close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రోజుకు 11 ‘డిజిటల్‌’ తరగతులు

అయిదున్నర గంటలపాటు టీవీల ద్వారా పాఠాల ప్రసారం
ఇంటర్‌ విద్యార్థుల కోసం ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల కోసం ప్రతిరోజూ అయిదున్నర గంటలపాటు టీవీల ద్వారా పాఠాలను ప్రసారం చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ భావిస్తోంది. 30 నిమిషాలకొకటి చొప్పున 11 తరగతులు నిర్వహించాలని అనుకుంటోంది. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే 1.80 లక్షల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌లోని విద్య, నిపుణ ఛానెళ్ల ద్వారా పాఠాలను ప్రసారం చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనెల 17 నుంచి ఈ ప్రసారాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఇంటర్‌ విద్యాశాఖ ఇంకా తేదీ ఖరారు చేయలేదు. ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల పాఠాల కోసం రోజుకు 5.30 గంటల సమయం కావాలని ఇంటర్‌ విద్యాశాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే దాదాపు 40 శాతం పాఠాలను అధ్యాపకులతో రికార్డు చేయించారు. ఇందులో సుమారు 200 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. ఆరు నెలలపాటు ఈ డిజిటల్‌ పాఠాలను ప్రసారం చేస్తారు. కళాశాలలు తెరిచినా అవి కొనసాగుతూనే ఉంటాయి.

ఒక్కో గ్రూపునకు 3 పిరియడ్ల వరకు...
* ఇంటర్‌ జనరల్‌ ఒక ఏడాదిలో 14 సబ్జెక్టులు, ఒకేషనల్‌లో 22 సబ్జెక్టులు ఉండగా ఒక్కో గ్రూపునకు రోజుకు 3 తరగతులు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. హాజరు తీసుకోవడం, సందేహాలు తీర్చడం లాంటివి ఉండవు కాబట్టి ఒక్కో కాలాంశానికి 30 నిమిషాలపాటు చాలని నిర్ణయించారు.
* వారానికి అయిదు రోజులపాటు మాత్రమే పాఠాల ప్రసారం ఉంటుంది. మొదటి దశలో ద్వితీయ విద్యార్థులకు మాత్రమే బోధిస్తారు.
* టీవీల ద్వారా ప్రసారం చేసిన పాఠాలను, ఆసక్తి ఉన్న అధ్యాపకులు రికార్డు చేసిన పాఠాలను ఇంటర్‌బోర్డు యూ ట్యూబ్‌ ఛానెల్‌లో పొందుపరుస్తారు. విద్యార్థులు ఎప్పుడైనా వాటిని వినొచ్చు.
ముందు వెళ్లాలన్నారు...తర్వాత వద్దన్నారు
గంట వ్యవధిలోనే ఇంటర్‌ విద్యాశాఖ శుక్రవారం రెండు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. డిజిటల్‌ బోధన ప్రారంభిస్తున్నందున  ఈనెల 17 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, పీడీలు, గ్రంథాలయాధికారులు, బోధనేతర సిబ్బంది కళాశాలలకు వెళ్లాలని ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు ఇచ్చిన గంటలోనే వాటిని విరమించుకుంటున్నట్లు మరో ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముందుగా ఇచ్చిన ఉత్తర్వులను విరమించుకున్నట్లు తెలిసింది. కాంట్రాక్టు అధ్యాపకులను ఉద్యోగాల్లోకి తీసుకునేలా రెన్యువల్‌ ఉత్తర్వులు ఇవ్వలేదు. దాంతో గత రెండు నెలలుగా వారికి వేతనాలు అందడం లేదు. వాస్తవానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 90 శాతానికిపైగా కాంట్రాక్టు అధ్యాపకులే ఉన్నారు. దానికితోడు డిజిటల్‌ తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. ఈ క్రమంలోనే మొదట ఇచ్చిన ఉత్తర్వులను విరమించుకున్నట్లు సమాచారం.


అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌ల బొనాంజా
బీటెక్‌, ఫార్మసీ, పాలిటెక్నిక్‌ చదివే విద్యార్థినులకు వర్తింపు
బీటెక్‌, పాలిటెక్నిక్‌ చదివే ప్రతిభావంతులైన పేద విద్యార్థినులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ‘ప్రగతి’ పథకం కింద ఇస్తున్న ఉపకార వేతనాల సంఖ్యను భారీగా పెంచింది. దేశవ్యాప్తంగా 2014-15 విద్యా సంవత్సరం నుంచి రెండు వేల మంది బీటెక్‌ విద్యార్థినులకు, మరో రెండు వేలమంది పాలిటెక్నిక్‌ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. ఒక్కో విద్యార్థినికి ఏడాదికి రూ.50 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఈ విద్యా సంవత్సరం(2020-21) స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 4వేల నుంచి 10వేలకు పెంచుతూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీటీఈ ఛైర్మన్‌ సహస్రబుద్ధే ‘ఈనాడు’కు తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.