close

తాజా వార్తలు

మంత్రులెవరు?

30న జగన్‌ ప్రమాణస్వీకారం
  ఉప ముఖ్యమంత్రులు ఉంటారా?
  భారీగా పెరిగిన ఆశావహులు
  పదవులు ఆశిస్తున్న సీనియర్‌, జూనియర్‌ నేతలు
  25 మందికే మంత్రివర్గంలో అవకాశం
ఈనాడు - అమరావతి

అఖండ విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఏయే ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. 150 స్థానాల్లో వైకాపా గెలుపొందడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలువురు సీనియర్లు, జూనియర్లు మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చి 2011లో వైకాపా ప్రారంభించినప్పుడు... జగన్‌ని సీమాంధ్రకి చెందిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అనుసరించారు. వీరిలో నలుగురికి మంత్రి పదవులిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఖచ్చితంగా ఏ నలుగురు అన్న దానిపై స్పష్టత లేదు. అన్ని సామాజికవర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది. జగన్‌ రాయలసీమలోని పులివెందుల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నందున కోస్తా, ఉత్తరాంధ్రల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఒకరిద్దరిని తీసుకునే అవకాశం లేకపోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఎన్నికల ప్రచార సభల్లోనే జగన్‌ ప్రకటించారు. చిలకలూరిపేట టిక్కెట్‌ని త్యాగం చేసినందుకు పార్టీ నేత మర్రి రాజశేఖర్‌ని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని పేర్కొన్నారు. నెల్లూరు నగరం నియోజకవర్గం నుంచి హోరాహోరీ పోరులో గెలుపొందిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేరు సైతం పరిశీలనలో ఉన్నా... అతన్ని మరో ముఖ్య పదవికి ఎంచుకోవచ్చన్న ప్రచారం ఉంది.

మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారిలో...
శ్రీకాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం), కళావతి (పాలకొండ), రెడ్డి శాంతి (పాతపట్నం).
విజయనగరం: బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), పుష్ప శ్రీవాణి(కురుపాం), రాజన్నదొర(సాలూరు).
విశాఖపట్నం: గుడివాడ అమరనాధ్‌(అనకాపల్లి), గొర్లె బాబూరావు(పాయకరావుపేట), ముత్యాలనాయుడు(మాడుగుల).
తూర్పుగోదావరి: సుభాష్‌ చంద్రబోస్‌(ఎమ్మెల్సీ కోటా), కన్నబాబు(కాకినాడ రూరల్‌), దాడిశెట్టి రాజా(తుని).
పశ్చిమగోదావరి: ఆళ్ల నాని(ఏలూరు), తెల్లం బాలరాజు(పోలవరం), తానేటి వనిత(కొవ్వూరు), గ్రంథి శ్రీనివాస్‌ (భీమవరం).
కృష్ణా: పేర్ని నాని(మచిలీపట్నం), ఉదయభాను(జగ్గయ్యపేట), పార్థసారథి(పెనమలూరు), మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు(నూజివీడు).
గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి), మర్రి రాజశేఖర్‌(ఎమ్మెల్సీ కోటా), అంబటి రాంబాబు(సత్తెనపల్లి), కోన రఘుపతి(బాపట్ల).
ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), ఆదిమూలపు సురేష్‌(యర్రగొండపాలెం).
నెల్లూరు:  మేకపాటి గౌతంరెడ్డి(ఆత్మకూరు), రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి(కావలి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి).
చిత్తూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు), కరుణాకర్‌రెడ్డి(తిరుపతి), రోజా(నగరి).
కడప: శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), అంజాద్‌ బాషా(కడప).
కర్నూలు: బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి(డోన్‌), శ్రీదేవి(పత్తికొండ), హఫీజ్‌ఖాన్‌ (కర్నూలు).
అనంతపురం: అనంత వెంకట్రామిరెడ్డి(అనంతపురం), కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం), శంకర్‌నారాయణ(పెనుగొండ).

జగన్‌ ప్రభంజనంలో తెదేపా కొట్టుకుపోయింది: ప్రశాంత్‌ కిశోర్‌
‘జగన్‌ ప్రభంజనంలో తెదేపా కొట్టుకుపోయింది. కేవలం 25 సీట్లకే ఆ పార్టీ పరిమితయయ్యే పరిస్థితి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా జగన్‌ సునామీ కనిపించింది’ అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌  అన్నారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

26న కడపకు వైఎస్‌ జగన్‌
పులివెందుల గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 26న కడప జిల్లాకు రానున్నట్లు సమాచారం. మొదటగా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయకు వెళ్లి తండ్రి దివంగత వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం గండి వీరాంజనేయస్వామి, పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి, కడపలోని పెద్దదర్గాలను జగన్‌ సందర్శించనున్నట్లు సమాచారం.

జగన్‌కు కన్నా, జీవీఎల్‌ అభినందనలు
జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు.ప్రధాని మోదీ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి జగన్‌ కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు జీవీఎల్‌ నరసింహరావు ట్వీట్‌ చేశారు. భాజపాను దూషించి లబ్ధిపొందాలని తెదేపా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు.

జగన్‌కు స్వరూపానందేంద్ర ఆశీస్సులు
విశాఖపట్నం(పెందుర్తి), న్యూస్‌టుడే: వైకాపా అధినేత జగన్‌ గురువారం విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్‌ చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు శారదాపీఠం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల్లో విజయానికి ఎనలేని కృషి చేసిన స్వామీజీకి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని జగన్‌ తెలిపారన్నారు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో సత్తాచాటిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్వామీజీ ఫోన్‌లో ఆశీర్వచనాలు అందించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిపాలన చేయాలని స్వరూపానందేంద్ర ఆకాంక్షించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.