close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
100 దాటిన మరణాలు

రాష్ట్రంలో  కొత్తగా ఆరుగురి మృతి... 127 కరోనా కేసులు
జీహెచ్‌ఎంసీలో పరిధిలోనే 110

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా మరో ఆరుగురు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 105కు పెరిగింది. గురువారం మరో 127 మందికి వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవాసుల్లో నమోదైన కేసుల సంఖ్య 2,699కు చేరుకుంది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌) పరిధిలోనే అత్యధికంగా 110 నమోదవగా, ఆదిలాబాద్‌లో 7, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డిలో 1, ఖమ్మంలో 1 చొప్పున నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, అంతర్జాతీయ ప్రయాణికులు 448 మందిలో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,455 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 31 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య 1,587కు చేరింది. గురువారం నమోదైన కేసులతో కలుపుకుంటే.. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,147కు పెరిగింది.

ఉద్ధృతిని ఎదుర్కోవడమెలా?
రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగితే.. ఆ ఉద్ధృతిని ఎదుర్కోవడమెలా అనే అంశంపై వైద్యఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. జులై నెలాఖరు నాటికి కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయనే అంచనాలు వ్యక్తమవుతుండడంతో.. ఆ మేరకు చికిత్సకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టిపెట్టింది. మృతుల సంఖ్యను తగ్గించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను, చికిత్సలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. పడకల సంఖ్యను ఎలా పెంచుకోవాలి? ఎక్కడెక్కడ వసతులు సమకూర్చాలి? అనేవి ప్రధానాంశాలుగా మారతాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అదనంగా వైద్యులు, నర్సులు, ఇతర మానవ వనరుల నియామకం అంశం కూడా చర్చకొచ్చింది. ఈ నెలాఖరులోగా అవసరాల మేరకు ఒప్పంద ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.


గాంధీలో మృతురాలి బంధువుల ఆందోళన

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న ఓ గర్భిణి గురువారం మృతి చెందారు. ధూల్‌పేటకు చెందిన ఓ వ్యక్తి పదిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తర్వాత పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు తేలింది. ఆ విషయం తెలియక కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏడు నెలల గర్భిణి అయిన అతడి కుమార్తె(33)కు పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. గురువారం ఆమె మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపి చికిత్సలో లోపాలుంటే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. ఆమెకు వైద్య సేవల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రాజారావు తెలిపారు. బాధితురాలిని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి రిఫర్‌ చేశారని, ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిందన్నారు. ఆమె పరిస్థితిని ఎప్పటికప్పుడు భర్త, కుటుంబ సభ్యులకు వివరించామని రాజారావు తెలిపారు.


ఏపీలో 4 వేలు దాటాయ్‌
కొత్తగా 141 కరోనా కేసుల నమోదు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి విస్తృతమవుతోంది. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 9,986 మంది నమూనాలు పరీక్షించగా 141 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇందులో రాష్ట్రంలోవి 98, పొరుగు రాష్ట్రాల కేసులు 43 ఉన్నాయి. గత శనివారం నుంచి రోజుకు వందకుపైగానే నమోదవుతున్నాయి. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 4,112కు చేరింది. వైరస్‌ వ్యాప్తి మొదలైన తొలి వారంలో మూడు కేసులు ఉండగా 5వ వారానికి 572కు..10వ వారానికి 2560, 12వ వారానికి 4,112కు చేరుకున్నాయి. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 71కి చేరింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.