close

తాజా వార్తలు

ప్రజావేదిక కూల్చివేత

శరవేగంగా సాగుతున్న పని
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఇదే నాంది: సీఎం
తాడేపల్లిలో మరో భవన నిర్మాణం?
ఈనాడు - అమరావతి

ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేతను అధికారులు మంగళవారం సాయంత్రం చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి భవనం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను కొంత మేర కూల్చివేశారు. ప్రధాన భవనం పక్కనే నిర్మించిన ప్యాంట్రీ, చిన్న డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లను తొలగించారు. ప్రధాన భవనం కూల్చివేత పనులను ప్రారంభించారు. భవన ప్రవేశ ద్వారంవద్ద మెట్లు, ఎలివేషన్‌ను తొలగించారు. మంగళవారం రాత్రి ఒంటి గంట సమయానికి ప్రజావేదిక కూల్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. బుధవారం నాటికి భవనం కూల్చివేత పనులు చాలావరకు పూర్తయ్యే అవకాశముంది. ప్రజావేదిక భవనాన్ని గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున కూల్చివేస్తామని కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఆ నేపథ్యంలో మంగళవారం సదస్సు ముగిసిన వెంటనే సీఆర్‌డీఏ అధికారులు రంగంలోకి దిగారు. పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం సాయంత్రం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకపక్క ఈ సమావేశం జరుగుతుండగానే... సాయంత్రం 6 గంటల సమయంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనరు విజయకృష్ణన్‌ సారథ్యంలో కొందరు అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది ప్రజావేదిక వద్దకు బయల్దేరి వెళ్లారు. కాసేపటికి 3, 4 ఆటోల్లో కూలీలు అక్కడికి చేరుకున్నారు. భవనంలో ఉన్న ఏసీలు, కంప్యూటర్లు, కుర్చీలు, బల్లల వంటి వస్తువుల జాబితాను విజయకృష్ణన్‌ సిద్ధం చేశారు. పూలకుండీలు, కుర్చీలు, కంప్యూటర్ల వంటి వస్తువుల్ని లారీల్లోకి ఎక్కించి వివిధ ప్రాంతాలకు తరలించారు. పూలకుండీలను హైకోర్టు సమీపంలో ఉన్న నర్సరీకి పంపించారు. కొంత ఫర్నిచర్‌ను సచివాలయానికి తరలించారు. అమరావతిలో ఐఏఎస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ల వద్దకు కొంత ఫర్నిచర్‌, కంప్యూటర్లను తరలించారు. రాత్రి 12 గంటల సమయానికి కూడా ఫర్నిచరు, ఏసీలు, దృశ్యశ్రవణ ప్రదర్శన పరికరాలు వంటి వాటిని లారీల్లో తరలిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భవనాన్ని కూల్చి వేస్తున్నారని తెలిసి రాజధానికి చెందిన కొందరు రైతులు, తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని పంపించేశారు. మీడియా ప్రతినిధుల్ని లోపలికి అనుమతించకుండా కూల్చివేత ప్రక్రియ కొనసాగించారు.

చంద్రబాబు రాక నేపథ్యంలో అప్రమత్తం
విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి 12 గంటల సమయానికి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రజావేదిక చంద్రబాబు ఇంటి పక్కనే ఉండటం, ఒకపక్క కూల్చివేత పనులు జరుగుతుండగా ఆయన వస్తుండటంతో పోలీసులు ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం రాత్రి 11.15కి గన్నవరం విమానాశ్రయానికి చేరకున్న చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. చంద్రబాబు కాన్వాయ్‌ వెంట వాహనాల్లో అనుసరించిన తెదేపా కార్యకర్తల్ని ఎనికేపాడు, రామవరప్పాడు రింగ్‌వద్ద పోలీసులు ఆపేశారు. కృష్ణా కరకట్టమీదుగా చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లేందుకు అనుమతించారు. చంద్రబాబు కాన్వాయ్‌ రాత్రి 12 గంటల సమయానికి ఆయన నివాసానికి చేరుకుంది. తెదేపా ముఖ్య నేతలతో బుధవారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు తన నివాసంలో భేటీ అవుతున్నారు. ప్రజావేదిక కూల్చివేతతో పాటు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

తాడేపల్లిలో మరో భవన నిర్మాణం?
ప్రజావేదిక భవనాన్ని కూల్చివేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ల సదస్సు వంటి అధికారిక సమావేశాల నిర్వహణకు తాడేపల్లిలో ఒక భవనాన్ని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.

అక్రమ నిర్మాణాల కూల్చివేతకు నాంది: సీఎం
కృష్ణా నది కరకట్ట లోపలి భాగంలో నిర్మించిన ప్రజావేదిక భవనంతోనే అక్రమ నిర్మాణాల కూల్చివేతను మొదలు పెడతున్నామని, ఆ తర్వాత ఉండవల్లి కరకట్ట రోడ్డును ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలనూ తొలగిస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఎస్పీల సమావేశంలో ప్రకటించారు. ‘మొన్నటి వరకూ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ పక్కనే ఉన్న అక్రమ భవనంలో నివాసముంటున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఆయనే మరో అక్రమ భవనాన్ని నిర్మింపజేశారు. ముఖ్యమంత్రో, కలెక్టరో, ఎస్పీయో అని చెప్పి అక్రమ నిర్మాణాలు చేపట్టడం సరైనదేనా? బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారే తప్పు చేసినప్పుడు ఇతరులను ప్రశ్నించే నైతికత ఎక్కడ నుంచి వస్తుంది? అందుకే ప్రజావేదిక భవనంతోనే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభిస్తాం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఇదో సంకేతంగా నిలవాలి. జిల్లాల్లోనూ మీరు ఇదే తరహాలో వ్యవహరించాలి’ అని ఎస్పీలకు సీఎం సూచించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.