎస్‌ఈసీ పదవీకాలం మూడేళ్లకు కుదిస్తూ ఇచ్చిన 617 జీవో, రమేశ్‌కుమార్‌ పదవీకాలం పూర్తయినట్లు ఇచ్చిన 618 జీవో, కొత్త ఎస్‌ఈసీగా జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమిస్తూ జారీ చేసిన జీవో 619లనూ రద్దు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 332 పేజీలున్న కీలక తీర్పును వెలువరించింది. ఎస్‌ఈసీగా తనను తొలగించాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని, తన పదవీకాలాన్ని కుదిస్తూ, కొత్త ఎస్‌ఈసీగా జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమిస్తూ మూడు జీవోలిచ్చిందని, వాటన్నింటినీ రద్దు చేయాలంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. 2021 మార్చి 31 వరకు తాను ఎస్‌ఈసీగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు తదితరులు ఆర్డినెన్స్‌పై మొత్తం 13 వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 8న తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.

మొత్తం 13 వ్యాజ్యాలు
మాజీ ఎస్‌ఈసీˆ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కామినేని శ్రీనివాస్‌, తెదేపా నేత వర్ల రామయ్య, ఏపీˆసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ వలి, డాక్టర్‌ మద్దిపాటి శైలజ, మల్లెల శ్రావణ్‌కుమార్‌రెడ్డి, గండూరి మహేష్‌, ఎం.లక్ష్మణ శివప్రసాద్‌, న్యాయవాదులు తాండవ యోగేష్‌, కె.జితేంద్రబాబు, అప్పసాని వినీత్‌, డి.కిరణ్‌.. మొత్తం 13 వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ప్రభుత్వం, కొత్త ఎస్‌ఈసీ, ఎన్నికల సంఘం వాదన ఇదీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల కోసమే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చాం. ఎస్‌ఈసీˆ నియామకం, పదవీకాలం విషయంలో పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అధికరణ 243(కె) ప్రకారం ఎస్‌ఈసీ సర్వీసు నిబంధనలకు మాత్రమే రక్షణ ఉంది.. ‘పదవీ కాలానికి’ లేదు. ఎన్నికల సంఘంపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తటస్థంగా ఉండేందుకు విశ్రాంత హైకోర్టు జడ్జిని ఎస్‌ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే తప్ప రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించడానికి ఆర్డినెన్స్‌ తీసుకురాలేదు. ఆర్డినెన్స్‌ జారీలో ఎలాంటి దురుద్దేశమూ లేదు. వైద్యశాఖ నుంచి నివేదిక పొందకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు రమేశ్‌కుమార్‌ ప్రకటించడం సరికాదు.

వక్రమార్గంలోనే ఆర్డినెన్స్‌: హైకోర్టు ఆక్షేపణ
కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)ను నియమించేందుకు కార్యాచరణ ప్రారంభించాకే.. ఎస్‌ఈసీగా ఉన్న రమేశ్‌కుమార్‌ పదవీ కాలం కుదించేందుకు ఫైల్‌ ప్రారంభిÅంచినట్లు హైకోర్టు గుర్తించింది. సంబంధం లేని కారణాలతో, వక్రమార్గంలోనే ఆర్డినెన్స్‌కు సంబంధించిన ఫైళ్లు నడిచినట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు 22 మందిని ఛీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్లుగా నియమించారని, వాళ్లెవరూ 65 ఏళ్లు దాటినవారు కాదని గుర్తుచేసింది. 77 ఏళ్ల వ్యక్తిని కొత్త ఎస్‌ఈసీగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. దాన్ని ఎన్నికల సంస్కరణగా భావించలేమంది. రమేశ్‌కుమార్‌ పదవీకాలం పూర్తయినట్లు పేర్కొనేందుకు ఫైల్‌ను ఏప్రిల్‌ 10న రాత్రి 9.45 గంటలకు ప్రారంభించారని.. దానిపై గవర్నర్‌ సంతకం లేకుండానే పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ఆమోదంతో రాత్రి 10.07 గంటలకు జీవో 618 జారీ చేశారని ఆక్షేపించింది. సాధారణంగా ఎస్‌ఈసీని అధికరణ 243(కే)(1) ప్రకారమే గవర్నర్‌ నియమిస్తారు. అయితే కొత్త ఎస్‌ఈసీని ఆర్డినెన్స్‌ ద్వారా నియమించడం సరికాదని పేర్కొంది.


నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, ఇతర పిటిషనర్ల వాదనలు ఇవే..

ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా.. మరోవైపు దేశం మొత్తం లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ అత్యవసరంగా అర్డినెన్స్‌ తీసుకురావాల్సిన అవసరం లేదు. అందుకు ప్రభుత్వం చెబుతున్న కారణమూ ఆమోదయోగ్యంగా లేదు. హైకోర్టు జడ్జిని తొలగించడానికి అనుసరించే పద్ధతిలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీˆ)ని తొలగించాలని అధికరణ 243కే స్పష్టం చేస్తోంది. దాన్ని దాటవేయడానికే పదవీకాలాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. ఎస్‌ఈసీˆ పదవీకాలం కుదించడం ద్వారా నన్ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేశానన్న ఒక్క కారణమే రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణకు కారణమైంది. ప్రజాభద్రతకు భారీ ముప్పు పొంచి ఉందని అంచనా వేశాను. ఆ తర్వాత జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ విధించడం నా నిర్ణయం తప్పుకాదని నిరూపించింది. ఎన్నికలు వాయిదా వేయకపోతే రాష్ట్రం కరోనా హాట్స్పాట్, విపత్తు కేంద్రంగా మిగిలేది. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఎస్‌ఈసీˆగా తొలగించాలని ఆర్డినెన్స్‌, జీవోలు ఇచ్చే పనిలో నిమగ్నమైంది. అధికార పరిధిని దాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌.. అధికరణలు 243(కె)(2), 14, 21లను ఉల్లంఘించేదిగా ఉంది. ఎస్‌ఈసీˆగా పదవీకాలం కుదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనుకున్నా.. అప్పటికే ఎస్‌ఈసీˆగా కొనసాగుతున్న నాకు వర్తింపజేయడానికి వీల్లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ.. ఎస్‌ఈసీˆ పదవీకాలం 5-6 ఏళ్లు లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్లు నిండే వరకు ఉండాలని  2011లోనే సిఫార్సు చేసింది. వాటినీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల్లో సంస్కరణల కోసం ఆర్డినెన్స్‌ తెచ్చామని ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదు. ఎందుకంటే సంస్కరణల కోసమనే విషయాన్ని ఆర్డినెన్స్‌లో ప్రస్తావించలేదు. ఎస్‌ఈసీˆని తక్షణం తొలగించేందుకు చట్టం చేసే పరిధి శాసనసభకు గానీ, ఆర్డినెన్స్‌ తెచ్చే అధికారం ప్రభుత్వానికి గానీ లేదు. ఎస్‌ఈసీˆని ఇష్టం వచ్చినట్లు తొలగించి ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయడానికి వీల్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యమైంది. చట్టప్రకారం ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీˆకి పూర్తి విచక్షణాధికారం ఉంటుంది. వాయిదా నిర్ణయానికి ముందు ప్రభుత్వ అధికారులు, ఎన్నికల సంఘం కార్యదర్శిని సంప్రదించాలనే నిబంధనలేమీ లేవు. కేవలం రాజకీయ కారణంతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆర్డినెన్స్‌, తదనంతర జీవోలను రద్దు చేయండి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.